పాట్నా: ఎన్నికల వ్యూహకర్త, రాజకీయ నేత ప్రశాంత్ కిశోర్ తన కొత్త పార్టీ కోసం రూ.200 కోట్ల విరాళాలు సేకరిస్తామని తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా 2 కోట్ల మంది ప్రజల నుంచి ఒక్కొక్కరికి నుంచి రూ.100 చొప్పున విరాళాలు తీసుకుంటామని ఆయన పేర్కొన్నారు. ప్రశాంత్‌కిశోర్ ఇప్పటికే జన్ సూరజ్ పేరుతో రాజకీయ పార్టీని ప్రకటించారు. 2025లో జరిగే బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తామని ప్రకటించారు.
కాగా, పార్టీ కోసం వనరులను సమకూర్చుకునే ప్రణాళికల గురించి మీడియా ప్రశ్నించగా.. ఆయన తన వ్యూహాన్ని వెల్లడించారు. ‘మేము ఇతర పార్టీల మాదిరిగా అక్రమ మద్యం వ్యాపారం, మైనింగ్ మాఫియా ఇచ్చే విరాళాలపై ఆధారపడబోము. ప్రజల నుంచే రూ.100 చొప్పున చిన్న మొత్తంలో విరాళాలు తీసుకుంటాం. ఎన్నికల నాటికి 2 నెలల్లో రూ.200 కోట్లకు పైగా సేకరిస్తాం” అని కిశోర్ తెలిపారు.