ప్రసాద్​ స్కీం పనులు వెరీ స్లో!

  • భద్రాచలం, పర్ణశాలల్లో వసతుల కోసం రూ.41 కోట్లు కేటాయించిన కేంద్రం 
  • కాంట్రాక్టర్​ నిర్లక్ష్యంపై ఇప్పటికే ఐదుసార్లు నోటీసులు 
  • అయినా ముందుకు కదలని పనులు 
  • తలలు పట్టుకుంటున్న టూరిజం ఆఫీసర్లు
  • రేపు పనులు పరిశీలించనున్న రాష్ట్ర మంత్రులు 

భద్రాచలం, వెలుగు :  భద్రాచలం, పర్ణశాలల్లో ప్రసాద్​ (పిలిగ్రివేజు రెజువంటేషన్​ అండ్​ స్పిర్చువల్​ ఆగ్​మెంటేషన్​ డ్రైవ్​) స్కీం పనులు ముందుకు సాగడం లేదు. భద్రాచలం సీతారామచంద్రస్వామి దేవస్థానంలో భక్తులకు మౌలిక వసతులు కల్పించడం కోసం కేంద్ర పర్యాటక శాఖ రూ.41.38కోట్లు కేటాయించింది. 2022 డిసెంబరులో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము భద్రాచలంలో పనులకు శంకుస్థాపన చేశారు. 2023 జూన్​లో టెండర్లు పొందిన కాంట్రాక్టర్​ టూరిజం శాఖతో 2024 డిసెంబరు నాటికి పనులు పూర్తి చేసేందుకు అగ్రిమెంట్​ చేసుకున్నారు.

కానీ నాటి నుంచి కాంట్రాక్టర్​ నిర్లక్ష్యం కారణంగా పనులు ముందుకు పడటం లేదు.  ఏవేవో కారణాలు చెబుతూ పనులు నిలిపివేయడం, తర్వాత మొదలుపెట్టడం చేస్తున్నారు. తెలంగాణ టూరిజం ఇంజినీరింగ్​ ఆఫీసర్లు వెంటపడుతున్నా, నోటీసులు ఇచ్చినా కాంట్రాక్టర్​ స్పందించడం లేదు. కాంట్రాక్టర్ కు అధికారులు  ఇప్పటికే  ఐదు సార్లు నోటీసులు ఇచ్చారు. కానీ మార్పు మాత్రం కనిపించడం లేదు. రూ.22కోట్లతో సివిల్స్ వర్క్స్ పూర్తయితే మిగిలిన పనులు మొదలుపెట్టేందుకు ఇంజినీర్లు ఎదురుచూస్తున్నారు.

మిథిలాస్టేడియం వెనుక భాగంలో రూ.6.94కోట్లతో భక్తులకు అవసరమైన వసతులతో కూడిన భవనాన్ని నిర్మిస్తున్నారు. ఆ పనులు ఇంకా పునాదుల్లోనే ఉన్నాయి. గోదావరి బ్రిడ్జి పాయింట్​లో కూడా భవన నిర్మాణం అసంపూర్తిగానే ఉంది. పర్ణశాలలో చేపట్టిన పనుల విషయంలో భూమి వివాదం ఉండడంతో మార్చి నెలలో వేరే చోట భూమిని కేటాయించారు. అక్కడ పునాదులు తీసి వదిలేశారు. మార్చి నెలలో తెలంగాణ టూరిజం ప్రిన్సిపల్​ సెక్రటరీ శైలజా రామయ్యర్​ భద్రాచలం, పర్ణశాలలలో పర్యటించి అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ ఏడాది డిసెంబర్​ కల్లా పనులు పూర్తి చేయాలని ఆదేశించారు. కానీ అప్పటి నుంచి కూడా ఒక్క అడుగూ ముందుకు పడలేదు. 

భక్తులకు తప్పని ఇబ్బందులు..

2022లోనే ప్రసాద్​ స్కీం ద్వారా భద్రాచలం సీతారామచంద్రస్వామి దేవస్థానానికి వచ్చిన రూ.41.38కోట్లు బ్యాంకుల్లో మూలుగుతున్నాయి. ఈ పనులు పూర్తయితే భక్తులకు సదుపాయాలు లభిస్తాయి.  కానీ కాంట్రాక్టర్​ నిర్లక్ష్యం కారణంగా ఇప్పుడు భక్తులు ఇబ్బంది పడాల్సి వస్తోంది. రూ.6.94కోట్లతో మిథిలాస్టేడియం వెనుక భవనం, రూ.3.51కోట్లతో వ్రతమండపం, రూ.42.90లక్షలతో గోదావరి తీరాన డ్రెస్​ ఛేంజింగ్​ రూమ్, గోదావరి బ్రిడ్జి సమీపంలో స్వాగత ద్వారం, రూ.16.30లక్షలతో బ్యాటరీ కార్లు, భద్రాచలం, పర్ణశాల ఆలయాల్లో ఫ్లోరింగ్​కు రూ.1.21కోట్లు, ప్రసాదాయల తయారీకి అధునాతన మిషన్లు, వంటశాల ఆధునీకరణ, టెంపుల్​ వరకు సెంట్రల్​ లైటింగ్​ ఇలా అనేక రకాల పనులు చేయాల్సి ఉంది. 

పనుల పరిశీలనకు మంత్రుల రాక

ప్రసాద్​ స్కీం పనుల పరిశీలనకు తెలంగాణ టూరిజం మినిస్టర్​ జూపల్లి కృష్ణారావు, జిల్లాకు చెందిన ముగ్గురు మంత్రులు సోమవారం భద్రాచలం వస్తున్నారు. ఇందుకు టూరిజం ఆఫీసర్లు ఏర్పాట్లు చేస్తున్నారు. కానీ ఇన్​కంప్లీట్​ పనులతో జిల్లాకు చెందిన మంత్రులు తీవ్ర అసంతృప్తితో  ఉన్నారు.