మండలాల్లో ప్రజావాణి స్టార్ట్​

  •     ఖమ్మం జిల్లాలో  కొత్త విధానానికి కలెక్టర్​ముజామ్మిల్ ఖాన్ శ్రీకారం
  •     సమస్యలను ఎక్కడికక్కడ పరిష్కరించడమే లక్ష్యం 
  •     కలెక్టరేట్ లోనూ యధావిధిగా గ్రీవెన్స్​ 

ఖమ్మం, వెలుగు : ఖమ్మం జిల్లా కలెక్టర్​ముజామ్మిల్ ఖాన్​ పరిపాలనలో మరో కొత్త విధానానికి శ్రీకారం చుట్టారు. ప్రజావాణి పేరిట జిల్లా కేంద్రంలో ప్రతి సోమవారం నిర్వహించే కార్యక్రమాన్ని, ఇకపై మండలాల్లో కూడా నిర్వహించాలని నిర్ణయించారు. తొలిసారిగా ఈ సోమవారం నుంచి దాన్ని అమల్లోకి తీసుకువచ్చారు. ఆయా గ్రామాల్లో రైతులు, ఇతరులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారం కోసం ఒక రోజంతా కేటాయించి జిల్లా కేంద్రానికి రావాల్సిన అవసరం లేకుండా, ఎక్కడి సమస్యలను ఆ మండలంలోనే పరిష్కరించేందుకు గాను ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు.

మండలాల్లో వచ్చిన అర్జీలు, వాటి పరిష్కారంపై ఎప్పటికప్పుడు నివేదిక రూపంలో తనకు సమర్పించాలని అధికారులను ఆదేశించారు. మండల తహసీల్దార్​ కార్యాలయాల్లోనే ప్రజావాణి నిర్వహించడంపై దరఖాస్తుదారుల నుంచి సానుకూల స్పందన వస్తోంది. సోమవారం ఆయా మండలాల్లో నిర్వహించిన ప్రజావాణిలో మొత్తం 536 దరఖాస్తులు రాగా, అత్యధికంగా రెవెన్యూకు సంబంధించిన దరఖాస్తులు 363 ఉన్నాయి. ఆ తర్వాత పంచాయతీరాజ్ డిపార్ట్ మెంట్ కు సంబంధించి 77, జిల్లా పరిషత్ కు సంబంధించి 31, వ్యవసాయశాఖకు సంబంధించి 22 అర్జీలు వచ్చాయి.

ఇక జిల్లా స్థాయిలో మాత్రమే పరిష్కరమయ్యే సమస్యల గురించి కలెక్టరేట్​యధావిధిగా గ్రీవెన్స్​ డే కొనసాగుతుంది. సోమవారం వైరా మండలంలో నిర్వహించిన ప్రజావాణిలో కలెక్టర్​ ముజామ్మిల్ ఖాన్​పాల్గొన్నారు.  

ఎక్కడెక్కడ.. ఏ సమస్య? 

ఖమ్మం టౌన్/కామేపల్లి/సత్తుపల్లి : కలెక్టరేట్​లో నిర్వహించే గ్రీవెన్స్ డే కు 135 అర్జీలు వచ్చాయి. వీటిలో 35 ధరణికి సంబంధించినవి కాగా, మిగతా 100 అర్జీలు పెన్షన్, కల్యాణ లక్ష్మి, రైతుబంధు, దళితబంధు, రుణమాఫీ, పాస్ పుస్తకాల సవరణ ఇతరేతర సమస్యలపై వచ్చాయి.  అడిషనల్ కలెక్టర్ ఎన్. మధుసూదన్ నాయక్ కు అర్జీలు స్వీకరించారు. 

  •     లేని భూమిని ఉన్నట్లుగా సృష్టించి నష్ట పరిహారం పొందేందుకు వీఆర్ఏ ప్రయత్నిస్తున్నట్లు సత్తుపల్లిలో జరిగిన ప్రజావాణిలో తహసీల్దార్ యోగేశ్వరరావుకు యాతాలకుంట గ్రామస్తులు వెంకటనారాయణ, మరియమ్మ ఫిర్యాదు చేశారు. ఇక్కడ పలు సమస్యలపై 22 దరఖాస్తులు వచ్చాయి. 
  •     కామేపల్లిలో తహసీల్దార్ సుధాకర్ అర్జీలు స్వీకరించగా రెండు దరఖాస్తులు వచ్చాయి. 
  •     కల్లూరు మండలంలో ఆసరా పెన్షన్లు, గ్యాస్ సబ్సిడీ, రుణమాఫీ, భూ సమస్యలు పట్టాదార్ పాస్ పుస్తకాల కోసం ప్రజలు దరఖాస్తులు సమర్పించారు. 

కలెక్టర్​ తనదైన మార్క్..​ 

జిల్లా పరిపాలన వ్యవహారాల్లో కలెక్టర్​ ముజామ్మిల్ ఖాన్​ తనదైన మార్క్​ చూపిస్తున్నారు. జిల్లాలో బాధ్యతలు తీసుకున్న వెంటనే ధరణి సమస్యల పరిష్కారం కోసం కలెక్టరేట్ లో ప్రత్యేక హెల్ప్​ డెస్క్​ ను ఏర్పాటుచేశారు. ధరణి దరఖాస్తులకు సంబంధించి గైడ్​ చేసేందుకు ఈ హెల్ప్ డెస్క్​ ను ప్రారంభించి, తర్వాత ఆర్డీవో కార్యాలయాలకు, ఆ తర్వాత తహసీల్దార్​ ఆఫీసుల్లో హెల్ప్​ డెస్క్​ లను ఏర్పాటుచేయాలని నిర్ణయించారు. కలెక్టరేట్​ లో గ్రామీణ వాతావరణం ఉట్టిపడేలాపెయింటింగ్స్​ వేయించారు.

గురుకులాలు, ప్రభుత్వ పాఠశాలలు, వసతి గృహాల్లో ఆహార నాణ్యతపై ఫిర్యాదులు వస్తుండడంతో జిల్లా స్థాయి అధికారులను ఆయా విద్యాసంస్థల్లో ఆకస్మిక తనిఖీలు చేసి, స్టూడెంట్స్​ కు మంచి ఫుడ్ అందించేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇక మండలాలు, గ్రామాల్లో పర్యటన సమయంలో రైతులతో కలిసి నేలపై కూర్చుని మాట్లాడుతూ, వారితో కలిసిపోయి వారి సమస్యలను తెలుసుకుంటున్నారు. 

సంతోషంగా ఉంది

మండల స్థాయిలోనే ప్రజావాణి కార్యక్రమం అందుబాటులోకి రావడం సంతోషకరం. ఖమ్మం వెళ్లడానికి ఒక రోజంతా కేటాయించాల్సి వచ్చేది. ఇప్పుడు దూర భారం తగ్గింది.  పహాణీలపై తీసుకున్న రుణాలకు రుణమాఫీ జరగలేదని ఫిర్యాదు చేసేందుకు నేను ప్రజావాణికి వెళ్లా. 

- గడ్డం వెంకటేశ్వర్లు, రైతు, ఉసిరికాయలపల్లి, కారేపల్లి మండలం 

స్థానిక ప్రజల సమస్యల పరిష్కారం కోసమే 

సమస్యను చెప్పుకునేందుకు రైతులు, కూలీలు, సామాన్యులు ఒక రోజు మొత్తం కేటాయించి జిల్లా కలెక్టరేట్​ కు రావడం, ఇబ్బందులు పడడం గమనించి ఈ నిర్ణయం తీసుకున్నాం. మండల కేంద్రాల్లో జరిగే గ్రీవెన్స్ డే ను ప్రతి ఒక్కరూ సద్వినియోగించుకోవాలి 

- ముజామ్మిల్ ఖాన్, ఖమ్మం జిల్లా కలెక్టర్