మిగులు రాష్ట్రాన్ని కేసీఆర్ అప్పుల కుప్ప చేసిండు : కేఏ పాల్

  • రేవంత్ కు చేయాలని ఉన్నా.. సర్కార్ ఖజానాలో డబ్బుల్లేవ్
  • అభివృద్ధి చేయని బండి సంజయ్ పేరుకే సహాయ మంత్రి
  • కేటీఆర్ అవినీతి చేస్తే కేసులు పెట్టక.. భారతరత్న ఇస్తారా 
  • కరీంనగర్ లో సమగ్ర శిక్ష ఉద్యోగుల సమ్మెకు మద్దతు  

కరీంనగర్ టౌన్, వెలుగు: రూ.1.5 లక్షల కోట్ల మిగులు బడ్జెట్ తో తెలంగాణను ఇస్తే, కేసీఆర్ రూ.7 లక్షల కోట్ల అప్పుల కుప్పగా మార్చాడని ప్రజాశాంతి పార్టీ చీఫ్ కేఏ పాల్ మండిపడ్డారు. రాష్ట్రం చాలా క్లిష్ట పరిస్థితుల్లో ఉందని, ఖజానాలో డబ్బులు లేవని.. ఇప్పటికే రేవంత్ రెడ్డి రూ.1.3లక్షల కోట్ల అప్పులు చేశాడని పేర్కొన్నారు. సోమవారం కరీంనగర్ కలెక్టరేట్ ఎదుట సమగ్ర శిక్ష ఉద్యోగుల దీక్షకు ఆయన మద్దతు తెలిపి మాట్లాడారు. 19వేలకు పైగా ఉన్న సమగ్ర శిక్ష ఉద్యోగులను వెంటనే రెగ్యులర్ చేయాలని డిమాండ్ చేశారు. రెగ్యులర్ కావాలంటే  తన నంబర్ 7569441275కు  ఫోన్ చేయాలని సూచించారు.  రేవంత్ రెడ్డికి చాలా చేయాలని ఉందని, తెలంగాణ ప్రభుత్వం  ప్రస్తుతం అప్పులకే వడ్డీలు కట్టలేని స్థితిలో ఉందన్నారు. 

 రాష్ట్రానికి బీజేపీ ఏమీ  చేయలేదని, కరీంనగర్‌‌‌‌ ఎంపీ  బండి సంజయ్ కూడా పేరుకే సహాయ మంత్రి అని ఎద్దేవా చేశారు. అవినీతి చేసిన వాళ్లపై కేసులు పెట్టకుండా భారతరత్న ఇస్తారా.. అని కేటీఆర్ ను ఉద్దేశించి ఎద్దేవా చేశారు.  దళితుడిని  సీఎం చేస్తానని కేసీఆర్ చేయలేదని, అలాంటి దొంగ మాటలు ప్రజలు ఇంకా ఎన్నాళ్లు నమ్ముతారన్నారు.   తను సీఎంను అవుతానా, పీఎంను అవుతానా అని దేవుడు నిర్ణయిస్తాడ న్నారు. ఏపీలో నెలకు రూ.12వేల కోట్ల అప్పు చేస్తున్నారని, ఆ విషయం బయటకు రాకుండా లడ్డూ వివాదం తెరమీదకు తెచ్చారని విమర్శించారు. సనాతన ధర్మం అంటున్న పవన్ క్రిస్టియన్ అమ్మాయిని ఎలా పెండ్లి చేసుకున్నాడని ఆయన ప్రశ్నించారు. 

దాడి చేసేందుకే కేటీఆర్ పవర్ పోయింది

సిద్దిపేట టౌన్ :  నెల రోజులుగా సమగ్ర శిక్ష ఉద్యోగులు రెగ్యులరైజ్ చేయాలని సమ్మె చేస్తుంటే సీఎం రేవంత్ రెడ్డికి చీమకుట్టినట్లుగా కూడా లేదని కేఏ పాల్ అన్నారు. అప్పట్లో తనపై దాడికి దిగిన కేటీఆర్ ఇప్పుడు అధికారం పోయాక తన మాట వింటున్నారన్నారు.  రేవంత్ కూడా అధికారం పోయాక మళ్లీ తన దగ్గరికే వస్తారని ఆయన జోస్యం చెప్పారు. సంగారెడ్డి జిల్లాలోని సదాశివపేటలో 1200 ఎకరాల్లో యువతకు ట్రైనింగ్ సెంటర్ ను ఏర్పాటు చేశానని, తెలంగాణలో 3.10 లక్షల మందికి అనాథలను చదివించానన్నారు. 40 లక్షల మంది వితంతువులను ఆదుకున్నానన్నారు. ప్రజాశాంతి పార్టీలో మెంబర్ షిప్ తీసుకొని పార్టీ తరపున గెలిచిన గ్రామాలను వంద రోజుల్లో అభివృద్ధి చేస్తానని ఆయన హామీ ఇచ్చారు.