ఓరుగల్లు ప్రజాపాలన, ఇందిరా మహిళాశక్తి విజయోత్సవ సభ గ్రాండ్​ సక్సెస్

  • రూ.4601.15 కోట్ల పనులకు శంకుస్థాపన చేసిన సీఎం రేవంత్​ రెడ్డి 
  • సీఎం, మంత్రుల రాకతో ఆర్ట్స్​ కాలేజీ గ్రౌండ్​ కిటకిట

హనుమకొండ, వరంగల్, వెలుగు : కాంగ్రెస్​ ప్రభుత్వం వచ్చి ఏడాది అవుతున్న సందర్భంగా  ఓరుగల్లులో   మంగళవారం నిర్వహించిన   ప్రజాపాలన, ఇందిరా మహిళాశక్తి విజయోత్సవ సభ గ్రాండ్​ సక్సెస్​ అయింది.  సీఎం రేవంత్​ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రుల రాకతో  సభా ప్రాంగణం హనుమకొండ ఆర్ట్స్​ కాలేజీ గ్రౌండ్​కు  జనం భారీగా తరలివచ్చారు.  మొదట ఇందిరాగాంధీ చిత్రపటానికి పూలమాలవేసి  నాయకులు  నివాళులర్పించారు.  

 రూ.4,601.15 కోట్ల పనులకు శంకుస్థాపన

 దశాబ్ధకాలంగా ఓరుగల్లు ప్రజలు  వేచిచూస్తున్న కాళోజీ కళాక్షేత్రాన్ని సీఎం రేవంత్​ రెడ్డి   ప్రారంభించారు. హైదరాబాద్​ నుంచి ప్రత్యేక హెలీక్యాప్టర్​ లో మధ్యాహ్నం 2.40 గంటలకు కుడా గ్రౌండ్ కు చేరుకున్న ఆయన మొదట కాళోజీ కళాక్షేత్ర ప్రాంగణంలో కాళోజీ కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించారు. అనంతరం కుడా మాస్టర్​ ప్లాన్​- ను రిలీజ్ చేసి, కళాక్షేత్రాన్ని ప్రారంభించారు. అనంతరం కాళోజీ  ఫొటో గ్యాలరీని, షార్ ఫిలిమ్​ను వీక్షించారు.  అనంతరం రూ.4,601.15 కోట్ల విలువైన వివిధ పనులకు శంకుస్థాపన చేశారు.   మధ్యాహ్నం  ఆర్ట్స్​ కాలేజీ గ్రౌండ్​ లో నిర్వహించిన బహిరంగ సభలో ప్రసంగించారు.  

బహిరంగ సభలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ప్రభుత్వ ప్రధాన సలహాదారు వేం నరేందర్ రెడ్డి, ప్రభుత్వ రాజకీయ సలహాదారు కె.కేశవరావు, తెలంగాణ స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ సిరిసిల్ల రాజయ్య, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి,  ఎంపీలు బలరాం నాయక్, డాక్టర్ కావ్య, ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య, మధుసూదనాచారి, గ్రేటర్  మేయర్  గుండు సుధారాణి, ఎమ్మెల్యేలు నాయిని రాజేందర్ రెడ్డి, కడియం శ్రీహరి, రేవూరి ప్రకాశ్​ రెడ్డి, కేఆర్​ నాగరాజు, యశస్వినీ రెడ్డి,  కుడా చైర్మన్ ఇనుగాల వెంకట్రాంరెడ్డి, రాష్ట్ర, జిల్లా స్థాయి  అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

హామీలన్నీ నెరవేరుస్తున్నం 

బీఆర్​ఎస్​  పాలకుల నిర్వాకం వల్ల రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఇబ్బందికరంగా ఉన్నా ఇచ్చిన మాట ప్రకారం హామీలన్నీ నెరవేరుస్తున్నామని రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి దుద్దిల శ్రీధర్ బాబు అన్నారు.  మంత్రి జూపల్లి కృష్ణారావు మాట్లాడుతూ గత బీఆర్ఎస్ పాలకులు రాష్ట్రాన్ని 8 లక్షల కోట్ల అప్పుల్లో ముంచి చిప్ప చేతికిచ్చారని మండిపడ్డారు. కానీ తమ ప్రభుత్వం మహిళల అభ్యున్నతికి పెద్దపీట వేస్తూ  ప్రణాళిక ప్రకారం ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేరుస్తోందన్నారు. మంత్రి పొన్నం ప్రభాకర్​ మాట్లాడుతూ రాష్ట్రంలో 3,720 కోట్లతో ఆర్టీసీ బస్సుల ద్వారా  110 కోట్ల మహిళలకు ఉచిత ప్రయాణం అందిచామన్నారు. మహిళా సంఘాల ద్వారా 600 బస్సులు కొనుగోలు చేసేలా చర్యలు తీసుకుంటున్నామని వెల్లడించారు. 

ఉమ్మడి నల్గొండ జిల్లాకు ఓ వైపు ఫ్లోరైడ్​, మరోవైపు మూసీ ఉన్నా గత పాలకులు పట్టించుకోలేదని, ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం మూసీ పునరుజ్జీవానికి శ్రీకారం చుడితే బీఆర్​ఎస్​ లోని బావ, బావమరుదులు, బీజేపీలోని కేంద్ర మంత్రులు అడ్డుపడుతున్నారని రాష్ట్ర మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి విమర్శించారు. మూసీ పునరుజ్జీవాన్ని అడ్డుకుంటే పుట్టగతులుండవని స్పష్టం చేశారు. రాష్ట్రంలో 7 లక్షల కోట్ల అప్పలు చేసిన బీఆర్​ఎస్​ మూసీ ప్రక్షాళనకు 7వేల కోట్లు కూడా ఖర్చు చేయలేదని విమర్శించారు.  ఎవరెన్ని కుట్రలు చేసినా మూసి పునరుజ్జీవం ఆగిపోదని, అలాంటి వారికి ప్రజలే బుద్ధి చెబుతారని స్పష్టం చేశారు.  

దశాబ్ధాల కలను సాకారం చేసిన సీఎం

బీఆర్​ఎస్​ ప్రభుత్వం వందల వాగ్ధానాలు ఇచ్చి ఏ ఒక్క పని కూడా పూర్తి చేయలేదని రాష్ట్ర దేవాదాయ, అటవీ, పర్యావరణశాఖ మంత్రి కొండా సురేఖ అన్నారు. గత పాలకులు వరంగల్ ఎయిర్​ పోర్టును కూడా పట్టించుకోలేదని,  కానీ సీఎం రేవంత్​ రెడ్డి ఎయిర్​ పోర్టుకు నిధులిచ్చి దశాబ్దాల కలను సాకారం చేశారన్నారు. నగరానికి అండర్​ గ్రౌండ్​ డ్రైనేజీ కూడా కలగానే మిగిలిపోతుందనే భావన ఉండేదని, కానీ దానికీ రూ.4 వేలకు పైగా కోట్లు విడుదల చేయడం హర్షణీయమన్నారు.

కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేస్తాం

రాష్ట్రంలో కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేస్తామని రాష్ట్ర పంచాయతీరాజ్​, గ్రామీణాభివృద్ధిశాఖ మంత్రి సీతక్క అన్నారు.  ఇందిరా మహిళా శక్తి పథకం ద్వారా మహిళలను వ్యాపారవేత్తలుగా తీర్చిదిద్దుతామన్నారు. మహిళల సంక్షేమంతోనే సమాజం అభివృద్ధి చెందుతుందని, సోలార్ పవర్ ప్లాంట్ ద్వారా విద్యుత్ ఉత్పత్తి చేసే బాధ్యతలతో పాటు దాదాపు 100 బస్సులను మహిళలు  నిర్వహించేలా చర్యలు తీసుకుంటామన్నారు. 64 లక్షల మంది ఉన్న గ్రూపులను కోటి మందితో బలోపేతం చేసేందుకు కృషి చేస్తామన్నారు.