బీఆర్ఎస్, బీజేపీ లీడర్లు మూసీ నీళ్లు తాగుతరా?

యాదాద్రి, వెలుగు: మూసీని ప్రక్షాళన చేసి ఉమ్మడి నల్గొండ జిల్లా ప్రజలను, పంటలను కాపాడాలని రైతులు, ప్రజలు, ప్రజాప్రతినిధులు నినదించారు. కాలుష్యం కారణంగా పండిన పంటలు కూడా తినలేని పరిస్థితి ఉందని వాపోయారు. ఆడబిడ్డలకు గర్భస్రావాలు జరుగుతున్నాయని, తద్వారా సంతాన లేమి సమస్య ఏర్పడుతున్నదని ఆవేదన వ్యక్తం చేశారు. మూసీ ప్రక్షాళన, పునరుజ్జీవం కార్యక్రమానికి మద్దతుగా యాదాద్రి జిల్లాలో శనివారం ప్రజా చైతన్య యాత్ర చేపట్టారు. భూదాన్​ పోచంపల్లి మండలం పిలాయిపల్లిలో ప్రారంభమైన ఈ యాత్ర .. బీబీనగర్​మండలం ముక్త అనంతారం వరకు కొనసాగింది. 

ఈ పాదయాత్రలో రైతులు, ప్రజలు, ప్రజాప్రతినిధులు, భువనగిరి, నకిరేకల్​ఎమ్మెల్యేలు కుంభం అనిల్​కుమార్​రెడ్డి, వేముల వీరేశం, భువనగిరి ఎంపీ చామల కిరణ్​కుమార్​ రెడ్డి పాల్గొన్నారు. మక్త అనంతారం వద్ద మూసీ నుంచి సేకరించిన మురుగు నీటిని సీసాలో పట్టుకొని ప్రదర్శించారు. మూసీ ప్రక్షాళనపై విమర్శలు చేస్తున్న బీఆర్​ఎస్​ లీడర్లు కేటీఆర్, హరీశ్​రావు, బీజేపీ లీడర్లు కిషన్​ రెడ్డి, బండి సంజయ్, ఈటల ఒక్కసారి ఈ మురుగు నీరు తాగాలని సవాల్​ విసిరారు. 

కమీషన్ల కోసం రూ.లక్షల కోట్లతో ప్రాజెక్టులు కట్టి, రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసిన బీఆర్​ఎస్..  పదేండ్ల పాటు మూసీని మాత్రం పట్టించుకోలేదన్నారు. మూసీ పునరుజ్జీవంపై డీపీఆర్​ కాకముందే కమీషన్ల కోసమే చేస్తున్నారంటూ తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజా చైతన్య యాత్రలో భువనగిరి మున్సిపల్​ చైర్మన్​ పోతంశెట్టి వెంకటేశ్వర్లు, లీడర్లు అండెం సంజీవ రెడ్డి, తంగెళ్లపల్లి రవికుమార్, పోత్నక్​ ప్రమోద్​ కుమార్, వివిధ మండలాల లీడర్లు, రైతు కూలీలు పాల్గొన్నారు.