ట్రెడిషనల్ లేదా మోడర్న్... లుక్ ఏదైనా, పాత్ర ఎలాంటిదైనా నటనతో మెస్మరైజ్ చేస్తుంది ఆమె. తన కళ్లలో పలికే భావాలకు ఫిదా అయిపోవాల్సిందే. నాగచైతన్య నటించిన తొలి వెబ్ సిరీస్ దూతలో హీరో అసిస్టెంట్‌గా కనిపించిన ఆమె పేరే ప్రాచీ దేశాయ్. ‘ఇండస్ట్రీకి వచ్చి చాన్నాళ్లయినా... ఇప్పటికి తెలుగులో నటించే అవకాశం వచ్చింది’ అని సంతోషంగా చెప్తుంది. ఇకమీదట టాలీవుడ్లో నటిస్తా అంటోంది ప్రాచీ. ప్రస్తుతం ‘సైలెన్స్ - 2’లో పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించిన ఆమె గురించి ఆమె మాటల్లోనే...
‘‘నా అసలు పేరు ఇషా దేశాయ్. అమ్మ అమిత, నాన్న నిరంజన్. అమ్మానాన్న గుజరాత్లో ఉండేవాళ్లు. నేను పుణెలో చదువుకున్నా. సినిమా ఇండస్ట్రీలో ఎలాంటి బ్యాక్‌గ్రౌండ్ లేదు. పదిహేడేండ్లు ఇంకొన్నిరోజుల్లో వస్తాయనగా కాలేజీలో ఫన్ షో కోసం ఆడిషన్స్ చేశారు. ఆ ఆడిషన్‌కి పద్దెనిమిదేండ్లకంటే పెద్ద వయసు వాళ్లు కావాలి. అందుకని నా రెజ్యూమెలో వయసు18 అని రాసేశా. ఆడిషన్ కంటే ముందు వాళ్లు వయసు అడిగితే కూడా‘18 ఏండ్లు’ అనే చెప్పా. అది జరిగిన తరువాత ‘‘నువ్వు ముంబై రావాలి. వచ్చేటప్పుడు నీ సల్వార్ కమీజ్ వెంట తెచ్చుకో’’ అని ఒక ఫోన్ వచ్చింది. ‘‘ఇప్పుడు నేను రాలేను. ఇంటర్మీడియెట్ చదువుతున్నా. ఎగ్జామ్స్ ఉన్నాయి. అవి అయ్యేవరకు ఎక్కడికి రాను’’ అని చెప్పా.
అందుకు వాళ్లు ‘‘సరే అయితే ఎగ్జామ్స్ అయ్యాకే రా” అన్నారు. ఆ రోజు రానే వచ్చింది. తెల్లవారుజామున లేచి ఏ డ్రెస్ వేసుకోవాలి అని ఆలోచిస్తుంటే... సల్వార్ కమీజ్ వేసుకురమ్మన్న విషయం గుర్తుకొచ్చింది. నేను, నా సిస్టర్ ఇద్దరం కలిసి బస్ ఎక్కాం. అమ్మ గుజరాత్ నుంచి వచ్చింది. అలా 2006లో ‘కసమ్ సే’ అనే సీరియల్లో లీడ్ రోల్లో మొదటి అవకాశం వచ్చింది. ఆ సీరియల్‌కి డెబ్యూ యాక్ట్రెస్‌గా చాలా అవార్డులు వచ్చాయి. ‘ఇండియన్ టెల్లీ అవార్డ్ ఫర్ బెస్ట్ యాక్ట్రెస్ ఇన్ లీడ్ రోల్’ అవార్డ్ కూడా దక్కింది. అప్పటి నుంచి బిజీ అయిపోయా. ముంబై వెళ్లేటప్పుడు నాతోపాటు మా అమ్మ తోడుగా వచ్చేది.
అవి మర్చిపోలేను
షూటింగ్ జరిగే రోజుల్లో మేం బాంద్రాలోని మా ఆంటీ వాళ్లింట్లో ఉన్నాం. అక్కడి నుంచి ముంబైకి రోజూ వెళ్లేదాన్ని. ఒకరోజు రైల్వే స్టేషన్లో నా బొమ్మ ఉన్న పెద్ద హోర్డింగ్ చూసి ఆశ్చర్యం వేసింది. ఆనందంతో అక్కడే ఆగిపోయా. అంతలో ట్రైన్ స్టార్ట్ అవడంతో పరిగెత్తుకెళ్లి మరీ ట్రైన్ ఎక్కా. ఆ తర్వాత ట్రైన్లో జర్నీ చేసేటప్పుడు ఎవరైనా గుర్తు పట్టి పలకరించిన ఎక్స్‌పీరియెన్స్ మర్చిపోలేను. జీవితంలో మొదటిసారి మేకప్ వేసుకోవడం. నటించడం చాలా ఎగ్జైటింగ్‌గా అనిపించింది. ఆడిషన్ అయ్యాక ‘‘నాలుగైదు రోజుల్లో మళ్లీ ఫోన్ చేస్తాం’’ అన్నారు. ఆ నాలుగు రోజులు నెలల్లా అనిపించాయి. వాళ్ల ఫోన్ కోసం అంతలా ఎదురుచూశా. చివరకు ఒకరోజు షూటింగ్‌కి రమ్మని ఫోన్ వచ్చింది. ఆ తర్వాత చాలా రోజులకు ఒక పార్టీ కోసం మా కాలేజీకి వెళ్లా. అప్పుడు నాకు చాలా ఎగ్జయిటింగ్‌గా, ఫ్రెండ్స్‌ని కలవబోతున్నా అని ఆనందంగా అనిపించింది. ఎందుకంటే నిజానికి స్కూల్, కాలేజీల్లో చదివేటప్పుడు ఏవైనా యాక్టివిటీస్, పార్టీలు జరిగితే అందులో డాన్స్ చేయడానికి నన్ను సెలక్ట్ చేసేవాళ్లు కాదు. దాంతో నాకు కోపం వచ్చేది. అప్పుడు నాక్కూడా ఒక రోజు వస్తుంది. అప్పుడు నేనేంటో చూపిస్తా అనుకునేదాన్ని. రోజూ లంచ్ బ్రేక్ టైంలో పాటలు పాడుతూ నా ఫ్రెండ్స్ ముందు డాన్స్ చేసేదాన్ని. అప్పుడు మిగతా స్టూడెంట్స్ కూడా నన్ను చూడ్డానికి వచ్చేవాళ్లు. అది నాకు హ్యాపీగా అనిపించేది.
సీరియల్ షూటింగ్ అంటే..
సీరియల్స్, షోల్లో నటించేటప్పుడు అదేపనిగా 32 గంటలు పనిచేయాల్సి వచ్చేది. రిహార్సల్స్, సీన్స్ షూటింగ్ అన్నీ కలిపి. సీరియల్ షూటింగ్ అంటే ఆషామాషీ కాదు. ఒకసారి ఏమైందంటే.. ఆ రోజు ఓవర్ నైట్ షూటింగ్ జరిగింది. తర్వాతి రోజు లండన్‌లో కార్నివాల్కి వెళ్లాలి. నాకు నిద్ర లేదు. బాగా అలసిపోయా. కారు పూర్తిగా ఎక్కకముందే నా కాలు ఒకటి బయటకు ఉండగానే డ్రైవర్ కారు కదిల్చాడు. దాంతో చక్రంలో నా కాలు స్టక్ అయింది. అదే రోజు మేం లండన్ ఫ్లయిట్ ఎక్కాలి. లక్కీగా నా కాలికి ఏం కాలేదు. గట్టిగా ఒత్తుకుపోయిందంతే. దాంతో ఇక లండన్ వెళ్లలేం అనుకున్నాం. ఇదంతా జరిగింది స్టూడియో ఆవరణలోనే. అక్కడ నుంచి రెండు గంటల్లో హాస్పిటల్‌కి తీసుకెళ్లారు. ఆ తర్వాత రెండు మూడు నెలలు కుర్చీకి పరిమితమయ్యా. షూటింగ్లో ఉన్నప్పుడు క్లోజప్‌లు, మాస్టర్ షాట్స్ తీసుకునేవాళ్లు. ఆ టైంలో ‘‘ఇప్పుడు నువ్వు మళ్లీ చదివి స్టడీ కంప్లీట్ చేయొచ్చు కదా’’ అని సలహా ఇచ్చింది అమ్మ. అప్పుడు రోజూ పుణె వెళ్లి ఎగ్జామ్ రాసి రాత్రికి ఇంటికెళ్లేదాన్ని. సీరియల్స్‌లో నటించే రోజుల్లో ఇంత టెక్నాలజీ ఉండేది కాదు. ఒక్కోసారి ఏడ్చే సీన్ చేయాల్సివస్తే గ్లిజరిన్ వేసుకుంటే కళ్లు మండేవి. దాంతో రియల్‌గానే చేయాల్సి వచ్చేది. అప్పుడు ఫేస్ ఉబ్బినట్టు అయిపోయేది. అలాంటి సీన్స్ రోజులో ఎక్కువ ఉంటే ఆ రోజు తలనొప్పి వచ్చేది.
ప్రాంక్ అనుకునేదాన్ని
సీరియల్స్‌లో చేసేటప్పుడు సినిమా అవకాశాలు ఏవైనా వస్తే నమ్మేదాన్ని కాదు. ప్రాంక్ అనుకునేదాన్ని. టీవీలో వయసుకు మించిన క్యారెక్టర్ చేయడంతో ట్రెడిషనల్ రోల్స్‌కి మాత్రమే సరిపోతుందనే పేరు పడిపోయింది. సినిమాల్లోకి వచ్చి ప్రూవ్ చేసుకోవడానికి కొంత టైం పట్టింది. పది సినిమాల్లో నటించాక గానీ నాకు ఆ ట్యాగ్ పోలేదు. పందొమ్మిదేండ్ల వయసులో సినిమాలో నటించా. అది నాకేమీ తెలియని వయసు. అప్పటి నుంచి తప్పులు చేస్తూ, నేర్చుకుంటూ జర్నీ చేశా.
చిన్న వయసులోనే...
పదిహేడేండ్లకే అంతకంటే ఎక్కువ వయసున్న పాత్రల్లో నటించేదాన్ని. అలాంటి అవకాశాలు నాకు వచ్చాయి. నా వయసుకు మించిన పాత్ర చేసే అవకాశం వచ్చినప్పుడు... ఆ వయసులో ఇలాంటి ఛాన్స్ వస్తే, ఆ రోల్ నచ్చితే చేస్తా కదా. మరి ఇప్పుడు ఎందుకు వద్దనాలి? పాత్ర నచ్చినప్పుడు వయసుతో పనేం ఉంది? అని ఆలోచించేదాన్ని. అందుకే అలాంటి పాత్రలు చేయడానికి ఒప్పుకున్నా. అవి వర్కవుట్ అయ్యాయి. నాకు పేరు తెచ్చాయి. నటిగా సంతృప్తినిచ్చాయి. వెనక్కి తిరిగి చూసుకుంటే.. ఆ పాత్రలు ఇప్పుడు చేసే వీలు లేదు. అప్పుడే వాటిని చేసే అవకాశం రావడం మంచిదే అనిపిస్తుంది. చాలా ముందు చూపుతో అప్పట్లోనే రాసిన కథలు అవి అనిపిస్తుంది. ఆ జనరేషన్లో చూసినవాళ్లంతా నన్ను గుర్తుపడతారు. యాక్టర్స్ కూడా ఇప్పటికీ గుర్తుపెట్టుకుని పలకరిస్తుంటారు. ఆ జర్నీ చాలా బాగుంది. కానీ, ఇప్పుడు టెలివిజన్ సిరీస్‌లలో జీవితానికి దగ్గరగా ఉన్న విషయాలు అంతగా చూపించట్లేదు. ఇప్పుడు సీరియల్స్ ద్వారా ఆడియెన్స్‌కి ఎంటర్టైన్మెంట్ తప్ప మరేం దొరకట్లేదు. అలాకాకుండా కాస్త జీవితానికి ఉపయోగపడే మంచి విషయాలు చెప్తే బాగుంటుంది అనేది నా అభిప్రాయం.
చిన్న చిన్న ఆనందాలు
నా వరకు చిన్న చిన్న ఆనందాలకే పొంగిపోతా. మనకు వచ్చిన దాంట్లోనే తృప్తిని వెతుక్కోవాలి. కానీ, రాని దాని కోసం ఆశపడి, బాధపడకూడదు. ‘ఇన్నేళ్ల కెరీర్లో ఏం సాధించావ్?’ అని అడిగితే.. ఇప్పటికీ నేను కొత్తగానే ట్రై చేస్తున్నా అంటా. స్మాల్ స్క్రీన్ నుంచి బిగ్ స్క్రీన్‌కి వెళ్లా. డెబ్యూ సినిమాలు కూడా చాలా హెల్ప్ అయ్యాయి. ఉదాహరణకు ‘కాయ్ పొ చె’లో డైరెక్టర్‌కి వేరే ఛాయిస్ ఉన్నప్పటికీ ఆ రోల్ నాకు ఇవ్వాలనిపించడం నా లక్. ఆ క్యారెక్టర్‌కి నేనయితే బాగా సరిపోతాను అనిపించింది. అలాగే ఇన్నేండ్ల కెరీర్లో తెలుగులో ఒక్క ప్రాజెక్ట్ కూడా చేయలేదు. ఈ మధ్య కాలంలో విడుదలైన ‘దూత’ వెబ్ సిరీస్ ద్వారా ఆ అవకాశం వచ్చింది. అదికూడా పెద్ద హీరోతో చేసే ఛాన్స్. కంటెంట్ ఉన్నది, ఆడియెన్స్‌ని ఎంగేజ్ చేసే ఒక మంచి కథలో నేనూ భాగం కావడం చాలా హ్యాపీగా అనిపించింది.
ఓటీటీ ఒక వరం
ఓటీటీ ఒక వరంలా వచ్చింది. ప్రతి కథ సినిమా ద్వారా చెప్పలేకపోవచ్చు. అలాంటి కథల్ని ఓటీటీలో వెబ్ సిరీస్‌ల ద్వారా చెప్పొచ్చు. దాంతోపాటు అవకాశాల కోసం ఎదురుచూస్తున్న చాలామంది నటీనటులకు ప్లాట్‌ఫాం దొరికింది. కొత్త టాలెంట్స్ పరిచయం అవుతున్నారు. ఒక కథ బాగుంది అంటే.. ప్రాంతీయ భాషలోనే కాకుండా దేశవ్యాప్తంగా ఆడియెన్స్ దాన్ని చూస్తున్నారు. ఆదరిస్తు న్నారు. ఇతర భాషల్లో నటించే ఛాన్స్‌లు ఎక్కువ అయ్యాయి. ఓటీటీ రావడం వల్ల మంచి జరిగింది.
- 2007లో ‘జలక్ దిఖ్ లా జా’ అనే డాన్స్ రియాలిటీ షోలో చేశా. కొన్ని ఎపిసోడ్స్ తర్వాత ఎలిమినేట్ అయ్యా. తర్వాత వైల్డ్ కార్డ్ ఎంట్రీ అయ్యి షో విన్నర్‌గా నిలిచా. అది ఎప్పటికీ మర్చిపోలేను.
- 2008లోనే మూవీ ఇండస్ట్రీకి వచ్చా. అదే ఏడాది ‘రాక్ ఆన్’ అనే సినిమాలో చేశా. హీరో ఫర్హాన్ అక్తర్ అందులో సింగర్. అతని భార్య సాక్షి క్యారెక్టర్ చేశా. ఫిల్మ్‌ఫేర్ అవార్డ్ ఫర్ బెస్ట్ ఫీమెల్ డెబ్యూగా అవార్డ్స్‌కి నామినేట్ అయ్యా.
- 2010లో ‘ఒన్స్ అపాన్ ఎ టైం ఇన్ ముంబయ్’ అనే సినిమాలో నటించా. ఆ సినిమాలో నాది ముంతాజ్ రోల్. బాక్స్ ఆఫీస్ దగ్గర సక్సెస్ అయింది ఈ సినిమా. ఫిల్మ్ ఫేర్ అవార్డ్‌కి నామినేట్ అయ్యా. దాంతోపాటు ‘ఐఫా’ అవార్డ్ గెలుచుకున్నా. ఆ సినిమా నాకు టర్నింగ్ పాయింట్. అప్పటి నుంచి మంచి సినిమాల్లో అవకాశాలు వచ్చాయి.
- కొన్నాళ్లు వరుసగా ఫ్లాప్‌లు రావడంతో నాలుగేండ్లు బ్రేక్ తీసుకున్నా. ఆ తర్వాత ‘సైలెన్స్.. కెన్ యు హియర్ ఇట్?’ అనే సినిమాతో మళ్లీ ఆడియెన్స్ ముందుకు వచ్చా. అప్పటి నుంచి మళ్లీ ‘ఫోరెన్సిక్, దూత’ వెబ్ సిరీస్‌ల్లో నటించా. ఇప్పుడు ‘సైలెన్స్ 2’ ద్వారా మరోసారి స్క్రీన్ పై కనిపించబోతున్నా. ఇది ఫస్ట్ పార్ట్ కంటే చాలా థ్రిల్లింగ్‌గా ఉంటుంది.