స్మార్ట్ ఫోన్ల వినియోగం అయితే తెగ పెరిగిపోయింది కానీ ఆ స్మార్ట్ ఫోన్లను ఎలా వాడితే ఎక్కువ కాలం సక్రమంగా పనిచేస్తాయనేది చాలామందికి తెలియదు. ఈ కారణం వల్లే రెండేళ్లకు, మూడేళ్లకు స్మార్ట్ ఫోన్లను మారుస్తూ డబ్బులు వదిలించుకుంటుంటారు. కానీ.. స్మార్ట్ ఫోన్ వాడే విషయంలో కొన్ని టిప్స్ పాటించడం వల్ల ఐదారేళ్ల పాటు ఛార్జింగ్ దిగిపోకుండా, హీటింగ్ ప్రాబ్లం లేకుండా ఫోన్‌ను సాఫీగా వాడుకోవచ్చు. స్మార్ట్ ఫోన్లకు ప్రధాన సమస్య ఛార్జింగ్ దిగిపోతూ ఉండటం.
ఫోన్ వాడినా, వాడకపోయినా కొన్ని యాప్స్ బ్యాక్ గ్రౌండ్లో రన్ అవుతుండటం వల్ల ఛార్జింగ్ దిగిపోతూ ఉంటుంది. బ్యాక్ గ్రౌండ్లో రన్ అవుతున్న యాప్స్‌ను నిలుపుదల చేసే ఆప్షన్ కూడా స్మార్ట్ ఫోన్లలో వచ్చింది. కానీ.. ఈ ఆప్షన్ చాలామందికి తెలియదు. అంతేకాకుండా.. స్మార్ట్ ఫోన్‌కు ఛార్జింగ్ పెట్టే చాలామంది తెలియక, అవగాహన లేక ఒక పెద్దతప్పుచేస్తున్నారు. ఛార్జింగ్ తక్కువగా ఉందని చూసుకున్న వెంటనే 100 శాతం ఛార్జింగ్ అయ్యేంతవరకూ ఛార్జింగ్ పెడుతూనే ఉంటారు. ఇంకొంతమంది అయితే నైట్ ఛార్జింగ్ పెట్టేసి తెల్లారి తీస్తుంటారు. ఇది స్మార్ట్ ఫోన్ బ్యాటరీ మన్నికను దెబ్బతీస్తుందని టెక్ నిపుణులు తెలిపారు.
100 శాతం ఛార్జింగ్ అయిన తర్వాత కూడా ఛార్జింగ్ పెట్టి ఉంచితే ఆ స్థితిని "Trickle Charging" అంటారు. అంటే.. ఛార్జింగ్ 100 శాతం దాటాక కూడా నైట్ మొత్తం అలానే ఉంచడం వల్ల స్మార్ట్ ఫోన్ కొంత పవర్‌ను కోల్పోయి మళ్లీ ఛార్జింగ్ అవుతూ ఉంటుంది. ఇలా అవడం వల్ల.. స్మార్ట్ ఫోన్ హీటయ్యే ఛాన్స్ ఉంది. బ్యాటరీ అయితే పేలే అవకాశాలు తక్కువ గానీ ఓవర్ ఛార్జింగ్ వల్ల బ్యాటరీ లైఫ్స్పాన్పై ప్రభావం పడుతుంది.
Also Read :- బిట్‌కాయిన్‌ను ఆపే అధికారం ఎవరికీ లేదు
మనం తెలిసోతెలియకో.. 100 శాతం ఛార్జింగ్ పెడితే ఎక్కువ సేపు వాడుకోవచ్చని పడే కక్కుర్తి వల్ల ఫోన్ ఛార్జింగ్ రానురానూ త్వరగా దిగిపోతూ ఉంటుంది. అందువల్ల.. మొబైల్ కు 100 శాతం ఛార్జింగ్ పెట్టడం ఇకనైనా మానేసి 80 శాతం వరకూ ఛార్జింగ్ రాగానే ఛార్జర్ తీసేయండి. స్మార్ట్ ఫోన్ ఛార్జింగ్ మరీ 5 నుంచి 10 శాతం వచ్చేంత వరకూ వాడుతూ ఉండకుండా 20 శాతానికి రాగానే ఛార్జింగ్ పెట్టండి. ఈ రెండు టిప్స్ పాటిస్తే స్మార్ట్ ఫోన్ సరిగా ఛార్జింగ్ ఉండటం లేదనే ప్రాబ్లంకు వీలైనంత వరకూ చెక్ పెట్టేయొచ్చు.
బ్యాటరీ ఫర్మామెన్స్ పెంచుకోవడానికి ఇంకొన్ని టిప్స్:
* ఛార్జింగ్ తక్కువగా ఉన్నప్పుడు బ్యాటరీ సేవర్ మోడ్ ఆన్ చేసుకోవడం
* స్క్రీన్ బ్రైట్నెస్ తగ్గించుకోవడం లేదా ఆటో బ్రైట్నెస్ లో ఉంచుకోవడం
* వాడకుండా ఉన్న బ్యాక్ గ్రౌండ్ యాప్స్‌ను క్లోజ్ చేసుకోవడం
* బ్యాటరీ ఆప్టిమైజేషన్స్తో సహా మీ ఫోన్ సాఫ్ట్ వేర్‌ను ఎప్పటికప్పుడు అప్డేట్ చేసుకోవడం
* చాలామంది స్మార్ట్ ఫోన్ యూజర్లకు వాడుకోవడం అయిపోయిన తర్వాత బ్లూటూత్, వైఫై, జీపీఎస్ ఆన్ చేసి ఉంచడం ఒక అలవాటైపోయింది. వీటిని ఇలా ఆన్ చేయడం వల్ల కూడా ఛార్జింగ్ దిగిపోతూ ఉంటుంది. ఈ ఫీచర్స్‌ను ఆఫ్ చేసుకోవడం బెటర్