ఉద్యోగులపై కాంగ్రెస్ ​సర్కార్ సానుకూలత

గత ప్రభుత్వం అనాలోచిత నిర్ణయానికి స్థానికతను కోల్పోయి మానసిక క్షోభను ప్రభుత్వ ఉద్యోగులు అనుభవిస్తున్నారు. 317 జీవో స్థానికతకు సరికొత్త అర్థాన్ని చెప్పింది. దాని వలన ప్రయోజనం ఎవరికి ఒనగూరిందో తెలియదు కానీ ఎంతోమంది ఉద్యోగులను కుంగదీసింది అన్నమాట ముమ్మాటికి వాస్తవం.  నిజానికి సర్వీసును ప్రాతిపదికగా తీసుకోవాలి కానీ క్యాడర్ సర్వీసును పరిగణనలోకి తీసుకొని జూనియర్లను బలవంతంగా ఉన్న జిల్లా నుంచి ఇతర జిల్లాకు పంపించి వేశారు . ఇది అత్యంత శోచనీయం.

 317 జీవోకు వ్యతిరేకంగా ఉద్యోగులు ధర్నాలు చేస్తే ఆనాటి ప్రభుత్వం పట్టించుకోకుండా నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరించింది. ఆనాడు ప్రతిపక్షంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ నాయకులు ఉద్యోగులకు సంఘీభావం ప్రకటించి కాంగ్రెస్ అధికారంలోకి వస్తే 317 జీవోను రద్దు చేస్తామని ఉద్యోగులకు భరోసా ఇచ్చింది. కాంగ్రెస్ పార్టీ తమ ఎన్నికల మేనిఫెస్టోలో కూడా 317 జీవోను రద్దు చేస్తామని ప్రకటించింది. 

 ఇటీవల జరిగిన శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించి అధికారంలోకి వచ్చింది. సీఎంరేవంత్ రెడ్డి ఉద్యోగుల పట్ల సానుకూల దృక్పథాన్ని కలిగి ఉండి ఉద్యోగుల పదోన్నతులు బదిలీలను విద్యా సంవత్సరం ప్రారంభంలోనే పూర్తి చేయడం జరిగింది. అదేవిధంగా ఎన్నికల మేనిఫెస్టోలో రూపొందించినట్లు 317 జీవోను రద్దుచేసి ఉద్యోగులను సొంత జిల్లాలోకి పంపించాలని 317 జీవో బాధితులు కోరుతున్నారు.

 ప్రజా పాలనను  కొనసాగిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం 317 జీవో బాధితుల కోసం ప్రత్యేకమైన వెబ్​సైట్ రూపొందించి ఉద్యోగులను సొంత జిల్లాలకు పంపడానికి కసరత్తు చేస్తోంది. సాధ్యమైనంత తొందరలోనే ఉద్యోగులను సొంత జిల్లాలకు పంపి వారి మానసిక సంఘర్షణను దూరం చేయాలని సర్వత్రా  కోరుకుంటున్నారు. గత ప్రభుత్వం చేసిన తప్పిదాలను సరిదిద్దుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉద్యోగుల దశాబ్దాల సమస్యలకు పరిష్కారం చూపడంపై ఉద్యోగులు హర్షిస్తున్నారు.

 ఇటీవల 317 జీవోపై  రాష్ట్ర మంత్రివర్గ ఉపసంఘం సమీక్షలు చేస్తూ జూన్ 30 వరకు వివిధ శాఖల వారీగా వచ్చిన దరఖాస్తులను సేకరించి న్యాయబద్ధమైన   స్థానికత కోల్పోయిన మిగిలిపోయిన స్పౌస్ కేసులను పరిశీలించి సొంత జిల్లాకు పంపించడానికి కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం చర్యలు చేపట్టడం  అభినందనీయం.

యాడవరం చంద్రకాంత్ గౌడ్, సిద్దిపేట