హాట్‌‌ హాట్‌‌ గా కరీంనగర్​ ‌‌ కార్పొరేషన్ మీటింగ్‌‌

  • కార్పొరేషన్‌‌ లో అస్తవ్యస్త పాలనపై మంత్రి పొన్నం ఫైర్‌‌ ‌‌ 
  • పన్నులు రాబట్టడం, బిల్డింగ్ అసెస్‌‌ మెంట్‌‌ లో నిర్లక్ష్యంపై మండిపాటు
  • పర్మిషన్‌‌  లేని బిల్డింగ్‌‌ ల లిస్ట్‌‌  రెడీ చేయాలని ఆదేశాలు

కరీంనగర్, వెలుగు: కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ ఆఫీసర్ల పాలన తీరుపై రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ఆగ్రహం వ్యక్తం చేశారు.  పద్ధతి మార్చుకోకుంటే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. సిటీలో బిల్డింగ్స్ పర్మిషన్, అసెస్‌‌ మెంట్, పన్నుల వసూళ్లు, అభివృద్ధి పనుల నాణ్యత, స్మార్ట్ సిటీ పనులు, శానిటేషన్, తాగునీటి సరఫరా తదితర అంశాలపై కరీంనగర్ కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్ లో మంత్రి మంగళవారం సుదీర్ఘంగా సమీక్షించారు. ఒక్కో శాఖపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ కొన్నిచోట్ల స్మార్ట్ సిటీ పనులపై అడిషనల్‌‌  కలెక్టర్ నేతృత్వంలో విజిలెన్స్ విచారణ కొనసాగుతుందని తెలిపారు. 

‘పారమిత’ బిల్డింగ్ ఓనర్ పన్ను ఎగవేతపై ఆగ్రహం 

బిల్డింగ్ లకు రెసిడెన్షియల్ అనుమతులు తీసుకుని కమర్షియల్ గా ఉపయోగిస్తున్నారని, ఇలాంటి బిల్డింగ్స్ ను రీఅసెస్ మెంట్ చేసి ప్రాపర్టీ ట్యాక్స్​ పూర్తిగా వసూలు చేయాలని మంత్రి ఆదేశించారు. పద్మానగర్ లోని పారమిత స్కూల్ బిల్డింగ్ ఓనర్ ఇంటి పన్ను ఎగవేత పై ఫైర్​ అయ్యారు. దీనిపై ఆర్​వో అంజనేయులును ప్రశ్నించగా బిల్డింగ్ రీఅసెస్‌‌ మెంట్ చేశామని, గతంలో ఏడాదికి రూ.41 వేలు చెల్లించేవారని, అది ఇప్పుడు సుమారు రూ.4 లక్షలకు చేరిందని చెప్పారు. 

దీంతో ఆగ్రహం వ్యక్తం చేసిన మంత్రి.. సొంత జాగాలో అనుమతి లేకుండా భవన నిర్మాణాలు చేపట్టినవారి వివరాలు సేకరించాలని ఆదేశించారు. పన్నుల వసూళ్లపై ప్రత్యేక దృష్టి సారించాలని, పెద్ద విద్యాసంస్థలు, మాల్స్, పెట్రోల్ బంక్ నిర్వాహకుల నుంచి ఎప్పటికప్పుడు పన్నులు వసూలు చేయాలని సూచించారు. ప్రభుత్వ భూముల్లో అక్రమ నిర్మాణాలు చేపట్టిన వారి వివరాలు సేకరించాలని, అనుమతి లేకుండా చేపట్టే నిర్మాణాలపై ప్రత్యేక నిఘా పెట్టాలని ఆదేశించారు. 

జంక్షన్లపై రిపోర్టు ఇవ్వండి

ఇందిరాచౌక్ లో జంక్షన్ అభివృద్ధి పనులకు‌‌  రూ.కోటిన్నర ఎలా ఖర్చయ్యాయని ఇంజనీరింగ్ ఆఫీసర్లను ప్రశ్నించారు. సిటీలోని జంక్షన్ల అభివృద్ధి పనులపై నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. బక్రీద్ ఏర్పాట్లలో భాగంగా సాలెహ్ నగర్, చింతకుంట ఈద్గాల్లో వాటర్ ప్రూఫ్ టెంట్లు వేయాలని టెండర్ రిలీజ్ చేస్తే.. టార్పాలిన్ షీట్లు ఎందుకు వేశారని ప్రశ్నించారు. 

మానేరు ఒడ్డున డంపింగ్ యార్డ్ లో బయోమైనింగ్ కు‌‌  రూ.16 కోట్లు ఖర్చు పెట్టినా చెత్త ఎందుకు తగ్గలేదని ప్రశ్నించిన ఆయన.. ఇందుకు సంబంధించి పూర్తి నివేదిక ఇవ్వాలని, డంపింగ్ యార్డుకు ప్రత్యామ్నాయ స్థలాలు అన్వేషించాలని కలెక్టర్ కు సూచించారు.  పోస్టల్ డిపార్ట్మెంట్ నుంచి ఫారిన్ సర్వీస్ కింద వచ్చిన ఏఈ ప్రభాకర్ జమ్మికుంట మున్సిపాలిటీ లో పని చేస్తూ కరీంనగర్ కార్పొరేషన్ నుంచి ఎలా జీతం తీసుకుంటున్నారని ప్రశ్నించారు. ఆయనను రివర్షన్ చేయాలని ఆదేశించారు.  

వన్ టౌన్ ఎదురుగా మాజీ ఎంపీ జువ్వాడి చొక్కా రావు విగ్రహాన్ని వెంటనే ఏర్పాటు చేయాలని, కరీంనగర్ కార్పొరేషన్ లో చేపట్టిన స్మార్ట్ సిటీ పనులను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలన్నారు. పారదర్శకంగా, జవాబుదారీగా పని చేయాలని, అవినీతి రహితపాలన అందించాలని సూచించారు.  మున్సిపల్ అధికారులు పనితీరును మరింత మెరుగుపరు చుకోవాలని, నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. సమావేశంలో ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ, కలెక్టర్ పమేలా సత్పతి, అడిషనల్‌‌  కలెక్టర్ ప్రఫుల్ దేశాయ్, ఆర్డీవో కె.మహేశ్వర్, మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్, అధికారులు 
పాల్గొన్నారు.