2020లో నేను వైట్​హౌస్​ వీడి ఉండాల్సింది కాదు!

వాషింగ్టన్: గత ఎన్నికల ఫలితాలు వెలువడ్డాక తాను వైట్​హౌస్​ను వీడి ఉండాల్సింది కాదని అమెరికా రిపబ్లికన్​ పార్టీ ప్రెసిడెంట్​ క్యాండిడేట్, మాజీ ప్రెసిడెంట్ ట్రంప్​ వ్యాఖ్యానించారు. తాము చాలా బాగా పనిచేశామని, ఓటమిని ఒప్పుకొని ఉండాల్సింది కాదని పరోక్షంగా చెప్పారు. మంగళవారం అమెరికా 47 వ అధ్యక్షుడిని ఎన్నుకునేందుకు పోలింగ్​ పూర్తికానున్నది. ఈ నేపథ్యంలో సోమవారం ట్రంప్​ సుడిగాలి పర్యటన చేశారు. పెన్సిల్వేనియాలోని లిటిట్జ్​లో నిర్వహించిన ఎన్నికల ర్యాలీలో ట్రంప్ 2020 ఎన్నికలపై కీలక వ్యాఖ్యలు చేశారు.  ‘‘నేను పదవిని వీడే నాటికి దేశానికి అత్యంత సురక్షితమైన సరిహద్దులున్నాయి. ఆ సమయంలో నేను వైట్​హౌస్​ను వీడాల్సింది కాదు. 

మేం నిజంగా చాలా బాగా పనిచేశాం. ఈసారి ప్రతి పోలింగ్ బూత్ వద్ద వందలకొద్దీ లాయర్లను ఉంచాం” అని అన్నారు.  కాగా, ఈ వ్యాఖ్యలు ఒకవేళ ట్రంప్​ ఓడిపోతే నవంబర్ 5న జరిగే ఓటింగ్ ఫలితాన్ని అంగీకరించకుండా ఉండేందుకు అతడు రంగం సిద్ధం చేసుకుంటున్నాడనే భయాందోళనలు రేకెత్తిస్తున్నాయి. కాగా, అయోవాలో తనకంటే డెమొక్రటిక్​ అభ్యర్థి కమలా హారిస్​ ముందున్నారన్న పోల్​ సర్వేలపై ట్రంప్​ స్పందించారు.  ప్రత్యర్థిని పూర్తిగా అణచివేసేందుకే ఇలాంటి సర్వేలు చేస్తారని, అవి పూర్తిగా చట్టవిరుద్ధమని అభిప్రాయపడ్డారు. తాను అలాంటివాటిని అంతగా పట్టించుకోనని చెప్పారు.  

నార్త్​కరోలినాలోని కిన్​స్టోన్​లో నిర్వహించిన ఎలక్షన్​ ర్యాలీలోనూ ట్రంప్​ మాట్లాడారు. ఈ ఎన్నికల్లో హారిస్​ గెలిస్తే సరిహద్దులను పూర్తిగా తెరుస్తారని,  వలసదారులు, చొరబాటుదారులు, నేరగాళ్లు దేశంలోకి చొరబడతారని అన్నారు. హారిస్​కు ముందుచూపు లేదని విమర్శించారు. తాను గెలిస్తే అమెరికన్లే దేశాన్ని పాలిస్తారని అన్నారు.