ప్రశాంతంగా పోలింగ్..నిజామాబాద్ ఎంపీ స్థానంలో 71.47 శాతం పోలింగ్

  •     గ్రామీణ ప్రాంతాల్లో చైతన్యం చాటిన ఓటర్లు
  •     సొంత గ్రామాల్లో ఓటు వినియోగించుకున్న ప్రజాప్రతినిధులు
  •     పోలింగ్ సిబ్బందితో ఎంపీ అర్వింద్ వాగ్వాదం

నిజామాబాద్​, వెలుగు : ఇందూర్​ పార్లమెంట్​ సెగ్మెంట్​లో సోమవారం జరిగిన పోలింగ్‌ చెదురుమదురు ఘటనలు మినహా ప్రశాంతంగా ముగిసింది. సాయంత్రం 5 గంటల వరకు 67.96 శాతం పోలింగ్ నమోదైంది.  రాత్రి 10.30 గంటలకు 71.47 శాతం పోలింగ్ నమోదైనట్లు ఎన్నికల అధికారులు తెలిపారు.  మొత్తం 17,04,867 మంది ఓటర్ల కోసం 1,808 బూత్​లు ఏర్పాటు చేసి  ఎన్నికలు నిర్వహించారు. ఉదయం 5.30 గంటలకు పొలికల్​ పార్టీ లీడర్ల సమక్షంలో మాక్​ పోలింగ్ ముగించి 7 గంటల నుంచి అసలు పోలింగ్​ షురూ చేశారు.

సాయంత్రం 6 గంటల దాకా పోలింగ్​ సెంటర్లలోకి ఎంటరైన ​ఓటర్లను మాత్రమే ఓటు వేయడానికి అనుమతించారు. పొద్దున 9 గంటలకు 10.91 శాతం నమోదైన పోలింగ్​ 11 గంటలకు 28.26 శాతం, మధ్యాహ్నం ఒంటిగంటకు 45.67 శాతానికి చేరింది. 3 గంటలకు 58.70 శాతంగా ఉన్న పోలింగ్​ సాయంత్రం 5 గంటలకు 67.96 శాతానికి చేరుకుంది. ఫైనల్ ​ పోలింగ్​ రిపోర్టును రిటర్నింగ్​ ఆఫీసర్లు ప్రిపేర్​ చేస్తున్నారు.  పోలింగ్​మొదలైన మొదటి నాలుగు గంటలు గ్రామీణ ఓటర్లు చైతన్యం కనబర్చారు.  

పల్లెల్లో అధిక పోలింగ్​ రికార్డయింది.  కలెక్టర్ రాజీవ్​గాంధీ హన్మంతు సెంట్రల్​ మానిటరింగ్​ సిస్టంలో సీసీ కెమెరాల్లో  పోలింగ్​తంతు పరిశీలించారు.   సీపీ కల్మేశ్వర్​ జిల్లా అంతటా తిరిగి లా అండ్​ ఆర్డర్​ పర్యవేక్షించారు.  

ఓటేసిన ప్రముఖులు 

బీజేపీ అభ్యర్థి ధర్మపురి అర్వింద్​ నగరంలోని కాకతీయ విద్యాసంస్థల క్యాంపస్​లో ఏర్పాటు చేసిన బూత్​లో భార్యతో కలిసి ఓటు వేయగా కాంగ్రెస్  క్యాండిడేట్​ జీవన్​రెడ్డి జగిత్యాల పట్టణంలోని గవర్నమెంట్​ హైస్కూల్​లో ఓటు హక్కు వినియోగించుకున్నారు.  బీఆర్ఎస్​ అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్​ ఫ్యామిలీ మెంబర్స్​తో వచ్చి రూరల్​ అసెంబ్లీ సెగ్మెంట్​లోని  సిరికొండ మండలం రావుట్ల విలేజ్​లో ఓటు వేశారు.  బురఖాలు ధరించి వచ్చిన సెంటర్​కు వెళ్లిన అర్వింద్​ ఎలక్షన్​ నిబంధనల ప్రకారం ఓటర్​ ముఖాలను కన్ఫర్మ్​ చేసుకున్నాకే  వారిని ఓటేయడానికి అనుమతించాలి.  

అలా చేయడం లేదంటూ బీజేపీ అభ్యర్థి అర్వింద్​ నగరంలోని  ఖిల్లా రోడ్​ 220 పోలింగ్​ సెంటర్​కు వెళ్లి సిబ్బందితో వాగ్వాదానికి దిగారు.  బురఖా లోపల ముఖాలు చూడకుండా ఓటు ఎలా వేయనిస్తున్నారని ప్రశ్నించారు.  మైనారిటీ ఏరియాల్లోని పోలింగ్​ సెంటర్లలో ఏజెంట్లను అలర్ట్​ చేశారు. 144  సెక్షన్​ అమలు విషయంలో నిర్లక్ష్యం వహిస్తున్నారని సిటీ ఏసీపీ రాజా వెంకట్​రెడ్డితో వాదించారు. ఈవీఎంలు సతాయించడంతో పొద్దున విశ్వభారతి హైస్కూల్​లో పోలింగ్​ గంట పాటు జరగలేదు.  

పోలింగ్​ సెంటర్ల వద్ద ప్రచారం చేస్తున్న ఆయా పార్టీల కార్యకర్తలను పలు చోట్ల పోలీసులు లాఠీలు పట్టుకొని చెదర గొట్టారు.  ఎండలు అధికంగా నమోదు కావడంతో పోలింగ్​ సెంటర్లలో గట్టి ఏర్పాట్లు  చేశారు. నీడ కోసం టెంట్లు, షామియానాలు, ఓఆర్​ఎస్​ ప్యాకెట్లను ఓటర్లకు అందుబాటులో పెట్టారు. ఫ్యాన్లు, కూలర్లు పెట్టారు.  

అసెంబ్లీ సెగ్మెంట్​ల వారీగా పోలింగ్ 

సెగ్మెంట్                       ఓటర్లు        పోలింగ్

ఆర్మూర్                                    2,12,145          69.61% 
బోధన్​                                       2,23,096          70.84% 
నిజామాబాద్ ​ (అర్బన్​)            3,04,317          57.86% 
నిజామాబాద్​(రూరల్​)              2,56,593          70.54% 
బాల్కొండ                                 2,26,792          71.31% 
కోరుట్ల                                       2,45,249           70.07% 
జగిత్యాల                                   2,36,675           68.55%