కాలుష్య రాజకీయం!

కాలుష్యం మానవాళి పాలిట ఓ ప్రమాదకర భూతం.  ప్రపంచ మానవాళితో పాటు సకల జీవకోటి  ఆరోగ్యాన్ని  కాలుష్యం ప్రభావితం చేయగలదు. ఆరోగ్యకరమైన జీవనానికి  ముప్పు కలిగించే  కాలుష్యానికి  అడ్డుకట్ట వేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది.  కాలుష్య  నివారణకు,  నియంత్రించడానికి  అన్ని దేశాల  ప్రభుత్వాలు అనేక పథకాలను  అమలు చేస్తుంటాయి.  అదేవిధంగా మనదేశంలో  ఏ రాష్ట్రం కూడా తమ పరిధిలో  కాలుష్యం  పెరగాలని భావించదు.  

కాలుష్య కారకాలను  ప్రోత్సహించదు.  కాలుష్య కట్టడికి సర్వదా  ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు విస్తృతంగా  ప్రయత్నిస్తుంటాయి.  అయితే, ఈ ప్రయత్నాలు ఒకోసారి రాజకీయ రూపును  సంతరించుకుంటాయి.  నేడు  దేశ రాజధాని  ఢిల్లీలో  కాలుష్యం  పట్ల  రాజకీయ  నాయకుల  పరస్పర  ఆరోపణలు తీవ్ర స్థాయిలో ఘాటుగా వినిపిస్తున్నాయి. ఈ  రాజకీయ బురద జల్లడం ఢిల్లీ పాలకుల నుంచి  ప్రారంభమైంది. 

ఢిల్లీ సీఎం  ఆతిశి ‌‌‌‌ తీవ్ర ఆరోపణలు

రాజధాని ఢిల్లీ మహానగరంలో  కాలుష్యం విపరీతంగా పెరగడానికి బీజేపీ పాలిత రాష్ట్రాలే కారణమని ఢిల్లీ ముఖ్యమంత్రి ఆతిశి  విమర్శించడం కొంత విస్మయాన్ని  కలుగజేస్తోంది.  బీజేపీ  అధికారంలో ఉన్న  హర్యానా,  ఉత్తరప్రదేశ్​ రాష్ట్రాలకు చెందిన రైతులు తమ వ్యవసాయ వ్యర్థాలను విచక్షణారహితంగా,  పెద్ద ఎత్తున  కాలుస్తుండటంతో  రాజధానిలో కాలుష్యం పలు రెట్లు పెరిగిందని ఆతిశి తీవ్రంగా ధ్వజమెత్తారు.  అదేవిధంగా ఆప్‌‌‌‌  పాలిత పంజాబ్‌‌‌‌ రాష్ట్రంలో వ్యవసాయ వ్యర్థాల  కాల్చివేత గణనీయంగా తగ్గిందని కూడా ఆమె పేర్కొనడం విశేషం.  

ఢిల్లీ కాలుష్యం విషయంలో ఆతిశి  చేసిన ఆరోపణలు అర్థరహితంగా ఉన్నాయని బీజేపి నాయకులు ఖండించడం కూడా జరిగింది. ఈ విధంగా  ఆమ్​ ఆద్మీ పార్టీ, బీజేపీ...ఇరు పార్టీల నాయకులు ఒకరి మీద మరొకరు కాలుష్యంపై  విమర్శల దాడికి పూనుకుంటున్నారు.  ఆయా రాష్ట్రాల ప్రభుత్వాలు పరస్పరం సహకరించుకుని  కాలుష్యాన్ని తగించడానికి  ఉమ్మడిగా కృషి చేయాలి. పార్టీలకు  అతీతంగా  కాలుష్య కట్టడికి  నడుం  బిగించాల్సింది పోయి ఇలా ఆరోపణలు చేసుకోవడాన్ని  పౌర సమాజం ఆమోదించదని  రాజకీయ పార్టీలు, ఆ పార్టీల నాయకులు గుర్తించాలి. 

ఢిల్లీలో ప్రమాదకరంగా పెరుగుతున్న కాలుష్యం

ఢిల్లీ  నేషనల్‌‌‌‌ క్యాపిటల్‌‌‌‌ టెరిటరీలో  కాలుష్యం  ప్రమాదకర స్థాయిలో  మూడు రెట్లు పెరిగిందని పలు నివేదికలు వెల్లడిస్తున్నాయి.  నివేదికలు  ప్రజారోగ్యానికి భంగం కలిగించే  ప్రమాదకర  విషయాలను బయటపెట్టడంతో  ఢిల్లీ నగరవాసులు  భయంతో  కంపించిపోతున్నారు.  

నోయిడా, గుర్గావ్‌‌‌‌ లాంటి  కొన్ని ప్రాంతాల్లో ప్రమాదకరంగా  కాలుష్య స్థాయి పార్టిక్యులేట్​ మేటర్​ ( పీఎం)125 వరకు నమోదు అవుతున్నదని  గమనించారు.  ఢిల్లీలో  గాలి కాలుష్యం పెరిగినప్పటికీ, వ్యవసాయ వ్యర్థాలను  కాల్చివేయడం  మాత్రం  కొంత  తగ్గినట్లు తెలుస్తున్నది.  పంజాబ్‌‌‌‌లో  వ్యర్థాల కాల్చివేత గణనీయంగా తగ్గినట్లు,  యూపీలో మాత్రం గత ఏడాదితో  పోల్చితే  నేడు కొద్దిగా పెరిగిందని తెలుస్తున్నది.

వ్యర్థాల కాల్చివేత  కట్టడికి ప్రభుత్వాలు  తీసుకుంటున్న పలు చర్యలతో (ఫైన్‌‌‌‌ విధించడం, తప్పు చేసినవారిపై కేసులు పెట్టడం లాంటివి)  మూడు రాష్ట్రాల్లో  పీఎం 2.5 తగ్గడం జరిగింది. 2024లో  పంజాబ్‌‌‌‌, హర్యానాలతో  పోల్చితే యూపీలో 1,581 వ్యర్థాల కాల్చివేతలు జరిగాయని సమాచారం. రానున్న చలికాలంలో కాలుష్యం మరింత పెరిగే ప్రమాదం ఉన్నందున నేటి నుంచే కట్టడి చర్యలు తీసుకోవడం ప్రారంభించాలి. వ్యవసాయ వ్యర్థాల కాల్చివేతతో 10 శాతం కాలుష్యం  మాత్రమే  జరుగుతున్నందున నగరంలో ఇతర కాలుష్య కారణాలను  కూడా  గుర్తించి ప్రణాళికాబద్ధంగా తగు చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాలు, పౌర సమాజం కోరుతున్నది. 

- డా . బుర్ర మధుసూదన్‌‌‌‌ రెడ్డి–