ఇందూరులో ఎవరి ధీమా వాళ్లది

నిజామాబాద్​, వెలుగు : ఈసారి జరగనున్న లోక్​సభ ఎన్నికల్లో నిజామాబాద్​నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్న మూడు ప్రధాన పార్టీల అభ్యర్థులు ఎవరికి వారే విజయబావుటా ఎగురేస్తామనే ధీమాతో ఉన్నారు. బీజేపీ క్యాండిడేట్​ధర్మపురి అర్వింద్, కాంగ్రెస్​ నుంచి పోటీ చేస్తున్న జీవన్​రెడ్డి, బీఆర్ఎస్​ పక్షాన నిలబడ్డ బాజిరెడ్డి గోవర్ధన్​తమ బలాబలాలను బేరీజు వేసుకుంటూ కాన్ఫిడెంట్​గా ముందుకు సాగుతున్నారు. మారిన తాజా రాజకీయ పరిణామాలతో పాటు ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో పొందిన ఓట్లను కూడా పరిగణలోకి తీసుకుంటున్నారు.  ఎన్నికలకు మరో రెండు వారాల టైం ఉన్నందున నెగిటివ్ ​అంశాలను పాజిటివ్​గా మార్చుకోవడానికి ప్లాన్​ వేస్తున్నారు. ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ మూడు, బీజేపీ రెండు, కాంగ్రెస్ రెండు స్థానాల్లో గెలవడంతో నిజామాబాద్ ​ఫైట్​ టఫ్​గా మారే అవకాశం ఉంది.  

మోదీ క్రేజ్...రామ్​మందిర నిర్మాణం 

2019 ఎన్నికల్లో అప్పటి సీఎం కేసీఆర్​ బిడ్డ కవితను ఓడించి సంచలన విజయం నమోదు చేసిన ధర్మపురి అర్వింద్​ఇప్పుడు రెండోసారి పోటీ చేస్తున్నారు. ఎంపీగా ఐదేండ్లలో పొందిన రాజకీయ అనుభవం ఈసారి ఆయనకు కలిసి వచ్చే అవకాశం ఉంది. అయితే, మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో ఈ పార్లమెంట్​పరిధిలో ఓట్ల విషయంలో చూసుకుంటే బీజేపీ మూడో స్థానంలో నిలిచింది. అయినా, అసెంబ్లీ ఎన్నికలు...పార్లమెంట్​ఎన్నికలు వేరని, దీన్ని లెక్కలోకి తీసుకోవాల్సిన అవసరం లేదని అర్వింద్ ​అంచనా వేస్తున్నారు. ప్రధాని మోదీ క్రేజ్, అయోధ్యలో రామమందిర​ నిర్మాణం తప్పక ఓట్లు తెచ్చిపెడతాయనే భరోసాతో ఉన్నారు. కేంద్ర ప్రభుత్వం పసుపు బోర్డు ప్రకటన చేయడంతో రైతులు తనవైపే నిలుస్తారని, జిల్లాలో ఐదు చోట్ల కీలకమైన రైల్వే ఓవర్​బ్రిడ్జిల నిర్మాణానికి తోడు యూత్​ లీడర్​గా ఫైర్​ బ్రాండ్​ఇమేజ్​ ప్లస్ ​పాయింట్లుగా భావిస్తున్నారు. మైనారిటీ ఓట్లపై ఏ మాత్రం నమ్మకం పెట్టుకోని అర్వింద్​ యూత్​ ఓట్లు ఆ లోటును భర్తీ చేస్తాయని విశ్వసిస్తున్నారు. ప్రత్యర్థుల ఫెయిల్యూర్స్​తనకు ఓట్లుగా మారతాయనే నమ్మకంతో ఉన్నారు. అర్బన్, ఆర్మూర్​ఎమ్మెల్యేలు ధన్​పాల్​ సూర్యనారాయణ, పైడి రాకేశ్​రెడ్డి అదనపు బలంగా మారినా...పార్టీలోని కొందరు లీడర్లు అర్వింద్​కు సహకరించకుండా పరోక్షంగా ఆయన ఓటమి కోసం ప్రయత్నిస్తున్నారన్న ఆరోపణలున్నాయి. అర్వింద్ ​దుందుడుకు శైలి కారణంగా పార్టీలో కొంత క్యాడర్ ​ఆయనకు సహకరించడం లేదు.  

పట్టు బిగించిన కాంగ్రెస్​   

అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచి అధికారం చేపట్టిన కాంగ్రెస్​పార్లమెంట్​ఎన్నికల్లోనూ విజయం సాధించాలనే పట్టుదలతో పక్కా ప్లాన్ ​ప్రకారం ముందుకెళ్తోంది. నిజామాబాద్​ పార్లమెంట్​ స్థానంలో అభ్యర్థి పేరు ప్రకటించడానికి కాంగ్రెస్​ హైకమాండ్​ భారీ కసరత్తు చేసింది. పార్టీలోని అందరి అభిప్రాయాలు తీసుకుని సీనియర్​ లీడర్​ టి.జీవన్​రెడ్డిని బరిలో నిలిపింది. రాజకీయాల్లో సుదీర్ఘ అనుభవంగల అయనకు పార్లమెంట్​ఎన్నికల సమన్వయకర్తగా..అదే స్థాయిలోని మాజీ మంత్రి సుదర్శన్​రెడ్డి వ్యవహరిస్తున్నారు. 

పార్టీ క్యాడర్​ను కలుపుకొని ప్లాన్ ​రూపొందించి ముందుకు సాగుతున్నారు. అధికారంలోకి రావడంతో పార్టీ గ్రౌండ్​ లెవెల్​లో బాగా బలపడిందనే ధీమాతో అభ్యర్థి జీవన్​రెడ్డి ఉన్నారు. రోజూ పార్టీలోకి వస్తున్న ఇతర పార్టీల లీడర్లు, కార్యకర్తలతో కాంగ్రెస్ ​మరింత పటిష్టంగా మారుతోంది. బోధన్, ఆర్మూర్, జగిత్యాల మున్సిపాలిటీల్లో కాంగ్రెస్​ జెండా ఎగరడం, మార్క్​ఫెడ్, డీసీసీబీ, ఐడీసీఎంఎస్​లు కాంగ్రెస్​ ఖాతాలో చేరడం,  ప్లస్​గా మారనుంది. లోకల్ ​బాడీ లీడర్లు దాదాపు కాంగ్రెస్​ పక్షానే ఉన్నారు. పార్లమెంట్​ సెగ్మెంట్​లో పురుషులకు సమానంగా ఉన్న మహిళా ఓటర్లు తమ వైపు నిలబడతారనే ధీమా కాంగ్రెస్​లో ఉంది. ఆరు గ్యారెంటీలలో ఆర్టీసీ ఫ్రీ బస్​జర్నీ స్కీం, రూ.500 వంట గ్యాస్ ​సిలిండర్​ కలిసి వస్తాయనే నమ్మకంతో ఉన్నారు.

 ప్రజాపాలనలో విన్నవించుకున్న సమస్యలు పరిష్కారం కావాలంటే తమ పార్టీనే గెలిపించాలని ఓటర్లు డిసైడ్​ అయ్యారని సర్వేలో తేలిందని ఆ పార్టీ లీడర్లు చెప్తున్నారు. బోధన్​, మెదక్​, మెట్​పల్లి నిజాం చక్కెర ఫ్యాక్టరీల రీ ఓపెన్​కు విధించిన కట్​ఆఫ్ డేట్ కూడా కార్మికులు, రైతులను ఆ పార్టీకి చేరువ చేసింది. పార్లమెంట్​సెగ్మెంట్​లో ఫలితాలను ప్రభావం చేయగల శక్తి ఉన్న మైనారిటీలు ఈసారి కాంగ్రెస్​కు అండగా నిలబడడం కలిసొచ్చే అంశం.  మరోవైపు బీజేపీ అభ్యర్థి అర్వింద్, బీఆర్ఎస్ క్యాండిడేట్​గోవర్ధన్​ఒకే సామాజిక వర్గం కావడంతో ఓట్లు చీలి తనకు బెనిఫిట్​అవుతుందని జీవన్​రెడ్డి అనుకుంటున్నారు. 

కేసీఆర్​నే నమ్ముకున్న బాజిరెడ్డి

పోలీస్​ పటేల్​గా పనిచేసి యువకుడిగా రాజకీయాల్లోకి వచ్చిన ఆర్మూర్​ సెగ్మెంట్ ​సిరికొండ ప్రాంతానికి బాజిరెడ్డి గోవర్ధన్ వ్యక్తిగతంగా జిల్లా ప్రజలకు సుపరిచితుడు. రెండుసార్లు నక్సలైట్ల తుపాకీ దాడులను ఎదుర్కొన్న ఆయనకు 90వ దశకంలో యూత్​లీడర్​గా మాస్​ ఫాలోయింగ్​ ఉండేది. ఆర్మూర్, బాన్స్​వాడ, రూరల్​ అసెంబ్లీ సెగ్మెంట్ల నుంచి గెలిచిన అరుదైన రికార్డు ఉంది.

 ప్రత్యేక పరిస్థితుల్లో మొదటిసారి ఆయన బీఆర్ఎస్​ నుంచి పార్లమెంట్​బరిలో నిలిచారు. ఈ పార్లమెంట్​ పరిధిలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో బీఆర్​ఎస్​ మూడు సీట్లు గెలవడం కలిసివచ్చే అంశం. ఒక తరం ఓట్లతో పాటు తన సామాజిక వర్గం తన వెంట ఉన్నారన్న నమ్మకాన్ని పెట్టుకున్న గోవర్ధన్  గెలుపు భారాన్ని మొత్తం అధినేత కేసీఆర్​పైనే  వేశారు.  అసెంబ్లీ ఎన్నికల తర్వాత బీఆర్ఎస్​ క్రమంగా ఉనికి కోల్పోవడం, ఆయన రాజకీయాలపై కొడుకుల ఆధిపత్యం బాజిరెడ్డికి మైనస్​గా మారే అవకాశం ఉంది.