జహీరాబాద్‌లో కుల సంఘాలపై ఫోకస్

  • జహీరాబాద్ ఎంపీ స్థానంలో ఎలాగైనా గెలవాలని టార్గెట్ 
  • కుల సంఘాలకు బిల్డింగ్ లు నిర్మిస్తామని భరోసా 

కామారెడ్డి​, వెలుగు: జహీరాబాద్ ఎంపీ స్థానాన్ని దక్కించుకోవడానికి  అన్ని పార్టీలు కుల సంఘాల నేతలకు హామీల వర్షం కురిపిస్తున్నాయి.  వారి ఓట్లను తమ వైపు తిప్పుకునే ప్రయత్నాలు చేస్తున్నాయి. దీని కోసం ఏ అవకాశాన్ని వదులుకోవడం లేదు.  పార్టీ క్యాడర్​తో మీటింగ్‌లు,  ముఖ్య నేతలతో ప్రచార సభలు నిర్వహిస్తున్నాయి.   క్షేత్ర స్థాయిలో ఓట్లు రాబట్టుకునే మార్గాలపై రాజకీయ నేతలు దృష్టి పెడుతున్నారు. ఎన్నికల్లో తమకు మద్దతు ఇవ్వాలని, గెలిచిన తర్వాత మీరు చెప్పిన పనులు చేస్తామంటూ ఆయా సంఘాల కుల పెద్దలకు భరోసా కల్పిస్తున్నారు. 

ప్రతిష్టాత్మకంగా తీసుకున్న పార్టీలు 

జహీరాబాద్​ పార్లమెంట్​ స్థానాన్ని దక్కించుకోవాలని కాంగ్రెస్​, బీజేపీ, బీఆర్ఎస్‌లు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. ఎంపీ పరిధిలో ప్రధానంగా 4 అసెంబ్లీ నియోజక వర్గాలు కామారెడ్డి  జిల్లాలోనే ఉన్నాయి.  పార్లమెంట్ పరిధిలో మొత్తం  16,31,561 మంది ఓటర్లు ఉంటే ఇందులో కామారెడ్డి జిల్లాలో  8,73, 630 మంది ఓటర్లు ఉన్నారు.  సంగారెడ్డి జిల్లాలో  7,57,931 మంది ఉన్నారు. సంగారెడ్డి కంటే కామారెడ్డి జిల్లాలో 1,15,691 మంది ఎక్కువ  ఉన్నారు.    ప్రధానంగా గ్రామాల్లో, టౌన్​లో ఎక్కువ సంఖ్యలో ఓట్లు ఉన్న కుల సంఘాలను ఆకర్షించేందుకు  ప్రయత్నాలు చేస్తున్నారు.

 ఇప్పటికే ఆయా పార్టీల అభ్యర్థుల తరఫున వారి అనుచరణ గణం రంగంలోకి దిగింది.  కుల సంఘాల  ప్రెసిడెంట్లు,  ముఖ్య ప్రతినిధులు,  స్థానికంగా ఓటర్లను ప్రభావితం చేసే ఆయా వర్గాల ప్రతినిధులను కలిసి మద్దతును సమీకరించుకుంటున్నారు.  కాంగ్రెస్​, బీజేపీ, బీఆర్​ఎస్​ పార్టీల లీడర్లు, ఆ పార్టీ అభ్యర్థుల ముఖ్య అనుచరులు క్షేత్ర స్థాయిలో  ఆయా వర్గాల ప్రతినిధులను ఆకర్షించే పనిలో నిమగ్నమయ్యారు. 

అభ్యర్థులు, పార్టీ ముఖ్య నేతలు కంటిన్యూగా ప్రచారం చేస్తుండగా..  మరో  టీమ్​ కుల సంఘాలు, ఓటర్లను ప్రభావితం చేసే వ్యక్తులను కలుస్తున్నారు.  ఎన్నికల్లో తమకు మద్దతు ఇవ్వాలని కోరుతున్నారు.  తమ అభ్యర్థి , పార్టీ విజయం సాధించటం ద్వారా చేకూరే ప్రయోజనాల్ని వివరిస్తున్నారు.  కుల సంఘాల బిల్డింగ్​లు, పంక్షన్​హాల్స్​ నిర్మాణానికి  భరోసా ఇస్తున్నారు.  కామారెడ్డి, ఎల్లారెడ్డి నియోజక వర్గాల్లోని  పలు గ్రామాల్లో ఇప్పటికే సంప్రదింపులు జరిపారు.  నామినేషన్ల పర్వం ముగియడం,  పోలింగ్​కు  మరో 15 రోజులు  ఉన్న దృష్ట్యా ఈ ప్రక్రియను మరింత స్పీడప్
 చేశారు. 

వీరే కీలకం..

కామారెడ్డి జిల్లాలో నాలుగు నియోజకవర్గాల్లో ముదిరాజ్, మున్నూరు కాపు, ఎస్సీ, రెడ్డి, లింగాయత్ , యాదవ, కుర్మ, పద్శశాలీ, ఆర్య వైశ్య, క్షత్రియ, ఓట్లు ఆయా పార్టీల గెలుపొటములను ప్రభావితం చేయనున్నాయి.  లింగాయత్ ఓట్లు జుక్కల్ సెగ్మెంట్ లో ఎక్కువగా ఉండగా.. బాన్సువాడలోని కొన్ని మండలాల్లో కూడా వారు ఉన్నారు. ప్రస్తుతం బీజేపీ, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు ఇద్దరు కూడా లింగాయత్ సామాజిక వర్గానికి చెందిన వారే.