తెలంగాణ సాహిత్యం ఉత్థాన పతనం : పి. భాస్కర యోగి

తెలంగాణలో  కాంగ్రెస్​ ప్రభుత్వం ఏర్పడిన వెంటనే అందెశ్రీ రచించిన ‘జయ జయహే’ గీతాన్ని రాష్ట్రగీతంగా నిర్ణయించారు. అయితే, దానికి ఇటీవల సీఎం రేవంత్​రెడ్డి స్వరకల్పన బాధ్యత ఎంఎం కీరవాణికి ఇవ్వగానే రచ్చ మొదలైంది. పెద్ద పెద్ద కాంట్రా క్టులు ఆంధ్రా ప్రాంతంవారికి, ప్రాధాన్య పోస్టులు ఇతర రాష్ట్రాలవారికి ఇచ్చినప్పుడు ఎవరూ పట్టించుకోలేదు. కానీ, కీరవాణిపై మాత్రం కొంతమంది లోలోపల, ఇంకొందరు  బాహాటంగా వ్యతిరేకించారు. మరి ఆంధ్రాకు చెందిన సినిమా నటులు కూడా గత పదేండ్లు తమకు కావాల్సిన పనులన్నీ చక్కబెట్టుకుంటుంటే ఎవరూ కిమ్మనలేదు. ఓ అగ్రశ్రేణి నటుడు ఎన్నో కార్యక్రమాల్లో ముఖ్య అతిథిగా ఉన్నప్పుడు ఆయన పాన్​ ఇండియా నటుడు అని సరిపెట్టుకున్నాం కదా. 

మరి కీరవాణి కూడా బహుభాషా సంగీతకారుడు అని సరిపెట్టుకోలేరా? అని మరికొందరి ప్రశ్న. ఈ మధ్యలో 2017లో  కేసీఆర్​ జరిపిన తెలుగు మహాసభలకు పక్క రాష్ట్ర సీఎం చంద్రబాబును పిలవలేదని అలిగి సభలకు రాని గరికపాటి ఆలోచన తప్పా..ఒప్పా. అవార్డుల కోసం గత ప్రభుత్వ పెద్దలను శ్రీకృష్ణదేవరాయల మరో అంశ అంటూ పొగిడిన వందిమాగధ కవి పండితులంతా పీఠం కదలగానే మౌనవ్రతం ఎందుకు పూనారు? ఇదంతా ఇప్పుడు లిటరరీ గ్రూప్స్​లో జరుగుతున్న చర్చ. 

పాటలే తూటాల్లా..

గోరటి వెంకన్న పాటను ఎగిరెగిరి దుంకి పాడిన రసమయి బాలకిషన్ వంటి వారు అందెశ్రీ పాటపై ఇటీవల చాలారోజుల తర్వాత నోరు విప్పారు. మరి తెలంగాణ ఉద్యమానికి ఊపిరిలూదిన పాట గొంతు ఎవరు..ఎందుకు పిసికారు? అని ఎవరూ ఎందుకు  ప్రశ్నించలేదు. నిజానికి అందెశ్రీ గట్టిగా మాట్లాడతాడు. అతనితో  వేగడం కష్టం అని కొందరు నర్మగర్భ వ్యాఖ్యలు చేస్తున్నారు. వాళ్లకు సరైన వ్యక్తిత్వం ఉన్నట్లేనా. పక్కరాష్ట్రం వాళ్లపై, వాళ్ల భాషపై సెటైర్లు వేసి తెలంగాణ తెచ్చుకున్న మనం అక్కడి కాంట్రాక్టర్లకు రాష్ట్రాన్ని బార్లా డోర్లు తెరిచి అప్పజెప్పినప్పుడు ఒక్క పద్యమైనా రాశామా? దాశరథి, కాళోజీ అవార్డులు వస్తాయని నోరు తెరుచుకుని కూర్చుని ఛందస్సు, దరువు మర్చిపోయామా? మన గజ్జెలే సంకెళ్లు అయినప్పుడు, మన పాటలే తూటాల్లా తిరిగి గుచ్చుకున్నప్పుడు అదంతా అస్తిత్వం అని మురిసిపోయాం. కానీ, విధ్వంసం అని గుర్తించలేకపోయాం. అట్లాగని ఈ పదేండ్లలో తెలంగాణ సాహిత్యం వైభవానికి పట్టం కట్టలేదా? అంటే అది కూడా సరైంది కాదు. 

సాహిత్య అకాడమీని ఎలా నడిపారు?

చదువరి అయిన కేసీఆర్ లాంటి వ్యక్తి రాజైనప్పుడు కొన్ని మంచి పనులు జరిగాయి. 2017 తెలుగు మహాసభలు, సాహిత్య అకాడమీ ద్వారా 120 పుస్తకాలు, తెలుగు అకాడమీ ద్వారా సుమారు 120 మోనో గ్రాఫ్​లు ప్రచురణ విలువైన పనే. పాఠ్య పుస్తకాల్లో సింహభాగం తెలంగాణ ప్రాంత కవులకు  గౌరవం దక్కింది. అయితే దీపం వెనుక చీకటిలా ఎన్నో అపశ్రుతులు కూడా ఇందులో దొర్లాయి.  పదేండ్లుగా ఒకే వ్యక్తి రవీంద్రభారతి ఏలుతున్నాడు. కళాకారుల ఎంపికలో జరిగిన  ‘అస్మదీయ’ ముద్రలు, 2017 తర్వాత మళ్లీ సభలు ఏనాడు జరగలేదు.  ఓ పత్రికలో వ్యాసం రాసే పెద్దాయనకు అధికార భాషాసంఘం 
బాధ్యతలు ఇచ్చినా, ఫేస్​బుక్​లో యాక్టివ్​గా ఉండే పార్టీ  కార్యకర్తలాంటి ఓ వ్యక్తి ఏ సాహిత్య, భాషా పరిజ్ఞానం లేకున్నా అధికార భాషా సంఘం అప్పజెప్పడం ఏ సందేశం? మొదటిదఫాలో సాహిత్య అకాడమీ బాగా నడిచినా తదనంతర కాలంలో నిధులు లేకుండా ఓ పెద్దాయనను దానికి చైర్మన్​గా చేశారు. వార్తలనే వ్యాసాలుగా చేసే ఆయన కోటు వేసుకోవడం, తీసుకోవడంతోనే సరిపోయింది. లక్ష కోట్ల కాళేశ్వరంపై ‘జలకవితోత్సవం’ సంచిక వెలువడింది కానీ అది కన్నీటి కాసారంలా కరిగిపోతుంటే ఒక్క కలం కదలడం లేదు. దీనికంతా కారణం తెలంగాణ కవులు, సాహిత్య వేత్తలు అంతా మన్నుదిన్న పాములయ్యారు. పోతన ధూర్జటి, పాల్కురికి వంటి కవుల వారసులంతా ‘ముసలితనానికి కుసుమ గుడాలు’ అన్నట్లు రాజ్యం మెప్పు కోసం తండ్లాటమే. 

అస్తిత్వం మాయమైంది

తెలంగాణలో పుట్టిన మాదిగ మహా యోగి తత్వాల మహత్తు మర్చిపోయి వందిమాగధ స్తోత్రాల్లో మునిగి తేలాం. సురవరం, దాశరథి వంటి ప్రతిభాశాలుల పాండిత్య గరిమ వదిలిపెట్టి ఒక్క నిమిషంలో పూర్తి
చేసే విశ్వ విద్యాలయ పత్ర సమర్పణను గీటురాయిగా పెట్టుకున్నాం. కాబట్టే ఈ గడ్డపై తెలుగు పండితుల పదోన్నతిని కూడా వాళ్లు పొందలేకపోయారు. రంగనాథ రామాయణం వరి కోతల్లో గోన బుద్ధారెడ్డి పాడేటట్లు చేస్తే మనం రాజదర్బార్​కు సాంబ్రాణి వేశాం. 12వ శతాబ్దంలోనే సింహగిరి కృష్ణమాచార్యులు ఈ నేలపై కులం వద్దని గానం చేస్తే మనం  కులభవనాల ప్రారంభోత్సవాల్లో సెల్ఫీలు దిగాం. ఇక్కడే సాహిత్యం చెదలు పట్టింది. కవిత్వం కష్టాల్లో బందీ అయ్యింది. గుణదోషాలను చెప్పాల్సిన కవులు ఆస్థాన గాయకులుగా మారినప్పుడు ఈ ప్రాంత అస్తిత్వం అప్పుడే మాయమైంది. 

విశ్వవిద్యాలయాలకు మార్గదర్శనం ఏది?

రాజకీయ రంగుల రాట్నంలో తమ అస్తిత్వం కోల్పోవడం, వ్యక్తులు పతనం కావడమే సమాజం విధ్వంసం అయ్యేందుకు పునాది. భాషను, సాహిత్యాన్ని రక్షించుకోవడం అంటే అధికారాన్ని కాపాడటం కాదు. జడ్జీల ఫోన్లు ట్యాపింగ్​ అయిన కలికాలంలో కవులు, పండితులు మాటకు విలువ ఉంటుందా? ఇలాంటి భావన ఈ ప్రాంతాన్ని ఇప్పుడు వేధిస్తున్న మాట నిజమే. కానీ, మన సమాజానికి ప్రాచీన కవుల వారసత్వం, ఆధునిక పోకడల మార్గదర్శనం ఎవరు ఇవ్వాలి? ఎలా ఇవ్వాలి? మనకున్న టూల్స్​ను మనమే విధ్వంసం చేసుకుని తర్వాత లబోదిబోమని ఏడిస్తే ఏం సాధిస్తాం? మనం నడిచే వంతెనను మనమే బాంబులతో పేల్చుకుని ‘నేను నది దాటలేను’ అని వాపోవడం సమంజసమేనా?  తెలంగాణలో పదేండ్లలో ఒక్క విశ్వవిద్యాలయంలోనైనా తెలుగు డిపార్ట్​మెంట్​ బలోపేతమైందా. తెలంగాణ విశ్వవిద్యాలయంలో ‘లంచావతారుల’ వెనుక ఉండి కథ నడిపింది ఎవరు అని పండితలోకం ఆలోచన చేసిందా? ఆ ఒత్తిడిలో కదా గుమ్మన్నగారి బాల శ్రీనివాసమూర్తి వంటి పండిత పరిశోధకుడు వట్టి పుణ్యానికి ప్రాణం పోగొట్టుకున్నాడు. తెలుగు విశ్వవిద్యాలయంలో ఇక్కడి భాషా సాహిత్యాలపై ఏం గొప్పగా పరిశోధన జరిగిందని కూడా పండితులు అడగకపోవడం శోచనీయం.

తెలంగాణ పటిమను విస్మరించాం

‘రాజుల్మత్తుల్​వారి సేవ నరకప్రాయంబు’ అన్నాడు కదా ధూర్జటి. తన కవితను అమ్మకుండా కందమూలాలు తింటాను అన్నాడు కదా  పోతన.  మరి ఈ పాటగాళ్లంతా తెలంగాణ అస్తిత్వం వదిలేశారు. ఈ నేలకున్న సాహిత్య అస్తిత్వం మార్క్స్ ముఖంలో వెతకడం మొదలు పెట్టారు. మార్గ సాహిత్యం వదిలిపెట్టి దేశీ సాహిత్యంలో పురాణాలు రాసిన పాల్కురికి సోమన రచనా వైదుష్యం మనం ముందుతరాలకు ఇవ్వాలని అనుకోలేదు. శ్రీధర పండితుని వ్యాఖ్యానమంత కమ్మగా పద్యాలు అల్లిన పోతనను, గంటా వ్యాఖ్యానకారుడైన ఈ నేలలో పుట్టిన మల్లినాథ సూరిని వదిలిపెట్టాం. కావ్యాలకన్నా శాస్త్రాలను పుట్టించిన తెలంగాణ పటిమను విస్మరించాం కాబట్టే ఇక్కడి ఓరియంటల్​ కాలేజీలు ఒక్కొక్కటిగా మొత్తం మూసేసినా నోరు తెరవలేదు. శాపానుగ్రహ సమర్థుడైన వేములవాడ భీమకవి వారసత్వం నోరు తెరవలేదు. లొల్లాయిగాళ్ల లొల్లి భుజానికెత్తుకున్నాం. 

తెలంగాణ సాహిత్యమంటే నాలుగు అవార్డులు కాదు
 
తమ సంసారాలు విధ్వంసం చేసుకుని ఆచార్య ఖండవల్లి లక్ష్మీరంజనం వంటి పండితులు ప్రాచ్య కళాశాలలు స్థాపిస్తే అందులో ఎందరో ఉచితంగా, నామమాత్రపు ఫీజులతో సాయంకాలం చదువుకుని గొప్ప పండితులయ్యారు. అలాంటి కాలేజీని ఆనవాలు లేకుండా చేస్తే పక్కనున్న ఆ ప్రముఖ గాయకుడైనా చెప్పాలి కదా?  తెలంగాణ అంటే నలుగురు అవార్డులు పొందడం, కొందరికి పదవులు దక్కడం కాదు. అది సమాజ చైతన్యం.  అపార కార్య సంసారంలో కవి ప్రజాపతిగా ఉండాల్సింది పోయి రిటైర్​అయ్యాక కాలక్షేపానికి సంస్థలను గబ్బిలాల్లా పట్టుకునేవాళ్లకు ఇదంతా పట్టకపోవచ్చు. అన్నీ తెలిసిన ఆ సర్వజ్ఞుడైనా నేను ఈ పీఠంపై ఎక్కడానికి పుంటికూర–గోంగూర అని, ఆనిగెపుకాయ–సొరకాయ అని నేనే కదా అన్నది అని ఎందుకన్పించలేదు? వ్యాపారస్తులు, రాజకీయ పండితులు ట్రాక్​ తప్పినట్లే తెలంగాణ సమాజంలోని లేఖకులు అంతా దారి తప్పినట్లేనా? ఇప్పటికైనా లోతైన అధ్యయనం, తెలంగాణ సమాజం వైపు సాహిత్య మథనం జరగాలి.  

‑ డా. పి. భాస్కర యోగి,పొలిటికల్‌‌‌‌ & సోషల్​, ఎనలిస్ట్​