పీవీలో సోషలిజమూ ఉంది ..

ఇయ్యాల మాజీ  ప్రధానమంత్రి, దివంగత  పీవీ నరసింహారావు 103వ జయంతి. 

పీవీ 1991లో ఆర్థిక సంస్కరణలను ప్రవేశపెట్టినప్పటికీ ఆయన ఎన్నడూ ఆర్థిక సంస్కర్తగా గుర్తింపు కోరుకోలేదు. 1940వ దశకంలో తన రాజకీయ గురువు స్వామి రామానంద తీర్థతో కలిసి ఉన్న రోజుల నుంచి పీవీ  సోషలిస్ట్‌‌గా కొనసాగారు. తన భావజాలాన్ని పీవీ ఎన్నడూ మార్చుకోలేదు. 1971 నుంచి 1973 వరకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఆయన పాలనలో ఇది ప్రతిబింబించింది. 

1991 నుంచి 1996 వరకు  భారతదేశ ప్రధాన మంత్రిగా సేవలందించారు. ప్రైవేటీకరణ, ప్రపంచీకరణ పాలనకు దారితీయాలని నరసింహారావు ఎప్పుడూ భావించలేదు. కానీ, బీజేపీ, కాంగ్రెస్‌‌ నేతలు ఉద్దేశపూర్వకంగా పీవీ సంస్కరణలకు తెర లేపారని ప్రచారం చేస్తున్నారు.  వాస్తవానికి భారతదేశంలో ఆర్థిక సంస్కరణలు పూర్తిగా నెహ్రూ సూత్రాలపై ఆధారపడి ఉన్నాయి.

పీవీ తన పదవీకాలంలో  డిజిన్వెస్ట్‌‌మెంట్‌‌ను ఎలా కొనసాగించాలనే దానిపై వివరణాత్మక మార్గదర్శకాలను జారీ చేశారు. కానీ, 1991లో పీవీ నరసింహారావు ప్రారంభించిన విధానాన్ని విస్మరించి1998లో వాజ్‌‌పేయి ప్రభుత్వంతో  పెట్టుబడుల ఉపసంహరణ స్థానంలో ప్రైవేటీకరణను నిర్మొహమాటంగా సమర్థించింది. అప్పటి ప్రధానమంత్రి అటల్ బిహారీ వాజ్‌‌పేయి పెట్టుబడుల ఉపసంహరణను తొలగించి, దాని స్థానంలో  మొదటిసారిగా ప్రైవేటీకరణను తీసుకువచ్చారు. 

అదేవిధంగా విమానాశ్రయాల ప్రైవేటీకరణపై పీవీ అనుమానాలు వ్యక్తం చేశారు. అక్టోబరు, 1947లో  శ్రీనగర్ విమానాశ్రయం ప్రభుత్వ అధీనంలో ఉండటంవల్లనే పాకిస్తాన్ దండ యాత్రను అడ్డుకోవడానికి సైనికులను సకాలంలో తరలించగలిగారు. ఎయిర్‌‌పోర్టులు ప్రైవేట్‌‌ చేతుల్లో ఉన్నట్లయితే ఇది సాధ్యం కాకపోయేది. వాస్తవానికి,  నెహ్రూ విదేశాంగ విధాన కార్యక్రమాలతో సహా ఆయన భావజాలాన్ని తిరస్కరించిన వ్యక్తిగా పీవీ నరసింహారావును అంచనా వేయడానికి.. బీజేపీ ప్రభుత్వం ఇటీవల పీవీ నరసింహారావుకు అత్యున్నత పౌర పురస్కారం భారత-రత్న వ్యూహాత్మకంగా ప్రకటించింది. 

జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం  రూపకర్త

భారతదేశంలో ఆర్థిక సంస్కరణలు పూర్తిగా నెహ్రూ సూత్రాలపై ఆధారపడి ఉన్నాయి. 1992లో దావోస్‌‌లో జరిగిన వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్‌‌లో  పీవీ నరసింహారావు తన ప్రసంగంలో  మిశ్రమ ఆర్థిక వ్యవస్థగా మధ్యే మార్గాన్ని ప్రస్తావించారు. ఆర్థిక సంస్కరణల్లో తీవ్ర లెఫ్ట్  లేదా ఎక్స్‌‌ట్రీమ్ రైట్​కు స్థానం లేదని నొక్కి చెప్పడం అందులో అంతర్లీనంగా ఉంది.  నెహ్రూ మోడల్‌‌ ఆఫ్‌‌ డెవలప్‌‌మెంట్‌‌ను వెనక్కి తీసుకునే ప్రసక్తే లేదని పీవీ ప్రపంచానికి స్పష్టం చేశారు. 

ఆర్థిక సంస్కరణల ప్రక్రియ ద్వారా వనరులను సమీకరించడం,  జీవన ప్రమాణాలను పెంచేందుకు సహాయం చేయడానికి సమాజంలోని బలహీన, పేద వర్గాల కోసం  నిధులను వినియోగించాలని భావించారు. నూతన ఆర్థిక విధానంలో భాగంగా  మొట్టమొదటిసారిగా ఉపాధి హామీ పథకం రూపుదిద్దుకుంది.  అనంతరం ఈ పథకం 2005లో మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టంగా మారింది.  గ్రామీణ ప్రాంత ప్రజల అభివృద్ధి లక్ష్యంగా పథకాలకు ప్రాధాన్యమిచ్చారు. 

విప్లవాత్మక ల్యాండ్​ సీలింగ్ యాక్ట్​

పీవీ 1973లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో మైలురాయిలాంటి  విప్లవాత్మకమైన భూ సీలింగ్ చట్టాన్ని తీసుకువచ్చారు. తరువాత, పీవీ నరసింహారావు1976లో రాజ్యాంగం 42వ సవరణ ద్వారా రాజ్యాంగ ప్రవేశికలో సోషలిజం, లౌకికవాదాన్ని చేర్చడానికి ఇందిరాగాంధీతో కలిసి పనిచేశారు.  వాస్తవానికి, పీవీ నేతృత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వ విధానమైన పీఎస్​యూలలో పాక్షిక పెట్టుబడుల ఉపసంహరణను వాజ్‌‌పేయి ప్రభుత్వం పూర్తిగా విక్రయించడం ద్వారా వేరు చేసింది. 

పార్లమెంటులో మెజారిటీ కూడా లేనిప్రభుత్వానికి రూ. 200,000 కోట్ల విలువైన ప్రభుత్వ ఆస్తులను విక్రయించే హక్కు లేదని పీవీ వాదించారు. ఎయిర్-ఇండియా విక్రయాన్ని నిరాకరించారు.  ‘ప్రభుత్వం ఎయిర్- ఇండియా, ఇండియన్ ఎయిర్‌‌లైన్స్‌‌ను విక్రయించాలని ఆలోచించడం చాలా దురదృష్టకరం. జాతీయ జెండాను కలిగి ఉన్న తన నేషనల్ క్యారియర్‌‌ను భారతదేశం అమ్మడం గురించి నేను ఆలోచించలేను’ అని పీవీ అన్నారు.  భారతదేశంలో సరళీకరణ అంటే ప్రభుత్వ రంగాన్ని ప్రైవేట్ ఎంటర్‌‌ప్రైజ్‌‌గా మార్చడం వాస్తవం కాదని పీవీ  నొక్కిచెప్పారు. టేకోవర్ కోసం ప్రస్తుత ప్రభుత్వ రంగాన్ని దృష్టిలో పెట్టుకోవద్దని, ప్రభుత్వ రంగానికి చెందని పెద్ద అవసరాలను తీర్చడానికి కొత్త పరిశ్రమలను ప్రారంభించడంపై దృష్టి పెట్టాలని తన ప్రభుత్వం భావి పెట్టుబడిదారులకు  చెప్పిందని పీవీ స్పష్టం చేశారు.

ఫారిన్​ పాలసీ మార్గదర్శి

ఫారిన్ పాలసీలో పీవీ నరసింహారావు భారతీయ విదేశాంగ విధానానికి మార్గదర్శకుడు.  ఇందిరా గాంధీ 1983లో ఢిల్లీలో కామన్వెల్త్ సమిట్,  నామ్ సమిట్‌‌ను నిర్వహించినప్పుడు ఆమె మంత్రివర్గంలో విదేశాంగ మంత్రిగా పీవీ కీలకపాత్ర పోషించారు. ఈ రెండు సంఘటనల తర్వాతే ఇందిరాగాంధీ ఆయనను కేంద్ర హోంమంత్రిగా చేశారు, 

ఆ సమయంలో పంజాబ్‌‌లో తీవ్రవాదం తీవ్రస్థాయికి చేరుకుంది. ప్రధానమంత్రిగా పీవీ.. నెహ్రూ విదేశాంగ విధానాలకు అనుగుణంగా పనిచేశారు. 1954లో నెహ్రూ రూపొందించిన పంచశీల తర్వాత,  చైనాతో ఎల్​ఏసీ వెంట శాంతి  ఒప్పందంపై 1993 సెప్టెంబర్‌‌లో పీవీ సంతకం చేశారు. లుక్ ఈస్ట్ పాలసీకి ఇది నాంది పలికింది. లుక్ ఈస్ట్ పాలసీ ఆఫ్ ఇండియాను 1991లో మాజీ ప్రధాని నరసింహారావు నేతృత్వంలోని భారత ప్రభుత్వం ప్రారంభించింది. 

ఆగ్నేయాసియాలోని దేశాలతో రాజకీయ, ఆర్థిక, భద్రతా సహకారాన్ని అభివృద్ధి చేయడం దీని లక్ష్యం. ప్రచ్ఛన్న యుద్ధ సమయంలో పలు దేశాలతో భారత్​ సంబంధాలు దెబ్బతిన్నాయి. ప్రచ్ఛన్న యుద్ధం ముగిసిన తరువాత ఈ దేశాలతో భారత సంబంధాలను పునర్నిర్మించాలని పీవీ కోరుకున్నారు. సోషలిజం విఫలమైందని లేదా ఆర్థిక సంస్కరణలకు అనుకూలంగా దానిని విడిచిపెట్టాలని పీవీ ఎప్పుడూ భావించలేదు. కానీ,  నూతన ఆర్థిక విధానాన్ని విశ్వసించారు. సమాజంలోని అణగారిన వర్గాల భద్రత, ఉన్నతి కోసం కృషి చేశారు.  

- వెంకట్ పర్స,
పొలిటికల్​ ఎనలిస్ట్​