డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ చేస్తున్నారని పారిపోతూ ఎంత‌ప‌ని చేశార‌య్యా..!

  • బైక్‌తో మరో బైక్‌ ను ఢీ కొట్టి.. ముగ్గురికి గాయాలు
  • రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఘటన

ఎల్లారెడ్డిపేట, వెలుగు: పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ చేస్తున్నారని, ఓ వ్యక్తి బైక్‌తో పారిపోతూ మరో బైక్‌ను ఢీకొట్టాడు. ఈ ప్రమాదంలో బైక్ నడుపుతున్న అతనికి తీవ్రగాయాలు కాగా.. మరో ఇద్దరికి స్వల్ప గాయాలయ్యాయి. స్థానికులు తెలిపిన ప్రకారం.. రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేటకు చెందిన చరణ్(37) బేకరీ నిర్వహిస్తున్నాడు.

మంగళవారం రాత్రి షాపు క్లోజ్‌ చేసి ఇంటికి వెళ్తుండగా.. రాచర్ల జూనియర్‌‌ కాలేజీ వద్ద పోలీసులు డ్రంక్‌ అండ్ డ్రైవ్‌ టెస్టులు చేస్తున్నారు. అప్పటికే మందు తాగి ఉన్న చరణ్  పోలీసులకు దొరుకుతానని భయపడి, బైక్ రిటర్న్‌ చేసుకొని స్పీడ్‌గా వెళ్తూ మరో బైక్‌ను ఢీకొట్టాడు. ఈ ప్రమాదంలో చరణ్ తలకు తీవ్రగాయాలు కాగా.. మరో బైక్‌పై ఇద్దరికి స్వల్ప గాయాలయ్యాయి. చరణ్‌ను ప్రైవేట్‌ హాస్పిటల్‌కు తరలించగా పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలిసింది.