అప్పు తీసుకున్న వ్యక్తే దొంగ .. వడ్డీ వ్యాపారి ఇంట్లో చోరీ కేసును ఛేదించిన పోలీసులు

  • నిందితుడి వద్ద రూ.26.50లక్షల విలువైన నగలు, నగదు స్వాధీనం
  • మహబూబాబాద్ జిల్లాఎస్పీ సుధీర్​ రామ్​నాథ్ ​కేకన్​ వెల్లడి

మహబూబాబాద్​, వెలుగు:  వడ్డీవ్యాపారీ ఇంట్లో జరిగిన భారీ చోరీ ఘటనను 24 గంటల్లోనే మహబూబాబాద్ జిల్లా పోలీసులు చేధించారు. బుధవారం జిల్లా కేంద్రంలోని టౌన్ పీఎస్ లో  ప్రెస్ మీట్ లో ఎస్పీ సుధీర్ రామ్ నాథ్​కేకన్​వివరాలు వెల్లడించారు. నర్సింహుల పేట మండల కేంద్రానికి చెందిన ఎరనాగి సీతారాములు స్థానికంగా వడ్డీ వ్యాపారం చేస్తుంటాడు.  అతని వద్ద ఇటీవల అదే గ్రామానికి చెందిన కోటగిరి రవి రూ.2 లక్షలు అప్పుగా తీసుకున్నాడు. సీతారాములు ఇంట్లో భారీగా బంగారం, నగదు ఉందని భావించిన రవి చోరీకి ప్లాన్ చేశాడు. ఈనెల6న  మధ్యాహ్న సమయంలో సీతారాములు ఇంటి తాళం ఇనుపరాడ్​తో తొలగించి బీరువాలోని నగలు, నగదు ఎత్తుకెళ్లాడు. 

వాటిని రవి తన వ్యవసాయ పొలం వద్ద దాచిపెట్టాడు. ఈనెల 7న పోలీసుస్టేషన్ లో బాధితుడు సీతారాములు ఫిర్యాదు చేశాడు. పక్కా సమాచారంతో బుధవారం నిందితుడిని అదుపులోకి తీసుకొని విచారించగా నేరాన్ని అంగీకరించాడు. రవి వద్ద  28 తులాల బంగారం, 4.5 కేజీల వెండితో పాటు రూ. 8.90 లక్షల నగదును స్వాధీనం చేసుకోగా.. మొత్తంగా రూ.26.5 0లక్షల విలువ ఉంటుంది. కేసును ఛేదించిన మరిపెడ సీఐ రాజ్​కుమార్, నర్సింహులపేట ఎస్ఐ సురేశ్,సీసీఎస్ సీఐ హథిరామ్, ఎస్ ఐ తాహెర్ బాబాను ఎస్పీ  సుధీర్ రామ్ నాథ్​ అభినందించారు.