రియల్ లైఫ్ పంచాయితీ: స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో ఎస్పీకి అవమానం.. వీడియో వైరల్..

స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో జాతీయ జెండా ఎగరేసిన తర్వాత శాంతికి చిహ్నంగా పావురాన్ని వదలటం కామనే. పంద్రాగస్టు అయిపోయి వారం అవుతుంది కదా.. ఇప్పుడెందుకు స్వాతంత్య్ర వేడుకల గురించి ప్రస్తావన అనుకుంటున్నారా.. ఛత్తీస్గఢ్ లో జరిగిన ఈ సంఘటన గురించి తెలుసుకుంటే మీకే సమాధానం దొరుకుతుంది. వివరాల్లోకి వెళితే.. ఛత్తీస్‌గఢ్‌లోని ముంగేలి జిల్లాలో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది, పోలీసు సూపరింటెండెంట్ వదిలిన పావురం ఎగరకుండా కిందికి పడిపోయింది. పాపులర్ వెబ్ సిరీస్ 'పంచాయత్' సీజన్‌ 3లో కూడా అచ్చం ఇలాంటి సీన్ ఉండటంతో ఈ ఘటన వైరల్ గా మారింది. ఘటనపై పోలీసు సూపరింటెండెంట్ గిరిజా శంకర్ జైస్వాల్ స్పందిస్తూ బాధ్యులపై క్రమశిక్షణా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

బీజేపీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి పున్నూలాల్ మోహ్లే, కలెక్టర్ రాహుల్ డియో, ఎస్పీ జైస్వాల్‌లు హాజరైన ఈ కార్యక్రమంలో శాంతి, స్వేచ్ఛకు చిహ్నంగా పావురాలను ఎగరేసారు. ఎమ్మెల్యే వదిలేసిన పావురం ఎగిరిపోగా.. ఎస్పీ వదిలేసిన పావురం కింద పడిపోయింది.

ఘటనపై స్పందించిన ఎస్పీ జైస్వాల్ "స్వాతంత్య్ర దినోత్సవం వంటి జాతీయ ప్రాముఖ్యత కలిగిన కార్యక్రమంలో, పావురం నేలమీద పడిన సంఘటన సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. అనారోగ్యంతో ఉన్న పావురాన్ని ఎగురవేయడం వల్లే వల్ల ఈ పరిస్థితి ఏర్పడిందని చెప్పుకొచ్చారు.ఈ ఘటనకు బాధ్యులైన అధికారి తన బాధ్యతను సక్రమంగా నిర్వర్తించలేదని, అతనిపై క్రమశిక్షణా చర్యలు తీసుకోవాలని ఎస్పీ జైస్వాల్ డిమాండ్ చేశారు.