కీలక కేసుల్లో.. ముందుకు సాగని ఎంక్వైరీ

  • యాక్షన్​ తీసుకోవడంలో ఆఫీసర్ల నిర్లక్ష్యం

వనపర్తి, వెలుగు : ప్రధాన కేసుల్లో ఎంక్వైరీ చేసే విషయంలో పోలీస్​ ఆఫీసర్లు నిర్లక్ష్యం చేస్తున్నారు. ఆరు నెలల్లో జిల్లాలో జరిగిన రెండు ఘటనలతో పాటు ఒక హత్య కేసు విచారణ మూడడుగులు ముందుకు, ఆరడుగులు వెనక్కి అన్నచందంగా మారింది. చిన్నాచితకా కేసుల్లో వెంటనే విచారణ చేపట్టే పోలీస్​ ఆఫీసర్లు, ముఖ్యమైన కేసుల్లో మాత్రం ఎంక్వైరీపై దృష్టి పెట్టకపోవడం అనుమానాలకు తావిస్తోంది.

కీలక ఫైళ్లు మాయం చేసిన్రు..

కలెక్టరేట్​లోని భూసేకరణ ఆఫీస్​లో పలు కీలక రికార్డులు జనవరి రెండో వారంలో మాయమయ్యాయి. కలెక్టరేట్​లో రికార్డులు మాయం కావడమంటే అనుమానించాల్సిన విషయమే. రికార్డుల మాయమైన ఘటనలో హస్తముందనే అనుమానంతో ఆరుగురు ఔట్​సోర్సింగ్​ ఎంప్లాయీస్​పై కేసు పెట్టారు. సంబంధిత శాఖ ఆఫీసర్లు రూరల్​ పోలీస్ స్టేషన్​లో కంప్లైంట్​ చేసినా ఇంత వరకు ఎంక్వైరీ పూర్తి చేయలేదు. జిల్లాలో వివిధ ప్రాజెక్టులు, కాల్వలు, రిజర్వాయర్లకు సంబంధించిన భూసేకరణ పరిహారం ఎంత వరకు వచ్చిందని కోర్టు కలెక్టర్​ను అడగడంతో రికార్డులు మాయమైన విషయం వెలుగులోకి వచ్చింది.

కల్వకుర్తి లిఫ్ట్  ఇరిగేషన్, పీఆర్ఎల్ఐ, రంగసముద్రం, ఏదుల రిజర్వాయర్, ఎత్తిపోతల స్కీమ్​లకు భూసేకరణ చేశారు. ఏ స్కీమ్​కు సంబంధించిన రికార్డులు మాయమయ్యాయనే విషయాన్ని మాత్రం ఆఫీసర్లు చెప్పడం లేదు. ఇదిలాఉంటే ఒకసారి భూసేకరణ చేశాక.. 12 ఏండ్ల వరకు పరిహారం కోసం కోర్టులో కేసు వేసే అవకాశం ఉంటుంది. దీనిని అవకాశంగా తీసుకున్న మధ్యవర్తులు ఆఫీస్​లో పని చేసే ఔట్​సోర్సింగ్​ ఉద్యోగులను మచ్చిక చేసుకుని రికార్డుల్లోని కీలక పత్రాలను తొలగించినట్లు అనుమానిస్తున్నారు. గతంలో ఇచ్చిన పత్రాలను మార్చి ఎక్కువ మొత్తంలో పరిహారం పొందేలా ప్లాన్​ చేశారని అంటున్నారు. ఈ కేసులో ఆరుగురు ఔట్​ సోర్సింగ్​ ఎంప్లాయీస్​పై కేసు నమోదు చేసి, వారి స్థానంలో కొత్త వారిని తీసుకున్నారు. రాష్ట్ర స్థాయి ఆఫీసర్లకు ఈ విషయాన్ని తెలిపి చేతులు దులుపుకున్నారు. 

గోదాం అగ్నిప్రమాదంలోనూ అదే నిర్లక్ష్యం..

పెబ్బేరు అగ్రికల్చర్​ మార్కెట్​ కమిటీ గోదాంలో ఏప్రిల్​ 1న అగ్నిప్రమాదం జరిగి రూ.10 కోట్ల మేర ఆస్తి నష్టం జరిగింది. ఈ ఘటన జరిగి మూడు నెలలు కావస్తున్నా ఇంత వరకు బాధ్యులు ఎవరనే విషయాన్ని తేల్చకపోయారు. జిల్లాలోని కొనుగోలు కేంద్రాలకు ఇక్కడి నుంచే గన్నీ బ్యాగులు సప్లై చేస్తారు. అలాంటిది గోదామ్​లో రైసు మిల్లర్లు నిల్వ చేసుకున్న వడ్లు, సివిల్​ సప్లై​డిపార్ట్​మెంట్​కు చెందిన గన్నీబ్యాగులు అగ్నిప్రమాదంలో కాలిపోయాయి.

ప్రమాదంలో 23 వేల బస్తాల వడ్లు, 12.85 లక్షల గన్నీ బ్యాగులు కలిపి రూ.10కోట్ల వరకు నష్టం జరిగినట్లు ఆఫీసర్లు మొదట అంచనా వేశారు. ఇదిలాఉంటే అగ్ని ప్రమాదం ఎలా జరిగిందనే విషయంలో నిజానిజాలు తేలలేదు. ఇక్కడి నుంచి 7 లక్షల గన్నీ బ్యాగులు పక్కదారి పట్టాయనే ఆరోపణల నేపథ్యంలో వివరాలను బయటపెట్టడం లేదని అంటున్నారు. 

తేలని మర్డర్​ కేసు..

వనపర్తి జిల్లా చిన్నంబావి మండలం లక్ష్మీపల్లి గ్రామంలో మే 22న మాజీ ఎమ్మెల్యే హర్షవర్ధన్​రెడ్డి అనుచరుడు, బీఆర్ఎస్​ నేత శ్రీధర్​రెడ్డిని గుర్తు తెలియని దుండగులు హత్య చేశారు. ఇంత వరకు హంతకులెవరో తేల్చలేదు. టెక్నాలజీ పెరిగినా ఈ కేసు పరిష్కారంలో పురోగతి కనిపించకపోవడంపై ప్రజలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. వీటితో పాటు ఆత్మకూరు మండలంలోని లోయర్​ జూరాల జల విద్యుత్​ ఉత్పత్తి కేంద్రం గోదామ్​లో జూన్​ మొదటి వారంలో దొంగతనం జరిగింది. చోరీకి గురైన మెటీరియల్ ను​ఇప్పటి వరకు రికవరీ చేయలేదు. దొంగతనం జరిగి నెల కావస్తున్నా కేసు కొలిక్కి రాకపోవడం గమనార్హం.