మూకుమ్మడి ఆత్మహత్యలపై పోలీసుల దర్యాప్తు

  • కాలాడేటా, వాట్సాప్​ చాటింగ్స్​ విశ్లేషణ
  • నీళ్లు ఎక్కువగా మింగటంతోనే మృతిచెందారని ప్రైమరీ రిపోర్టు
  • మరింత సమాచారం కోసం ఫోరెన్సిక్​ ల్యాబ్​కు పంపనున్న పోలీసులు  

కామారెడ్డి, వెలుగు : కామారెడ్డి జిల్లాలో ఎస్ఐ, మహిళా కానిస్టేబుల్,  కంప్యూటర్​ ఆపరేటర్​ చెరువులో దూకి ఆత్మహత్య చేసుకున్న కేసు విచారణ పూర్తి చేసేందుకు  పోలీసు అధికారులు నిమగ్నమయ్యారు.  ఈ ఘటనను పోలీసు ఉన్నతాధికారులు సీరియస్​గా తీసుకున్నారు.   మూకుమ్మడిగా చెరువులో పడి చనిపోవడానికి దారితీసిన పరిస్థితులు ఏమిటనేది నిగ్గు తేల్చే పనిలో ఉన్నారు.  భిక్కనూరు ఎస్సై సాయికుమార్, బీబీపేట కానిస్టేబుల్​ శృతి, సొసైటీ లో కంప్యూటర్​ ఆపరేటర్​ తోట నిఖిల్ బుధవారం సదాశివనగర్​ మండలం అడ్లూర్​ఎల్లారెడ్డి చెరువులో పడి ఆత్మహత్య చేసుకున్నారు.  

ఈ  కేసు దర్యాప్తులో వీరి సెల్​ఫోన్లు కీలకంగా  మారాయి.  వీరి సెల్​ఫోన్ల డేటాను విశ్లేషణ చేసే పనిలో ఉన్నారు.  సెల్​ఫోన్​సిమ్​ల సీడీఆర్​సేకరించడంతో పాటు,  వాట్సాప్​ చాటింగ్​ను పరిశీలిస్తున్నారు.  ఎస్​ఐ మూడు సిమ్​లను వినియోగిస్తున్నట్లు తెలిసింది.  ఒక ఫోన్​ఫ్యాంట్​జేబులో, మరో ఫోన్​కారులో ఉంది.  ఎస్ఐ  వినియోగించిన మరో సెల్​ఫోన్​డేటా వాట్సాప్​ ఓపెన్​ కావడంలేదని తెలిసింది.  

ఘటనకు వారం ముందు నుంచి వీరు సెల్​ఫోన్లలో మాట్లాడుకోవడం, చాటింగ్​లు ఎక్కువగా జరిగినట్లు పోలీసులు గుర్తించినట్లు తెలుస్తోంది.   ఈ ముగ్గురికి దగ్గరి పరిచయం ఉన్నట్లు ప్రచారం సాగుతోంది.  కాగా వీరు తమ మధ్య ఉన్న వివాదం  పరిష్కరించుకునే క్రమంలోనే  కారులో వెళ్తూ చెరువు సమీపంలో అగి ఉంటారని అధికారులు భావిస్తున్నారు.   

నీళ్లు ఎక్కువగా మింగటంతో...

చెరువులో దూకడంతో నీళ్లు ఎక్కువగా మింగారని పోస్టుమార్టం ప్రైమరీ రిపోర్టులో తేలినట్లు తెలిసింది.  మృతుల శరీరాల బలమైన గాయాలు లేవని, నీళ్లు ఎక్కువగా మింగటంతో లంగ్స్​లోకి వెళ్లినట్లు తెలుస్తోంది.  పోస్టుమార్టం చేసిన అనంతరం మరింత విశ్లేషణ కోసం పోరెన్సిక్​ ల్యాబ్​కు పంపారు.  కంప్లీట్​  రిపోర్టు రావడానికి మరికొన్ని రోజులు పట్టనుంది.  

శుక్రవారం పోలీసు అధికారులు సమావేశమై కేసు ఎంక్వెయిరీపై చర్చించారు.   కాల్​డేటా, వాట్సాప్​ చాటింగ్​లపై విశ్లేషణ చేశారు.  భిక్కనూరు నుంచి ఎస్ఐ తన సొంత కారులో ఒకరే బయలు దేరగా మార్గమద్యంలో  నర్సన్నపల్లి శివారులో మిగతా ఇద్దరు కారులో ఎక్కినట్లు గుర్తించారు.