నేలకొండపల్లిలో వీడిన వృద్ధ దంపతుల మర్డర్ ​మిస్టరీ!

  •  పోలీసుల అదుపులో 8 మంది నిందితులు?
  • హత్యల్లో ప్రత్యక్షంగా పాల్గొన్నది నలుగురు
  • సహకరించిన ఆటో డ్రైవర్, మరో ముగ్గురు ​ 
  • బంగారం, డబ్బుల కోసమే దారుణంగా హత్య
  • విచారిస్తున్న పోలీసులు, ఇవాళ అరెస్ట్ చూపే చాన్స్

ఖమ్మం/ నేలకొండపల్లి, వెలుగు:  ఖమ్మం జిల్లా నేలకొండపల్లిలో గతనెల 27న జరిగిన వృద్ధ దంపతుల హత్య కేసును పోలీసులు ఛేదించినట్టు తెలుస్తోంది. ఇంట్లో కిరాయికి దిగిన ఇద్దరు మహిళలతో పాటు మరో ఇద్దరు కలిసి ఈ జంట హత్యలకు పాల్పడినట్టు విశ్వసనీయ సమాచారం. హంతకులతో పాటు వారికి సహకరించిన వారిని కలిపి మొత్తం ఎనిమిది మంది ప్రస్తుతం పోలీసుల అదుపులో ఉన్నారని, వారి ఎంక్వైరీ కొనసాగుతోందని తెలుస్తోంది. గతంలో ఇదే తరహాలో ఎక్కడెక్కడ నేరాలకు పాల్పడ్డారనేది తేల్చడంతో పాటు పాత కేసులేమైనా ఉన్నాయా అని విచారిస్తున్నారు. గురువారం ఖమ్మం పోలీస్​ కమిషనరేట్ లో కానీ, నేలకొండపల్లిలో కానీ నిందితులను మీడియా ముందు ప్రవేశపెట్టడంతో పాటు, హత్యలకు సంబంధించిన పూర్తి వివరాలను వెల్లడిస్తారని సమాచారం.  

నగలు, నగదు కోసమే!

నేలకొండపల్లిలో నవంబర్ 26న అర్ధరాత్రి యర్రా వెంకట రమణ (60), క్రిష్ణకుమారి (54) హత్యకు గురయ్యారు. ఒకరోజు ముందు మృతుల ఇంట్లో అద్దెకు దిగిన ఇద్దరు మహిళలు ఈ మర్డర్​ లో కీలకంగా వ్యవహరించినట్టు తెలుస్తోంది. కేవలం డబ్బు, బంగారం కోసమే వారిని హత్య చేసినట్లు నిందితులు ఒప్పుకున్నట్టు సమాచారం. సూర్యాపేట జిల్లా కోదాడకు చెందిన ఓ వ్యక్తి ఈ మర్డర్లకు ప్రధాన సూత్రధారి కాగా, అనంతగిరి మండలం శాంతి నగర్ కు చెందిన ఓ మహిళ, నేలకొండపల్లి మండలం పైనంపల్లికి చెందిన మరో మహిళతో పాటు మరో వ్యక్తి కలిసి హత్య చేసినట్లు తెలుస్తోంది.

 రాత్రి 11 గంటల తర్వాత ఇంట్లోకి ప్రవేశించి ముందుగా క్రిష్ణకుమారిని గొంతునులిమి, ఆ తర్వాత వెంకటరమణను అదే తరహాలో హత్య చేసినట్లు సమాచారం. హత్య తర్వాత రూ.2 లక్షల విలువైన బంగారం, నగదుతో పరారైనట్టు తెలుస్తోంది. నిందితులు పారిపోయేందుకు సహకరించిన ఆటో డ్రైవర్​, బంగారం కొన్న వ్యక్తి, మరో ఇద్దరిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకొని ఎంక్వైరీ చేస్తున్నారు. వీరంతా ఓ పథకం ప్రకారం ముందుగానే పెద్ద పెద్ద ఇండ్లను ఎంచుకొని, ఆ ఇండ్లల్లో ఇంటి యజమానులు వృద్ధులు, వికలాంగులు, నిస్సహాయ స్థితిలో ఉన్నవారిని లక్ష్యంగా చేసుకుంటారు. 

ఇండ్లు కిరాయికి  కావాలని వచ్చి కొద్దిగా ఎక్కువ మొత్తంలో అడ్వాన్స్ ఇవ్వడం, వారికి డబ్బు ఆశ చూపడం, వారిని నమ్మించి కిరాయికి దిగకుండానే ప్రతినెలా అద్దె ఇవ్వడం..  ఇలా సన్నిహితంగా ఉంటూ ప్లాన్​ ప్రకారం దొంగతనం చేసి ఇంట్లో ఉన్న నగదు, బంగారం, విలువైన వస్తువులు దొంగలిస్తుంటారు. ఆ సమయంలో ఎవరైనా ఎదురు తిరిగినా, అరిచినా వారిని అతి కిరాతకంగా హత్య చేస్తూ ఉంటారు. గతంలో కూడా ఏపీలో ఇలాంటి హత్యలు చేసినట్లు సమాచారం. అదుపులో ఉన్న వారి విచారణ పూర్తయిన తర్వాత, గురువారం పోలీసులు అరెస్ట్ చూపించే అవకాశం కనిపిస్తోంది.