చోరీ పేరిట అనుమానిస్తూ పోలీసుల వేధింపులు

  •     సూర్యాపేట జిల్లాలో మనస్తాపంతో బాధితుడి ఆత్మహత్యాయత్నం

హుజూర్ నగర్, వెలుగు: చోరీ పేరిట విచారణకు పిలిచి పోలీసులు వేధిస్తున్నారనే మనస్తాపంతో బాధితుడు ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటన సూర్యాపేట జిల్లాలో జరిగింది. గత నెల12న హుజూర్ నగర్ లోని రామస్వామి గుట్ట వద్ద రైతు వేదికలో జరిగిన చోరీలో హోమ్ థియేటర్, కంప్యూటర్, ఇన్వర్టర్ వంటి సుమారు రూ. లక్ష విలువైన వస్తువుల మాయం అయ్యాయి.

 కాగా.. రైతు వేదికలో పనిచేసే స్వీపర్ ఊదర పార్వతమ్మ, ఆమె కొడుకు గోపిని అనుమానిస్తూ అగ్రికల్చర్ అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. విచారణ పేరుతో తల్లి, కొడుకును ప్రతిరోజూ స్టేషన్ కు పిలుస్తున్నారు. దీంతో మనస్తాపం చెందిన గోపి శుక్రవారం ఉదయం జిల్లేడు చెట్టు కాయలను దంచుకొని తిని స్టేషన్ ఎదుట ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. అతడిని వెంటనే పోలీసులు ఏరియా ఆస్పత్రికి తరలించి చికిత్స చేయించారు. 

మెరుగైన వైద్యం కోసం సూర్యాపేట జిల్లా ఆస్పత్రికి పంపారు.  బాధితుడు గోపి, తల్లి పార్వతమ్మ మాట్లాడుతూ.. తాము చోరీ చేయలేదని చెబుతున్నా వ్యవసాయ అధికారులు ప్రణయ్, స్వర్ణ వేధించారని, పోలీసులు ఇష్టం వచ్చినట్టు కొట్టి దుర్భాషలాడారని ఆరోపించారు. చోరీ చేసినట్టు ఒప్పుకోవాలని బలవంత పెట్టారని వాపోయారు. తమను ఇబ్బంది పెట్టిన అధికారులు, పోలీసులపై చర్యలు తీసుకోవాలని బాధితులు డిమాండ్ చేశారు. వాళ్లపై ఎలాంటి వేధింపులకు పాల్పడలేదని, ఫిర్యాదు మేరకు విచారణలో భాగంగానే స్టేషన్ కు పిలిచామని ఎస్ఐ ముత్తయ్య తెలిపారు.