గణేశ్ నిమజ్జనోత్సవానికి పకడ్బందీ చర్యలు :సీపీ ఎం.శ్రీనివాస్​

  • రామగుండం సీపీ ఎం.శ్రీనివాస్​

గోదావరిఖని, వెలుగు: రామగుండం పోలీస్​ కమిషనరేట్​పరిధిలోని పెద్దపల్లి జిల్లాలో గణేశ్​ నిమజ్జనోత్సవానికి పకడ్బందీ  చర్యలు చేపట్టినట్లు పోలీస్​ కమిషనర్​ ఎం. శ్రీనివాస్​ తెలిపారు.  ఆదివారం జిల్లా పరిధిలోని గోదావరిఖనిలో గోదావరి నది బ్రిడ్జి, మంథనిలో గోదావరి నది, పెద్దపల్లిలో మినీ ట్యాంక్​బండ్​, సుల్తానాబాద్​లో చెరువు వద్ద నిమజ్జనోత్సవం జరిగే ప్రదేశాలను పెద్దపల్లి డీసీపీ చేతన, ఇతర శాఖల ఆఫీసర్లతో కలిసి పోలీస్​ కమిషనర్​ పరిశీలించారు.

ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ డ్రోన్ కెమెరా, సీసీ కెమెరాల నిఘా నిఘాలో గణేశ్ శోభాయాత్ర జరుగుతుందన్నారు.  నిమజ్జనం కోసం వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు, ప్రమాదాలు జరగకుండా పటిష్టమైన భద్రత, బందోబస్తు ఏర్పాట్లు చేసినట్టు చెప్పారు. ఏసీపీలు రాఘవేంద్ర రావు, జి.కృష్ణ, ఇన్స్​పెక్టర్లు అనిల్ కుమార్,  సుబ్బా రెడ్డి, రాజు, ఇంద్రసేనా రెడ్డి, ప్రసాద్ రావు, సింగరేణి ఎస్​ఈ వసంత్​కుమార్​, తదితరులున్నారు.