గంజాయి వేటలో పోలీసులు

  • మెట్ పల్లి బస్టాండ్ లో బాంబ్, డాగ్ స్క్వాడ్ లతో తనిఖీలు

మెట్ పల్లి, వెలుగు : మహారాష్ట్ర నుంచి జగిత్యాలకు గంజాయి సప్లై చేస్తున్నారని సమాచారంతో మెట్ పల్లి పోలీసులు గంజాయి కోసం బస్టాండ్ లో బాంబ్, డాగ్ స్క్వాడ్ లతో ఆకస్మికంగా సోదాలు చేపట్టారు. ఆదివారం డీఎస్పీ ఉమామహేశ్వరరావు ఆధ్వర్యంలో సీఐ నిరంజన్ రెడ్డి తో పాటు ఎస్సైలు బస్టాండ్ ఆవరణలో తనిఖీలు చేపట్టారు. నిజామాబాద్ ప్లాట్ ఫారం నుంచి నిర్మల్ ప్లాట్ ఫారంలలో నిల్చున్న ప్రయాణికుల వివరాలు తెలుసుకుంటూ సామాన్లు తనిఖీ చేశారు. అనుమానాస్పదంగా కనిపించిన వారి వివరాలు రాబట్టారు.

 డీఎస్పీ ఉమామహేశ్వర్ రావు మాట్లాడుతూ మహారాష్ట్ర నుంచి జగిత్యాల జిల్లాకు ఆర్టీసి బస్సులు, కార్గో ల్లో గంజాయి సప్లై చేస్తున్నారని పక్కా సమాచారం రావడంతో సోదాలు చేసినట్లు తెలిపారు. యువత గంజాయి, డ్రగ్స్ కు అలవాటుపడి భవిష్యత్తు నాశనం చేసుకోవద్దని సూచించారు. గంజాయి రవాణా, అమ్మకాలు, కొనుగోలు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. గంజాయి రహిత జిల్లాగా జగిత్యాల ను ఏర్పాటు చేయడమే పోలీసులు లక్ష్యంగా పెట్టుకునామన్నారు.

 అసాంఘిక కార్యకలాపాలు, అనుమానితులు కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని సూచించారు. ప్రతి ఒక్కరూ తమ షాపులు, ఇళ్లలో సీసీ కెమెరాలు పెట్టుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఎస్సైలు చిరంజీవి, కిరణ్ కుమార్, అనిల్, రాజు, సిబ్బంది పాల్గొన్నారు.