అస్సాంలో 2 వేల కోట్ల ట్రేడింగ్ స్కామ్ .. ఇద్దరిని అరెస్టు చేసిన పోలీసులు

  •  రెట్టింపు సొమ్మంటూ ప్రజలను బురిడీ కొట్టించిన మోసగాళ్లు

గువాహటి :  ప్రజలను నిలువు దోపిడీ చేసిన ఆన్ లైన్ స్టాక్ మార్కెట్ స్కామ్ ఒకటి అస్సాంలో బయటపడింది. తాజాగా ఆ రాష్ట్ర పోలీసులు  రూ.2.2వేల కోట్ల భారీ కుంభకోణాన్ని గుట్టు రట్టు చేశారు. ఈ కేసులో పోలీసులు ఇద్దరిని అరెస్టు చేశారు. దిబ్రూగఢ్ కు చెందిన విశాల్ ఫుకాన్ (22), గువాహటికి చెందిన స్వప్నిల్ దాస్ ను అదుపులోకి తీసుకున్నారు. స్కామ్‌‌‌‌కు సంబంధించి మరికొన్ని అరెస్టులు జరిగే అవకాశం ఉంది. విశాల్ విలాసవంతమైన జీవనశైలిని గడిపేవాడు. దానిని చూపించి ప్రజలను ఆకర్షించాడు. పెట్టుబడులపై 60 రోజుల్లోనే 30 శాతం లాభం ఇస్తామని నమ్మించాడు. నాలుగు నకిలీ కంపెనీలను స్థాపించి అస్సాం సినీ ఇండస్ట్రీలో పెట్టుబడులు పెట్టాడు. భారీగా ఆస్తులను సంపాదించాడు. ప్రజలను భారీ ఎత్తున మోసం చేశాడు.  

పలు ఫిర్యాదులు అందడంతో దిబ్రూగఢ్ లోని అతడి ఇంటిపై పోలీసులు దాడులు చేశారు. స్కామ్ కు సంబంధించిన అనేక డాక్యుమెంట్స్ ను స్వాధీనం చేసుకున్నారు. ఫుకాన్ నెట్ వర్క్ తో సంబంధమున్న అస్సామీస్ కొరియోగ్రాఫర్ సుమి బోరా కోసం పోలీసులు గాలిస్తున్నారు.