కరీంనగర్లో పూటుగా తాగేస్తున్నరు.. మోతాదుకు మించి లిక్కర్ తాగి 143 మంది కటకటాల్లోకి..

  • ఈ ఏడాది జిల్లాలో 4,692 డ్రంకెన్ డ్రైవ్ కేసులు
  • మోతాదుకు మించి లిక్కర్ తాగి 143 మంది కటకటాల్లోకి
  • నిరుటితో పోలిస్తే మూడింతలు పెరిగిన జైలుకెళ్లిన వారి సంఖ్య 
  • రూ. కోటి వరకు ఫైన్ వసూలు

కరీంనగర్, వెలుగు: కరీంనగర్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో మద్యం తాగి వెహికిల్ నడిపేవాళ్ల విషయంలో పోలీసులు కఠినంగా వ్యవహరిస్తున్నారు. పోలీసులు నిర్వహిస్తున్న బ్రీత్ ఎనలైజర్ ద్వారా డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టుల్లో రోజుకు సగటున 15 మంది చిక్కుతున్నారు. వీళ్లలో మోతాదుకు మించి పూటుగా తాగి వెహికిల్స్ నడిపినా, డ్రంకెన్ డ్రైవ్ టెస్టుల్లో రెండోసారి దొరికినా వారిని జైలుకు పంపుతున్నారు. మిగతావారికి భారీగా ఫైన్లు వేస్తున్నారు.

 మోతాదుకు మించి మద్యం తాగి నిరుడు 53 మంది జైలుకు పోతే.. ఈ ఏడాది ఏకంగా 143 మంది జైలుకు వెళ్లడం ఆందోళన కలిగిస్తోంది. ఇటీవల తాగి బైక్ లు, కార్లు, ఇతర వాహనాలు నడుపుతూ రోడ్డు ప్రమాదాలకు గురై గాయాలపాలవ్వడం, ప్రాణాలు కోల్పోవడం లాంటి ఘటనలు పెరిగిన నేపథ్యంలో పోలీసులు డ్రంకెన్‌‌‌‌‌‌‌‌ డ్రైవ్స్ ను పెంచారు. 

పెరిగిన కేసులు.. ఫైన్లు 

మద్యం తాగి వెహికిల్స్ నడపడంతో తమ ప్రాణాలకేగాక.. రోడ్డుపై వెళ్లేవారి ప్రాణాలకు కూడా ముప్పువాటిల్లుతోంది. పోలీసులు నిత్యం డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు నిర్వహించి కేసులు బుక్ చేస్తున్నా కొందరు మాత్రం ఎలాంటి భయం లేకుండా మోతాదుకు మించి తాగి వాహనాలు నడుపుతూ రోడ్డెక్కేస్తున్నారు. మత్తులో రోడ్డు వెంట వెళ్లేవారిని ఢీకొట్టడమో, లేదంటే తామే అదుపు తప్పి పల్టీకొట్టడమో చేస్తున్నారు. ఫలితంగా ఇరువైపులా ప్రాణనష్టం జరుగుతోంది. 

చాలా మంది ఆస్పత్రులపాలవుతున్నారు. దీంతో పోలీసులు డ్రంకెన్ డ్రైవ్ టెస్టులను పెంచినా చాలా మందిలో మార్పు రావడం లేదు. అందుకే గత రెండేళ్లతో పోలిస్తే ఈ ఏడాది డ్రంకెన్ డ్రైవ్ కేసుల సంఖ్యతోపాటు ఫైన్ల మొత్తం పెరిగింది. ఈ ఏడాది జనవరి నుంచి ఈ నెల 21 వరకు కరీంనగర్ కమిషనరేట్ పరిధిలో మొత్తం 4,692  డ్రంకెన్ డ్రైవ్ కేసులు నమోదు కాగా, వీరికి సుమారు రూ.కోటి జరిమానా విధించారు. అలాగే 143 మందిని జైలుకు పంపారు. నిరుడు 5,329 డ్రంకెన్ డ్రైవ్ కేసులు 
నమోదయ్యాయి. 

మోతాదుకు మించి తాగుతున్నరు.. 

కరీంనగర్ కమిషనరేట్ పరిధిలో మోతాదుకు మించి తాగుతున్న వారి సంఖ్య పెరిగింది. ఆయా పోలీస్ స్టేషన్ల పరిధిలో మద్యం మత్తులో వాహనం నడుపుతున్న వారిని బ్రీత్ ఎనలైజర్ ద్వారా టెస్ట్ చేస్తున్నారు. అందులో వచ్చే పర్సంటేజీని ప్రింట్ పేపర్ తో జోడించి మోటార్ వెహికిల్ యాక్ట్ లోని సెక్షన్ 185 ద్వారా కేసు నమోదు చేసి కోర్టుకు అప్పగిస్తున్నారు. అనంతరం బ్రీత్ ఎనలైజర్ లో వచ్చిన పర్సంటేజీని బట్టి జడ్జి ఫైన్ లేదా లేదా జైలు శిక్ష విధిస్తున్నారు. లిక్కర్ పర్సంటేజీ 200 దాటితే మోతాదుకు మించి తాగినట్లు లెక్క. ఇలాంటి వారికి ఒక రోజు నుంచి 5 రోజులపాటు జైలు శిక్ష విధిస్తున్నారు.