పాత కక్షలా.. రాజకీయ హత్యనా ? : గంగారెడ్డి హత్యపై పోలీసుల ఫుల్ ఎంక్వైరీ

జగిత్యాల, వెలుగు : ఎమ్మెల్సీ జీవన్‌‌‌‌రెడ్డి అనుచరుడు గంగారెడ్డి హత్య కేసుపై పోలీసులు పూర్తిస్థాయిలో విచారణ జరుపుతున్నారు. ఇందులో భాగంగా జగిత్యాల రూరల్‌‌‌‌ మండలం జాబితాపూర్‌‌‌‌లో హత్య జరిగిన స్థలాన్ని డీఎస్పీ రఘు చందర్, పోలీస్‌‌‌‌ ఆఫీసర్లు పరిశీలించి ఎంక్వైరీ చేశారు. గంగారెడ్డి హత్యకు కారణం పాత కక్షలా ? రాజకీయ కక్షలా ? మరే ఇతర కారణాలు ఏమైనా ఉన్నాయా అనే కోణంలో విచారణ చేస్తున్నారు. గంగారెడ్డి ఎమ్మెల్సీ జీవన్‌‌‌‌రెడ్డి ముఖ్య అనుచరుడు కాగా, నిందితుడు సంతోష్‌‌‌‌ బీఆర్‌‌‌‌ఎస్‌‌‌‌ కార్యకర్త కావడంతో ఇది రాజకీయ హత్యేననే ఆరోపణలు వినిపిస్తున్నాయి. 

హత్య విషయం తెలిసిన తర్వాత ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ధర్నాకు దిగి ఫిరాయింపుదారుల కుట్ర అని ఆరోపణలు చేశారు. టీపీసీసీ ఛీప్‌‌‌‌ మహేశ్‌‌‌‌గౌడ్‌‌‌‌ సైతం స్పందించి హత్య వెనుక ఉన్న కుట్రదారులపై చర్యలు తీసుకోవాలని పోలీసులకు సూచించినట్లు చెప్పారు. తన తండ్రి రాజకీయంగా ఎదుగుతుండడాన్ని చూడలేకే హత్య చేశారని, దీని వెనుక ఎవరు ఉన్నారో బయటపెట్టాలని గంగారెడ్డి కూతురు శరణ్య డిమాండ్ చేశారు. 

బీఆర్‌‌‌‌ఎస్‌‌‌‌కు రిజైన్‌‌‌‌ చేయలేదు... కాంగ్రెస్‌‌‌‌ సభ్యత్వం తీసుకోలేదు

పార్టీ ఫిరాయింపుదారుల కుట్ర వల్లే గంగారెడ్డి హత్య జరిగిందని ఎమ్మెల్సీ జీవన్‌‌‌‌రెడ్డి ఆరోపించడంపై ఎమ్మెల్యే సంజయ్‌‌‌‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. జీవన్‌‌‌‌రెడ్డి కూడా టీడీపీ నుంచి కాంగ్రెస్‌‌‌‌లో చేరారని గుర్తు చేశారు. తమ కుటుంబం జీవన్‌‌‌‌రెడ్డి కన్నా ముందు నుంచే కాంగ్రెస్‌‌‌‌లో ఉందని చెప్పారు. జగిత్యాల అభివృద్ధికి తాను సీఎం రేవంత్‌‌‌‌రెడ్డితో కలిసి పనిచేస్తున్నానని, ఎట్టి పరిస్థితుల్లో హత్యా రాజకీయాలు ప్రోత్సహించనని స్పష్టం చేశారు. తాను ఇప్పటికీ బీఆర్‌‌‌‌ఎస్‌‌‌‌కు రాజీనామా చేయలేదని, కాంగ్రెస్‌‌‌‌ సభ్యత్వం కూడా తీసుకోలేదని ఎమ్మెల్యే అనడం చర్చకు దారి తీసింది.