ఖమ్మంలో విజృంభిస్తున్న విష జ్వరాలు .. దోమలే కారణమా ?

  • హైదరాబాద్​ తర్వాత డెంగ్యూ కేసులు ఖమ్మంలోనే ఎక్కువ
  •  ఇప్పటికే 397 కేసుల నమోదు.. రెండేండ్ల కింద కూడా ఇదే పరిస్థితి 

ఖమ్మం, వెలుగు: ఖమ్మం జిల్లాలో ఖాళీ స్థలాలు, ఓపెన్​ ప్లాట్లలో నీరు నిల్చి దోమలకు స్థావరాలుగా మారుతున్నాయి. ఫలితంగా డెంగ్యూ, ఇతర వైరల్ ఫీవర్స్ ​వేగంగా వ్యాప్తి చెందుతున్నాయి. ఈ ఏడాది రాష్ట్రంలోనే జీహెచ్​ఎంసీ తర్వాత అత్యధిక డెంగ్యూ కేసులు ఖమ్మం జిల్లాలోనే నమోదయ్యాయి. జనవరి నుంచి ఈనెల మొదటి వారం వరకు రాష్ట్రంలో మొత్తం 2,847 డెంగ్యూ కేసులు నమోదు కాగా, ఇందులో హైదరాబాద్​ లో 1,101 కేసులు నమోదయ్యాయి. 

ఆ తర్వాత ఆఫీసర్లు చెబుతున్న అధికారిక లెక్కల ప్రకారమే ఖమ్మం జిల్లాలో 12,165 మందికి డెంగ్యూ పరీక్షలు నిర్వహించగా 297 కేసులు పాజిటివ్​ గా నమోదయ్యాయి. ఇక జిల్లాలో ఇప్పటి వరకు 75 వేల మంది వైరల్ ఫీవర్ల బారిన పడ్డారు. ఇక ప్రైవేట్ ఆస్పత్రుల్లో, ఆర్​ఎంపీల దగ్గర చికిత్స పొందిన వారిని కూడా లెక్కల్లోకి తీసుకుంటే ఇంతకు రెట్టింపు సంఖ్యలో విష జ్వరాలు వచ్చి ఉండొచ్చన్న అంచనాలున్నాయి. 

దోమలను అరికడితేనే జ్వరాలకు చెక్​

గ్రామాలకు గ్రామాలే విషజ్వరాల బాధితులుగా మారుతుండడంతో, జిల్లాను హైరిస్క్​ జోన్​ గా ప్రకటించి వైద్య చికిత్స అందిస్తున్నారు. గ్రామాల్లో ప్రత్యేక వైద్య శిబిరాలు ఏర్పాటు చేస్తున్నా, అసలు విషజ్వరాలకు మూలకారణంగా మారుతున్న దోమలను అరికడితే తప్ప వైరల్​ ఫీవర్లకు చెక్​ పెట్టే పరిస్థితి కనిపించడం లేదు. జిల్లాలో రెండేండ్ల కింద కూడా ఇదే పరిస్థితి ఉన్నది. గ్రామాల్లో, పట్టణాల్లో మురుగు లేకుండా చేయకపోవడం, తరచుగా ఫాగింగ్ చేయకపోవడం, బ్లీచింగ్ కూడా చల్లకపోవడం, సర్పంచ్​ ల పాలన ముగిసిపోవడం, స్పెషలాఫీసర్లుగా బాధ్యతలు అప్పగించిన వారు ఇతర రెగ్యులర్​ డ్యూటీల్లో బిజీగా ఉండడం లాంటి పలు కారణాలతో దోమల వ్యాప్తిని పట్టించుకోవడం లేదు. 

ఫ్రై డే.. డ్రై డే లాంటి కార్యక్రమాలపై ప్రచారం చేస్తూ, ప్రజల్లో అవగాహన కల్పిస్తున్నామని అధికారులు చెబుతున్నారు తప్ప ఆచరణలో మాత్రం కనిపించడం లేదు. నాలుగైదు రోజుల నుంచి జిల్లాలో వర్షాలకు విరామం వచ్చినా, అంతకు ముందు కురిసిన వాననీళ్లే ఇప్పటికీ నిలిచి ఉన్నాయి. ఆఫీసర్ల నోటీసులకు ప్లాట్ల యజమానుల నుంచి పెద్దగా స్పందన లేకపోవడంతో సిబ్బంది కూడా దిక్కుతోచని స్థితిలో పడ్డారు. వెంటనే తగిన చర్యలు తీసుకోకపోతే పరిస్థితి మరింత ప్రమాదకరంగా మారే అవకాశం ఉందని పలువురు హెచ్చరిస్తున్నారు. 

హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించాలి

ఖమ్మం జిల్లాలో హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించాలి. ప్రభుత్వ ఆస్పత్రుల్లో అదనపు వైద్య సిబ్బందిని ఏర్పాటు చేసి, మందుల కొరత లేకుండా చూడాలి. గ్రామాల్లో, పట్టణాల్లో పారిశుధ్య సమస్య లేకుండా చూడాలి. దోమలు పెరగకుండా ఫాగింగ్, ఇతర చర్యలు తీసుకోవాలి. ఖమ్మం కార్పొరేషన్లో 500 మంది అదనపు పారిశుధ్య కార్మికులను నియమించాలి. చాలా పంచాయతీల్లో మూడు నెలల నుంచి శానిటరీ వర్కర్లకు వేతనాలు ఇవ్వడం లేదు. 
– నున్నా నాగేశ్వరరావు, సీపీఎం జిల్లా కార్యదర్శి