పంచాయతీల్లో పడకేసిన పారిశుధ్యం!

  • బ్లీచింగ్ లేదు.. ఫాగింగ్ చేయట్లే..  
  • నిధులు లేవంటున్న స్పెషలాఫీసర్లు 
  • పల్లెటూర్లలో పర్యటించని అధికారులు 
  • విష జ్వరాల బారిన పడుతున్న జనాలు 

ఖమ్మం/పెనుబల్లి, వెలుగు :  ఖమ్మం జిల్లాలోని పట్టణాల్లో, పల్లెల్లో పారిశుధ్యం పనులు సరిగా జరగడం లేదు. ఫలితరంగా విష జ్వరాలు విజృంభిస్తున్నాయి. ఇంటికీ ఇద్దరు జ్వర బాధితులు ఉంటున్నారు. అధికారులు చెబుతున్న ప్రకారం..  ఈ సీజన్​ లో ఇప్పటికే 80 వేల మంది జ్వరాల బారిన పడగా, 13 వేల మంది శాంపిల్స్​ ను డెంగ్యూ నిర్ధారణ పరీక్షల కోసం పంపించారు. ఇందులో నాలుగు కేసులు డెంగ్యూ పాజిటివ్ గా తేలాయి. 

‘స్పెషల్’ ఫోకస్​ పెట్టట్లే.. ​

స్థానిక సంస్థల్లో ప్రజా ప్రతినిధుల పాలన ముగిసిన తర్వాత స్పెషలాఫీసర్లకు పాలన పగ్గాలు అప్పగించడంతో పరిస్థితి మరింత దారుణంగా మారింది.  సర్పంచులు, ఎంపీటీసీలు, జడ్పీటీసీల కాల పరిమితి ముగియడంతో మండల స్థాయి అధికారులను గ్రామాలకు, జిల్లా స్థాయి ఆఫీసర్లకు మండలాలకు స్పెషల్ ఆఫీసర్లుగా ప్రభుత్వం బాధ్యతలు అప్పగించింది. పేరుకు ఆఫీసర్లు బాధ్యతలు తీసుకున్నారు తప్ప గ్రామాల్లో సమస్యలను పట్టించుకోవడం లేదన్న విమర్శలున్నాయి. ఫాగింగ్ చేయకపోవడం, బ్లీచింగ్ పౌడర్ చల్లించకపోవడం, వాన నీరు నిల్వ ఉండకుండా చర్యలు తీసుకోకపోవడంతో విష జ్వరాలు వేగంగా వ్యాపిస్తున్నాయి. 

కొంతమంది స్పెషలాఫీసర్లు ఫోన్​ ద్వారా పంచాయతీ సెక్రటరీలనే గ్రామాల్లో సమస్యల సంగతి చూసుకోవాలని చెబుతున్నారు. ఏదైనా అత్యవసరం అయితే తమకు కాల్ చేయాలని సూచిస్తున్నారు. బడ్జెట్ ఉన్నా.. లేకున్నా గతంలో సర్పంచులు ముందుగా బ్లీచింగ్ పౌడర్​ లాంటి వాటిని కొని తెచ్చి బిల్లులు పెట్టుకునేవారు. ఇప్పుడు ఆఫీసర్లు అందుకు చొరవ చూపించకపోవడం, బడ్జెట్ లేదని చెబుతుండడంతో పారిశుధ్య సమస్యలు పెరుగుతున్నాయి. 

ఎక్కడ చూసినా చెత్తా చెదారం..

జిల్లాలోని పలు పంచాయతీలు ఎక్కడికక్కడ చెత్తాచెదారంతో దర్శనమిస్తున్నాయి. ఇళ్ల మధ్యలో మురుగు గుంతలు, ఖాళీ ప్రదేశాల్లో అడవిని తలపించే గుబురు చెట్లు కనిపిస్తున్నాయి. వీటిని పంచాయతీ ప్రత్యేక అధికారులు పట్టించుకోవడం లేదు. వర్షాకాలంలో సీజనల్ వ్యాధుల బారిన పడకుండా దోమల నివారణ చేయాల్సి ఉంది. స్పెషల్ ఆఫీసర్ పాలనలో ఒక్కసారి కూడా ఫాగింగ్ చెయ్యలేదని జ్వరపీడితులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 

ఇంటికీ ఇద్దరు ముగ్గురికి పైగా జ్వరంతోపాటు ఒళ్ళు నొప్పులు, ఒంటిపై దద్దుర్లు, కీళ్లనొప్పులతో ఇబ్బందులు పడుతున్నా అధికారులు కనీసం పారిశుధ్యంపై దృష్టిపెట్టడం లేదని వాపోతున్నారు. పంచాయతీ కార్యదర్శులకు ప్రతినెలా జీతం వస్తున్నా పారిశుధ్య కార్మికులకు మాత్రం రెగ్యులర్​ గా సాలరీ రావడం లేదని, దీంతో బ్లీచింగ్ పౌడర్​ చల్లేందుకు, చెత్త సేకరణకు వారు లైట్ తీసుకుంటున్నారని చెబుతున్నారు. పంచాయతీల్లో ఫండ్స్ రాక 18 నెలలు అవుతుందని పంచాయతీ కార్యదర్శులు చెబుతున్నారు.

ఒక్కో బెడ్​కు ఇద్దరు పేషెంట్లు 

మండల ఆస్పత్రుల్లో ఒక్కో బెడ్ ను ఇద్దరు రోగులు పంచుకోవాల్సిన పరిస్థితి ఉంది. బెడ్ లు సరిపోక హాస్పిటల్ ప్రాంగణం లోని బెంచ్ ల పైనే పడుకుని సెలైన్లు ఎక్కించుకుంటున్నారు.  చిన్న పిల్లల వార్డులను సైతం రోగులకు కేటాయించే పరిస్థితి నెలకొంది. ఇప్పటికైనా ఉన్నతాధికారులు సమస్యలపై ప్రత్యేక దృష్టి పెట్టి వ్యాధుల విజృంభనకు అడ్డుకట్టవేయాలని  పలువురు కోరుతున్నారు.