మొసలి కన్నీరును నమ్ముకున్న బీఆర్​ఎస్

మొన్నటిదాకా అధికారం అనుభవించి, ఇపుడు ప్రతిపక్షంగా మారిన పార్టీ తీరు చూస్తుంటే   మేధావులను, పౌరులను తీవ్ర ఆలోచనలలో పడవేసే ముఖ్యాంశాలు ఉన్నాయి.  బీఆర్​ఎస్ పార్టీలోని వెనుకబడిన వర్గాల నాయకులను తమిళనాడులో బీసీ ఉద్యమం అధ్యయనం చేయడానికి పంపడం.  దేశంలో ముఖ్యంగా ప్రభుత్వాలు ప్రతి పథకం వెనుక,  వేసే ప్రతి అడుగు వెనుక,  చేసే ప్రతి ఆలోచన వెనుక ఓట్ల దిగుబడి  ఎంత ఉంటుందనే ఆలోచన ఒకటి ప్రభావితం చేస్తూ ఉంటుంది. 

ఇటువంటి వాతావరణంలో తెలంగాణ ప్రభుత్వం  ఓట్ల  ప్రయోజనం ఆశించకుండా కేవలం హైదరాబాద్ మహా నగరం క్షేమాన్ని కాంక్షించి హైడ్రా కార్యక్రమాన్ని తీసుకోవడం ఒక విధంగా డేరింగ్ అండ్ డాషింగ్ నిర్ణయం అని చెప్పవచ్చును. నగర వరదలకు కారణమైన అక్రమార్కులపై హైడ్రా ఝుళిపించిన కొరడాకు చెరువులు కుంటలు, నాలాలను ఆక్రమించిన అక్రమార్కుల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. 

అక్కడక్కడా రియల్టర్ల  అంతూ పొంతులేని ధన దాహంకాగా అవినీతి అధికారుల పని తీరుపై అనేక అనుమానాలు తలెత్తుతున్నాయి. ఇంకో దిక్కు నిర్లజ్జ నిర్వాకాల వలన జరిగిన పూడ్చలేని అవకతవకలతో, అక్రమణలతో ప్రమేయం లేని అభం శుభం తెలియని కొందరు సామాన్యుల ఆక్రందనలు వినిపిస్తున్నాయి. 

బీసీల పథకాలపై బీఆర్​ఎస్​ అధ్యయనమా?

బీఆర్ఎస్ పార్టీ తమిళనాడులో ప్రభుత్వం అమలు పరుస్తున్న వెనుకబడిన వర్గాల పథకాల అధ్యయనానికి తన వెనుకబడిన వర్గాల శాసన సభ్యులను పంపించింది. ఈ తురుపుముక్క ఆలోచన గత పది సంవత్సరాల కాలంలో బీసీలను పూర్తిగా పూచిక పుల్లల్లా భావించిన రాజకీయ పార్టీ.. కలలో ఊహించని  బీఆర్ఎస్ పార్టీకి, దాని నాయకులకు ఇప్పుడు ఎందుకు వచ్చిందో  కాని ఇది తెలంగాణ రాజకీయ రంగంలో ఒకింత ఆశ్చర్యాన్ని కలిగిస్తున్నది! ఆ పార్టీ వెనుక ఉన్న వ్యూహరచన వల్ల పెద్దగా రాజకీయ ప్రయోజనం చేకూరదు. ఎందుకంటే సంబంధిత వర్గాల పట్ల వీరు అనుసరించిన విధి విధానాలను చూస్తే అర్థమవుతుంది.

 దీనికి మంచి ఉదాహరణ  వీరు 2014లో ప్రభుత్వంలోకి రాగానే  జిల్లా పరిషత్ చైర్మన్​లతో కూడిన ఒక బృందాన్ని కేరళ రాష్ట్రంలో స్థానిక సంస్థల నిధుల అమలు, విధుల గురించి అధ్యయనానికి పంపారు. వారు పోయి వచ్చి ఒక నివేదికను ప్రభుత్వానికి అందజేశారు. అప్పటి మున్సిపల్ శాఖ మంత్రి ఇప్పటి బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఈ నివేదికను చూసి అక్కడిలాగ స్థానిక సంస్థల బలోపేతం చేయడం కుదరదని పక్కన పడేయడమే కాకుండా, ఆ బృందానికి సారథ్యం వహించిన జడ్పీ చైర్మన్ సంబంధిత మంత్రిని షాడో ముఖ్యమంత్రిని అడిగితే అది వీలు కాదని కరాకండిగా చెప్పారు. 

ఇక ఇప్పుడు ఏదో  బీసీలను  నమ్మించడానికి బృందాన్ని తమిళనాడుకి పంపడంలో  ప్రాసంగికత ఎంత మాత్రం ఉంటుందో బీఆర్ఎస్ పార్టీ అగ్రనాయకత్వానికి తెలియాలి . బీసీలకు ఆ పార్టీలో ఎలాంటి స్థానం కల్పించిందో లేదో అందరికీ తెలిసినదే. గత ప్రభుత్వం తన పాలనలో బీసీల భాగస్వామ్యం పైన  సమీక్షించుకుంటే మరొకసారి వారి వైఖరి పూర్తిగా  అర్థమవుతుంది.

ప్రజలు వీఆర్​ఎస్​ ఇచ్చినా..

ప్రజలు  వీఆర్​ఎస్ ఇచ్చినప్పటికీ బీఆర్ఎస్ పార్టీ నాయకులు ప్రతి విషయం పట్ల అధికార పార్టీ పైన ఆసహనాన్ని వెళ్లగక్కుతున్నారు. ఒడ్డున నిలబడి ఓ కంట నీటిలోని చేపలను  గుటుక్కున మింగడానికి కొంగ జపతపాలు చేస్తూ ఉన్నారు.  వీరి కాలంలో ప్రాజెక్టుల కింద నిర్వాసితులైన గ్రామాల ప్రజల గుండె గాయాలను గాలికి వదిలేసిన విషయం మరిచిపోయారు. ఇప్పుడు కోతికి కొబ్బరికాయ దొరికినట్టు.. హైడ్రా బాధితుల పట్ల మొసలి కన్నీరు కారుస్తున్నారు. హైడ్రా చెరువులు,
కుంటల ఆక్రమణ స్థలాల్లో నిర్మాణాలపై తన పార్టీ నిర్ణయం స్పష్టంగా ఇప్పటికీ చెప్పనేలేదు. ఒక్క రాష్ట్ర బీజేపీ మాత్రం  హైడ్రాకు తన మద్దతు తెలిపింది. ఒకవేళ ఈ పథకం భవిష్యత్తులో నగరానికి, తెలంగాణకు మంచి  చేస్తది అనుకుంటే విపక్షంగా సహేతుకమైన సలహాలు నిర్మాణాత్మకమైన సూచనలు బీఆర్ఎస్ నాయకత్వం చేస్తే బాగుండేది. ఒకవేళ  వ్యతిరేకిస్తే ఆ విషయాన్ని తెలంగాణ ప్రజలకు తెలియజేయాలి. అలా  చేయకుండా సిరప్ వ్యతిరేకతను   సొమ్ము చేసుకుందామని చూడడమంటే శవం మీది పేలాలు ఏరుకుని బుక్కడం లాంటిదే అని వీరు గ్రహించాలి.

గోతికాడి నక్కలా..

అధికార పార్టీ చేస్తున్న మంచి కార్యక్రమాలను మరిచి ప్రతిపక్ష పార్టీలు ప్రజలలో ప్రభుత్వాన్ని బద్నామ్ చేయడానికి ఎప్పుడూ గోతికాడి నక్కలా అవకాశం కోసం ఎదురు చూస్తుంటాయి. ఇప్పుడు అదే పరిస్థితి భాగ్యనగరంలో చాపకింది నీరులా  మెల్లగా నెలకొంటున్నది.  

ప్రజాస్వామ్యంలో ప్రజలకు స్వేచ్ఛా వాయువులు మాత్రమే కాకుండా ప్రజల అభిప్రాయాలకు తావు ఉండాలి. ప్రస్తుత పరిస్థితులలో ప్రభుత్వం హై పవర్ కమిటీని వేయడమే కాకుండా  వ్యతిరేక నష్ట నివారణ చర్యలు అత్యవసరంగా తీసుకోవాల్సిన వాతావరణం ఏర్పడినది. ప్రతిపక్షాలకు తోడు రియల్ ఎస్టేటర్లు ఆయా భూములను ఆక్రమించి నిర్మించి సామాన్యులకు విక్రయించినవారు మీడియాను పరోక్షంగా ప్రభావితం చేసేవారందరూ ఒక్క తాటి మీదికి రాకముందే ప్రభుత్వం ఆ దిశగా సంయమనంతో సత్వరం హైడ్రా పట్ల తగు నిర్ణయం తీసుకోవాలి. 

- జూకంటి జగన్నాథం..కవి, రచయిత-