సాగునీటి బోర్ల కోసం పోడు రైతుల నిరీక్షణ

  • ఐటీడీఏకు 6,796  మంది దరఖాస్తులు 
  • పర్మిషన్లకు ఫారెస్ట్​ ఆఫీసర్ల అభ్యంతరాలు

భద్రాచలం, వెలుగు :  ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పట్టాలు పొందిన పోడు రైతులు సాగునీటి బోర్ల కోసం ఐటీడీఏను ఆశ్రయించారు. ఈ విషయమై ఏడాది నుంచి పలువురు అర్జీలు పెట్టుకోగా ఇప్పటి వరకు 6,796 మంది  రైతులు అయ్యారు. డిస్ట్రిక్ట్ లెవల్​ కమిటీ(డీఎల్​ఎస్​) నుంచి సిఫార్స్ కూడా చేశారు. కానీ ఫారెస్ట్ డిపార్ట్​మెంట్​ నుంచి వచ్చే పర్మిషన్​ కోసం నిరీక్షిస్తున్నారు. 

హెక్టార్​ వరకు ఫారెస్ట్ డిపార్ట్​మెంట్​ పరిధిలో..

ఒక హెక్టార్​ భూమిలో బోర్ వేసుకునేందుకు లోకల్ ఫారెస్ట్ డిపార్ట్​మెంట్​ పరిధిలో పర్మిషన్లు ఇచ్చే అవకాశం ఉంది. హెక్టార్​ దాటితే మాత్రం సెంట్రల్ ఫారెస్ట్ డిపార్ట్​మెంట్​ఆఫీసర్ల నుంచి పర్మిషన్​ తీసుకోవాల్సి ఉంటుంది. అందుకే ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని 6,796 మంది ఆదివాసీ పోడు రైతుల నుంచి హెక్టార్​ భూమి వరకే వచ్చిన అర్జీలను డిస్ట్రిక్ట్ లెవల్​కమిటీ సిఫార్స్ చేసింది. 

ముందుగా ఐటీడీఏ సిఫార్స్ తర్వాత టీజీఎన్​పీడీసీకి రైతుల భూమి వరకు విద్యుత్​లైన్​ ఏర్పాటుకు లిస్టు పంపించారు. ఫాం–ఎ పూర్తి చేసి ఫారెస్ట్ డిపార్ట్​మెంట్​కు పంపించారు. భద్రాద్రికొత్తగూడెం జిల్లా నుంచి ఆరు దశల్లో 4,909 అప్లికేషన్లు, ఖమ్మం జిల్లా నుంచి నాలుగు దశల్లో 1,887 అప్లికేషన్లు పంపగా ఫారెస్ట్ ఆఫీసర్ల వద్ద పర్మిషన్​ కోసం వెయిటింగ్​లో ఉన్నాయి. 

అభ్యంతరాలకు కారణాలు ఇవే..

పోడు భూముల్లో విద్యుత్​మోటార్లు ఏర్పాటుకు పర్మిషన్​ ఇవ్వడానికి ఫారెస్ట్ డిపార్ట్​మెంట్​పలు అభ్యంతరాలు తెలుపుతోంది. అటవీ ప్రాంతాల్లో విద్యుత్​తో వన్యప్రాణుల వేట ఏళ్ల తరబడి కొనసాగుతోంది. అడవి జంతువులతో పాటు కొన్ని చోట్ల అటవీ ఉత్పత్తుల సేకరణకు వెళ్లిన ఆదివాసీలు ప్రాణాలు కోల్పోతున్న పరిస్థితి ఉంటుంది. పంటలను కాపాడుకోవడానికి విద్యుత్​ కంచెలు కట్టుకునే వీలుంటుంది. ఇది కూడా వన్యప్రాణులకు ముప్పేనని ఫారెస్ట్​ డిపార్ట్​మెంట్​ అబ్జెక్షన్​ చేస్తోంది. 

జాయింట్​ సర్వేతో పరిష్కారం

పోడు భూములకు విద్యుత్​ లైన్​ ఏర్పాటు కోసం ట్రాన్స్ కో, ఫారెస్ట్ డిపార్ట్​మెంట్లు జాయింట్​ సర్వేతోనే సమస్యకు పరిష్కారం లభిస్తుంది. ఫీల్డ్​ లెవల్​లోనే  రైతుల సమక్షంలో జాయింట్ సర్వే చేస్తే ఎవరికీ ఇబ్బందులు ఉండవు. ఆదివాసీ రైతులకు మోటార్లు ఇవ్వడానికి పలు ఎన్జీవోలు ముందుకొస్తున్నాయి. సబ్సిడీ ద్వారా ట్రాన్స్ కో కూడా సపోర్టు చేస్తోంది. 

ALSO READ : 9వ ప్యాకేజీ పనుల్లో కదలిక

అవగాహన కల్పిస్తాం

పోడు భూముల్లో సాగు చేస్తున్న రైతుల నుంచి బోర్ల కోసం అప్లికేషన్లు ఎక్కువగా వస్తున్నాయి. కరెంటు ఆఫీసులకు వచ్చే అర్జీలను పరిశీలించి ఫారెస్ట్ ఆఫీసర్ల నుంచి పర్మిషన్​ ముందుగానే తీసుకుంటాం. రైతులకు అవగాహన కూడా కల్పిస్తాం. పర్యావరణంతో పాటు, వన్యప్రాణుల సంరక్షణ కూడా అందరి బాధ్యత. నిబంధనలను వారికి వివరిస్తాం. ఎవరైనా రూల్స్​ అతిక్రమించి విద్యుత్​ కంచెలు ఏర్పాటు చేస్తే వారి పోడు పట్టాలను రద్దు చేస్తామని హెచ్చరిస్తాం. రైతులు తమ భూముల్లో పత్తి, మిరప సాగు చేస్తున్నారు. వర్షాలపైనే ఆధారపడటం వల్ల అనేక ఇబ్బందులు పడుతున్నారు. దీన్ని దృష్టిలో ఉంచుకునే ఫారెస్ట్ డిపార్ట్​మెంట్​ ద్వారా రైతులకు పర్మిషన్లు ఇప్పించేందుకు కృషి చేస్తున్నాం.- రాహుల్, ఐటీడీఏ పీవో 

ఆదుకోపోతే ఆగమైతరు

పోడు రైతులను ఆదుకోపోతే పెట్టుబడుల రాక ఆగమైతరు. వర్షాలపై ఆధారపడి పంటలన్నీ ఎండబెట్టుకుంటున్నరు. చర్ల మండలం పరిధిలో చాలా మంది బోర్ల కోసం ఎదురు చూస్తున్నరు. ఐటీడీఏనే ఆదివాసీ రైతులకు దిక్కు. లేకపోతే పోడు భూములకు పట్టాలిచ్చిన లక్ష్యం కూడా నీరుగారి పోతుంది.- కారం పుల్లయ్య,తెలంగాణ ఆదివాసీ సంఘం జిల్లా కార్యదర్శి