పోచారం వైల్డ్​ లైఫ్​ శాంక్చురీ

ఒకప్పటి నిజాం రాజు షికార్ ఘర్‌‌‌‌... ఇప్పటి టూరిస్ట్ స్పాట్‌‌. ఇక్కడ కృష్ణ జింకల గుంపులతోపాటు నీల్‌‌‌‌గాయ్‌‌‌‌, సాంబార్‌‌‌‌, నెమళ్లు, కొండగొర్రెలు, ముళ్లపందులు, కుందేళ్లను చూడొచ్చు. వీకెండ్స్‌‌లో పిల్లలతో కాసేపు హాయిగా గడపాలి అనుకునేవాళ్లకు పోచారం వైల్డ్ లైఫ్ శాంక్చురీ కేరాఫ్​ అడ్రస్​. 

ఉదయం నుంచి రాత్రి వరకు పని ఒత్తిడితో సతమతమయ్యే వాళ్లకు మానసిక ప్రశాంతత ఇచ్చే ప్రదేశం పోచారం వైల్డ్ లైఫ్ శాంక్చురీ. ఇది మెదక్‌‌‌‌, కామారెడ్డి జిల్లాల సరిహద్దు ప్రాంతంలో ఉంది. నిజాం కాలంలో ‘షికార్‌‌‌‌ ఘర్‌‌’గా పేరొందిన ఈ ప్రాంతం ఇప్పుడు ఫేమస్‌‌ పిక్నిక్​ స్పాట్‌‌.  పోచారం శాంక్చురీలో రెండు ‘డీర్‌‌‌‌ బ్రీడ్‌‌‌‌ సెంటర్’లు ఉన్నాయి. ఇక్కడ కొన్ని వందల కృష్ణ జింకలు ఉన్నాయి.

 అభయారణ్యంలో అవి గుంపులు గుంపులుగా సంచరిస్తుంటాయి. వీటితోపాటు నీల్‌‌‌‌గాయ్‌‌‌‌, సాంబార్‌‌‌‌, నెమళ్లు, కొండగొర్రెలు, ముళ్లపందులు, కుందేళ్లు వంటి వన్యప్రాణులు కూడా కనిపిస్తాయి. శాంక్చురీ లోపల వెహికల్​లో తిరగొచ్చు. అభయారణ్యం అందాలను చూసేందుకు రెండు వాచ్‌‌‌‌టవర్లు ఉన్నాయి. శాంక్చురీ ఎంట్రన్స్​లో విజిటర్స్​ కాసేపు రెస్ట్​ తీసుకునేందుకు పార్కు ఉంది. ఆకర్షణీయంగా ఉండే రకరకాల పచ్చని చెట్లతో పాటు, ఔషధ గుణాలున్న మొక్కలు ఉన్నాయి. ఇక్కడ కూర్చునేందుకు వీలుగా బెంచీలు, భోజనాలు చేసేందుకు షెడ్డు, మంచినీళ్లు ఉన్నాయి. పార్కు దగ్గర్లో అటవీశాఖ వాళ్లు 50 లక్షల రూపాయలతో  పర్యావరణ విజ్ఞాన కేంద్రం నిర్మించారు. ఇందులోకి వెళ్తే వన్యప్రాణుల జీవన విధానం గురించి అవగాహన కలుగుతుంది. 

ఆదివారాలు, సెలవు రోజుల్లో మెదక్‌‌‌‌, కామారెడ్డి జిల్లాల నుంచి ఫ్యామిలీస్​తో ఇక్కడికి వస్తారు. హైదరాబాద్‌‌ నుంచి వచ్చేవాళ్లలో ఎక్కువగా సాఫ్ట్​వేర్‌‌‌‌ ఉద్యోగులు, ఇంజనీరింగ్‌‌‌‌, మెడికల్‌‌‌‌ కాలేజీ స్టూడెంట్స్​ ఉంటారు. రాష్ట్రంలోని వివిధ జిల్లాల నుంచి స్కూల్స్​, కాలేజీ స్టూడెంట్స్‌‌ విజ్ఞాన యాత్రలో భాగంగా పోచారం శాంక్చురీకి వస్తారు. 

అడవిలో అర్బన్​ పార్క్

ఆకర్షణీయమైన ఎంట్రన్స్​లు, ఆకట్టుకునే గజిబోలు,  ఎత్తయిన వాచ్ టవర్లతో ప్రకృతి ప్రేమికులను ఆకట్టుకుంటోంది మెదక్​ జిల్లా నర్సాపూర్​ అర్బన్​ ఫారెస్ట్​. హైద్రాబాద్​ – మెదక్ నేషనల్ హైవేను ఆనుకొని ఉన్న నర్సాపూర్ ఫారెస్ట్‌‌లో 20 కోట్ల రూపాయల వ్యయంతో 2,765 హెక్టార్ల విస్తీర్ణంలో అర్బన్ పార్క్‌‌ డెవలప్ చేశారు. అడవి చుట్టూ ఏడు కిలోమీటర్ల మేర ఫెన్సింగ్ వేశారు. 

అర్బన్‌‌ ‌‌పార్క్‌‌‌‌లోకి వెళ్లేందుకు రెండు మెయిన్‌ గేట్లు ఉన్నాయి. అ‌‌డవి అందాలను చూడటం కోసం 60 ఫీట్ల ఎత్తులో రెండు వాచ్‌‌ ‌‌టవర్లు కట్టారు. విజిటర్స్​ కాసేపు రెస్ట్​ తీసుకునేందుకు ఒక గజిబో ఏర్పాటు చేశారు. కలపలా కనిపించే కాంక్రీట్‌‌‌‌ నిర్మాణాలు ఉన్నాయి ఇక్కడ. విజిటర్స్​ కూర్చునేందుకు ఎత్తయిన బండమీద సిమెంట్‌‌‌‌ బెంచీలు, నీరు పారే ప్రాంతాల్లో బ్రిడ్జిలు కట్టారు. అర్బన్ పార్క్​ను నడిచి చూసేందుకు వీలుగా మట్టి రోడ్లు వేశారు. సైక్లింగ్‌‌‌‌ కూడా చేయొచ్చు. ఆదివారాలు, ఇతర సెలవు రోజుల్లో ఎక్కువమంది విజిటర్స్​ హైదరాబాద్​ నుంచే వస్తారు ఇక్కడికి.

తిమ్మన్నగారి శ్రీధర్‌‌, మెదక్‌