మోదీ స్వయంకృతాలు మారేనా?

పదేండ్లు గడిచాయి. మూడోసారీ మోదీ అధికారంలోకి రాగలిగారు. కానీ, ప్రజలు మూడోసారి ఆయనకు సంపూర్ణ మెజారిటీ  ఇవ్వలేదు. ఎందుకంటే..మోదీ పాలనలో ప్రజలను మెప్పించినవి ఎన్ని ఉన్నాయో, మెప్పించలేని పనులు కూడా అన్నే ఉన్నాయి.  ప్రభుత్వంలో తీసుకునే కీలక నిర్ణయాలు ప్రజలకు తెలిసేలా తీసుకోలేదు. ఆ నిర్ణయాలు బయట అనేక అపోహలకు దారితీశాయి. ప్రతిపక్షాలు వాటిని అస్త్రాలుగా మలుచుకోవడం సహజంగా మారింది. దేశానికి ప్రయోజనం కలిగే నిర్ణయాలు ఉంటే ఎవరికీ తెలియకుండా తీసుకున్నా తప్పుకాదు. కానీ, అలా తీసుకున్న నిర్ణయాలు అమలులోకి వచ్చాక చూస్తే, అవి ఎవరికీ తెలియకుండా తీసుకోవాల్సిన నిర్ణయాలుగా కూడా కనిపించవు.  మోదీ ఇలాంటి ఉచిత నిందలు కొనితెచ్చుకున్నవే ఎక్కువగా మనకు కనిపిస్తాయి.

ప్రపంచీకరణకు దేశాన్ని ముందస్తుగా తయారు చేయకుండానే సంస్కరణలు తేవడం వల్ల మొదటి దశాబ్ద కాలం పాటు ప్రజలకు అవి శాపాలుగా మారిన మాట వాస్తవం. మూడున్నర దశాబ్దాలు దాటే సరికి సంస్కరణల అనివార్యత ప్రజలకు కూడా చాలా మేరకు అర్థమైపోయింది. ప్రభుత్వ రంగ సంస్థల్లో కార్మిక  పోరాటాలు జీతాల పెంపు కోసం తప్ప,  ప్రభుత్వ రంగ సంస్థలను ఎలా  కాపాడుకోవాలె అనే వైపు జరగలేదు.  హక్కులు తప్ప బాధ్యతలు పట్టలేదు. పాలకులకు ఓటు తప్ప ప్రభుత్వ సంస్థలను కాపాడడం ఎలా అనేది పట్టలేదు. అధికారులు, పాలకులు, కార్మికులు ఎవరి ప్రయోజనం వారిదిగా మారి ప్రభుత్వ రంగ సంస్థలు నష్టాల్లో కూరుకుపోయాయి. ఫలితంగానే ప్రైవేటీకరణ అనివార్యంగా మారింది. ప్రపంచీకరణ దానికి ప్రత్యామ్నాయంగా మారింది.  ఈ విషయం అధికార, ప్రతిపక్షాలకూ తెలుసు. ప్రజలను పక్కదారి పట్టించి పొలిటికల్​ మైలేజ్​ పొందడమే వాటికి  ఏకైక లక్ష్యంగా మారింది.  నిజానికి మోదీ ప్రభుత్వం అమలు చేసిన అనేక సంస్కరణలు గత మన్మోహన్​ సింగ్​ ప్రభుత్వం చేసిన ప్రతిపాదనలే.  అది జీఎస్టీనా,  రక్షణ శాఖలో అగ్నివీర్​ లాంటి సంస్కరణలా..  ఇలా ఆ కోవలో అనేకం ఉన్నాయి. 

గుజరాత్​ మోడల్​ కలసిరాలేదు

గుజరాత్​ రాష్ట్రాన్ని 13 ఏండ్లు సీఎంగా పాలించిన మోదీ అక్కడ ఆర్థిక సంస్కరణలను వేగంగా అమలుచేశారు. ఆ రాష్ట్రంలో సంస్కరణలకు పెద్దగా వ్యతిరేకత లేదు. గుజరాత్​ ఎకానమీని దశాబ్దాలుగా  ప్రైవేటు రంగమే నడిపిస్తోంది కాబట్టి వ్యతిరేకత రాలేదు. దేశానికి ప్రధాని అయ్యాక కూడా మోదీ గుజరాత్​ మోడల్​లోనే ఆర్థిక సంస్కరణలను అమలుచేయడం మొదలుపెట్టారు. అది రాజకీయ అపవాదులకు కావల్సినంత అవకాశం ఇచ్చింది.  సరే, తీసుకునే నిర్ణయాలను కొంతకాలం ప్రజల్లో చర్చకు వదిలిపెట్టింది లేదు. ఔట్​కమ్​ను బట్టి వాటిని అమలు చేసిఉంటే ఇంత పెద్దగా ప్రతిపక్షాలు మోదీకి బద్నాం అంటగట్టగలిగేవి కావు.

మైలేజీ తప్ప, మంచి పట్టని ప్రతిపక్షాలు

దేశంలోని అన్ని రాష్ట్రాలకు కేంద్ర రాబడి నుంచి 42శాతం నిధులను అందిస్తున్నది.  అలాగే, రాష్ట్రాల్లోని అభివృద్ధి పనులకు  సహాయం కోసం కేంద్రానికి నీతి ఆయోగ్​ సిఫార్స్​ చేస్తున్నది. కోఆపరేటివ్​ ఫెడరలిజానికి నీతి ఆయోగ్​ ఒక ఆదర్శంగా నిలుస్తున్నది. నీతి ఆయోగ్​ ప్రయోజనాల గురించి  ప్రతిపక్షం ఎందుకు మాట్లాడదు?  అనేది నైతిక ప్రశ్నే. కానీ, పొలిటికల్​ మైలేజీ ఎందులో ఉంటే అది మాత్రమే మాట్లాడటం ప్రతిపక్షాలకు అవసరంగా మారింది.

బద్నాం కేంద్రానికి, ఆదాయం రాష్ట్రాలకు

ఒకప్పుడు రాష్ట్రాలు అమ్మకం పన్ను  విధించేవి. ఏ వస్తువు మీద ఎంత పన్ను వేస్తున్నారనేది వినియోగదారుడికి తెలిసేది కాదు. జీఎస్టీ వచ్చాక ప్రతి కొనుగోలు బిల్లులో సీజీఎస్టీ, ఎస్​జీఎస్టీ  స్పష్టంగా పేర్కొనడం వల్ల, జీఎస్టీ ఉప్పు, పప్పు, నిప్పు అనే తేడా లేకుండా కేంద్రం  పన్ను  విధిస్తున్నదనే అపవాదు మోదీ ప్రభుత్వం కొని తెచ్చుకున్నదే. అంతకుముందు అలాంటి వస్తువులపై పన్ను  లేదని కాదు, ఉన్నది. అయినా అది ప్రజలకు అర్థంకాని విషయంగా మారింది. జీఎస్టీపై ప్రతిపక్షాలు కూడా బాగా వ్యతిరేక ప్రచారం చేశాయి. కానీ, వాస్తవంగా జీఎస్టీ పన్ను విధింపులో సగం రాష్ట్రాలకే తిరిగి  వస్తుందనే విషయం చాలా మంది వినియోగదారులకు తెలియదు.  ‘బద్నాం​ మోదీ ప్రభుత్వానికి, సగం పన్ను  రాష్ట్రాలకు’  అనేది నిజం. మోదీ సంస్కరణలు ఓట్లు రాల్చేవి కావు, ఓట్లు తగ్గించేవి మాత్రమే అని మొన్నటి ఎన్నికలు రుజువు చేశాయి. సమర్థ ప్రధానిగా ఖ్యాతి గడించిన మోదీ ఇలాంటి అపవాదుల నుంచి  ఓవర్​ కమ్​ కాలేకపోవడమే ఆయన అసమర్థ రాజకీయ వ్యూహాలకు నిదర్శనం.

ప్రైవేటురంగాన్ని పెంచడం,ఉపాధులు కల్పించడానికే 

ప్రతిపక్షాలు అంబానీ, అదానీ అనే పద్యం రోజూ వినిపిస్తుంటాయి.  పదేండ్లుగా దేశాన్ని మరోపార్టీ  పాలించి ఉంటే.. అంబానీ, అదానీలు ఉండేవారు కారని ఎవరైనా చెప్పగలరా? దేశ సంపదను  అంబానీ, అదానీకి  దోచిపెడుతున్నారని ప్రతిపక్షాలు ఒక ‘నారెటివ్​’ను తయారుచేశాయి. దాని నుంచి అవి ఎంతోకొంత రాజకీయ లబ్ధినీ  పొందగలిగాయి. కానీ, స్వాతంత్ర్యం వచ్చాక టాటా, బిర్లాలను కూడా అప్పట్లో అదేవిధంగా  సమాజం భావించింది. ఆర్థిక సంస్కరణలు ప్రైవేట్​ రంగాన్ని పెంచుతాయి. వాటితో  పాటు అంబానీలు, అదానీలూ వస్తుంటారు. అందులో తప్పేమీలేదు. అదానీకి కావాలని ప్రభుత్వ ఆస్తులు కట్టబెడుతున్నారనే ఆరోపణ ఉండొచ్చు. అందుకు చట్టబద్దంగా పోరాడేందుకు మనకు న్యాయవ్యవస్థ ఉందనే విషయాన్ని మర్చిపోవద్దు. ప్రభుత్వాలు  ప్రైవేటు రంగాన్ని పెంచడం ఉపాధులు పెంచడానికి కూడా. అదానీ, అంబానీల విషయంలో మోదీ సైతం నోరువిప్పి మాట్లాడకపోవడమూ తన పట్ల ప్రజల్లోనూ  అనుమానాలను పెంచాయి. 

భారత  బహుళజాతి కంపెనీలూ పెరగాల్సిందే

అధికారంలోకి వస్తే అన్ని పార్టీలూ సంస్కరణలను ఫాలో అవుతాయి. ఒకవేళ కేంద్రంలో  మరో పార్టీ అధికారంలోకి వచ్చిఉంటే  అంబానీ, అదానీల సంస్థలను, వ్యాపారాలను  వశపర్చుకుంటారా? ఆ విషయం  ప్రతిపక్షాలు దేశ ప్రజలకు ఎందుకు  హామీ ఇవ్వలేకపోతున్నాయి? ఆలోచించాల్సిన విషయం. ఇపుడు  బహుళజాతి కంపెనీలు ఎక్కువ ఉన్న  దేశాలే సంపన్న దేశాలుగా  విరాజిల్లుతున్నాయి. ఆ లెక్కన భారత దేశానికి సంబంధించిన బహుళజాతి కంపెనీలు పెరగడం అవసరమే అన్న  విషయాన్ని  ఎలా కాదంటాం?

క్షమాపణ చెప్పినా..

మూడు వ్యవసాయ బిల్లులపై ఢిల్లీ సరిహద్దుల్లో ఏడాది పాటు  రైతులు ధర్నాలు చేశాకగానీ వాటిని రద్దు చేయడమే కాకుండా, రైతులకు క్షమాపణ చెప్పడం కూడా  జరిగాయి. అది మోదీ రాజకీయ ప్రతిష్టను  బాగా దెబ్బతీసింది. తొందరపాటుతో వ్యవసాయ బిల్లులు తేవడం, తదుపరి విరమించుకోవడం మోదీ లోపమే. వ్యవసాయ బిల్లులను రద్దు చేసి క్షమాపణ చెప్పినా కూడా  హర్యానా, పశ్చిమ యూపీ, పంజాబ్​ రాష్ట్రాల్లో  మోదీ పట్ల రైతుల్లో వ్యతిరేకత  ఏమాత్రం తగ్గలేదు. మొన్నటి 
లోక్​ సభ ఫలితాలే ఆ విషయాన్ని స్పష్టం చేశాయి. 

2024 వచ్చేసరికి  ప్రతిపక్షాల విమర్శలనూ  ప్రజలు కాస్త నమ్మడం ఆరంభించారు.  రాజ్యాంగం, రిజర్వేషన్లు అనే విషయాలు యూపీలో బీజేపీని బాగా దెబ్బతీశాయి.   సంస్కరణల అమలును ఏకపక్షంగా బుల్డోజ్​ చేసి  ప్రతిపక్షాలకు అస్త్రాలు అందించిందీ మోదీనే. రాజ్యాంగం, రిజర్వేషన్ల అంశంతో  హిందూత్వకు గండి కొట్టాలని ప్రయత్నించిన  విపక్షాలను  మోదీ  నిలువరించలేక పోయారు.  అదే బీజేపీ మెజారిటీ సంఖ్యకు గండి కొట్టింది. పదేండ్ల స్వయంకృతాలే ఎన్నికల్లో మోదీని వెంటాడాయని చెప్పాలి. ఇప్పటికైనా స్వయంకృతాల నుంచి బయపడేనా?  చూడాల్సిందే

- కల్లూరి శ్రీనివాస్​ రెడ్డి,
సీనియర్​ జర్నలిస్ట్​