సీతారాం ఏచూరి మరణం భారత రాజకీయాలకు తీరని లోటు: ప్రధాని మోదీ

సీపీఎం ప్రధాన కార్యదర్శి, రాజకీయ కురువృద్ధుడు  సీతారాం ఏచూరి(72) కన్నుమూసిన విషయం తెలిసిందే.  శ్వాస‌కోస స‌మ‌స్య‌తో బాధ‌ప‌డుతున్న ఆయన గురువారం మధ్యాహ్నం 3 గంటల సమయంలో ఢిల్లీలోని ఎయిమ్స్ హాస్పిటల్ లో తుదిశ్వాస విడిచారు. ఏచూరి మరణం పట్ల ప్రముఖులు, రాజకీయనా నేతలు సంతాపం తెలుపుతున్నారు.

వామపక్షాలకు ఏచూరి ఒక మార్గదర్శి

సీతారాం ఏచూరి మరణం భారత రాజకీయాలకు తీరని లోటని భారత ప్రధాని మోదీ అన్నారు. ఆయన వామపక్షాలకు ఒక మార్గదర్శి అని వర్ణించారు. ఏచూరి కుటుంబసభ్యులకు, ఆయన అనుచరులకు ప్రధాని సంతాపం తెలియజేశారు.

"శ్రీ సీతారాం ఏచూరి జీ మరణించడం బాధాకరం. అతను వామపక్షాలకు ఒక మార్గదర్శి. సమర్థవంతమైన పార్లమెంటేరియన్‌గా ఆయన గుర్తింపు తెచ్చుకున్నారు. ఈ విషాద సమయంలో నా ఆలోచనలన్నీ ఆయన కుటుంబ సభ్యులపైనే ఉన్నాయి.." అని ప్రధాని మోదీ ఎక్స్‌లో పోస్ట్ చేశారు.

కాగా, కామ్రేడ్‌ సీతారాం ఏచూరి పార్థివదేహాన్ని ఆయన కోరిక మేరకు వైద్య పరిశోధనల కోసం దానంగా ఇవ్వనున్నట్లు సీపీఎం కేంద్ర కమిటీ కార్యాలయం ఒక ప్రకటలో తెలిపింది.