నాడు రాళ్లు పట్టిన చేతుల్లో..నేడు పెన్నులు ఉన్నయ్ : మోదీ

  • అభివృద్ధి పథంలో కాశ్మీర్ యువత
  • వాళ్లకు ప్రజాస్వామ్యంపై నమ్మకం పెరిగిందని వెల్లడి  
  • శ్రీనగర్, కత్రాలలో ఎన్నికల ర్యాలీలో పాల్గొన్న ప్రధాని

శ్రీనగర్ : జమ్మూకాశ్మీర్ యువత అభివృద్ధి పథంలో నడుస్తున్నారని ప్రధాని మోదీ అన్నారు. తమ ప్రభుత్వ హయాంలో సాధికారత సాధిస్తున్నారని చెప్పారు. ‘‘జమ్మూకాశ్మీర్ యువత చేతుల్లో ఒకప్పుడు రాళ్లు ఉండేవి. కానీ ఇప్పుడు పెన్నులు, బుక్కులు, ల్యాప్ టాప్స్ ఉన్నాయి. ఒకప్పుడు మనం స్కూళ్లల్లో మంటల గురించి వార్తలు వినేవాళ్లం. కానీ ఇప్పుడు ఎయిమ్స్, ఐఐటీ లాంటి విద్యాసంస్థల ఏర్పాటు వార్తలు వింటున్నాం” అని తెలిపారు. గురువారం జమ్మూకాశ్మీర్ లోని శ్రీనగర్, కత్రాలో నిర్వహించిన ఎన్నికల ర్యాలీల్లో మోదీ మాట్లాడారు. జమ్మూకాశ్మీర్ యువతకు ప్రజాస్వామ్యంపై నమ్మకం పెరిగిందని ఆయన చెప్పారు. ఓటు ద్వారా మార్పు సాధ్యమని నమ్ముతున్నారని తెలిపారు. యువత సాధికారత దిశగా ఇదొక ముందడుగు అని పేర్కొన్నారు. 

అసెంబ్లీ మొదటి విడత ఎన్నికల్లో ఓటర్లు రికార్డులు బ్రేక్ చేశారు. ఎప్పుడూ లేని విధంగా పెద్ద సంఖ్యలో జనం ఓటేసేందుకు వచ్చారు. కిష్త్వార్ జిల్లాలో 80 శాతానికి పైగా, రంబన్ లో 70, కుల్గాంలో 60 శాతానికి పైగా పోలింగ్ నమోదైంది. చాలా నియోజకవర్గాల్లో ఇంతకుముందున్న రికార్డులు బ్రేక్ అయ్యాయి. జమ్మూకాశ్మీర్ ప్రజలు కొత్త చరిత్రను లిఖించారు. ప్రజాస్వామ్యంపై వాళ్లకు నమ్మకం పెరిగిందని చెప్పడానికి ఇదే నిదర్శనం” అని అన్నారు. ఈ నెల 25న జరగనున్న రెండో విడత ఎన్నికల్లో పోలింగ్ శాతం మరింత పెంచి కొత్త రికార్డులు సృష్టించాలని ప్రజలకు పిలుపునిచ్చారు.  

ఆ మూడు కుటుంబ పార్టీలు.. 

కాంగ్రెస్, నేషనల్ కాన్ఫరెన్స్, పీడీపీ కుటుంబ పార్టీలని ప్రధాని మోదీ విమర్శించారు. ఆ పార్టీలు కాశ్మీర్ లో ప్రజాస్వామ్యాన్ని నిర్వీర్యం చేశాయని, సొంత ప్రయోజనాల కోసం కాశ్మీరీలకు తీరని అన్యాయం చేశాయని మండిపడ్డారు. ‘‘ఈ మూడు కుటుంబాలు ఇతరులను రాజకీయాల్లోకి రానివ్వలేదు. దీంతో యువతకు ప్రజాస్వామ్యంపై నమ్మకం పోయింది. ఓటు వేసినా, వేయకపోయినా ఆ మూడు కుటుంబాలే అధికారంలోకి వస్తాయని యువత అసంతృప్తి చెందారు. 

అందుకే వాళ్లు రాళ్లు పట్టుకునే పరిస్థితి వచ్చింది” అని చెప్పారు. ఒకప్పుడు రాత్రి సమయాల్లో, ఇంటింటికీ వెళ్లి ప్రచారం చేసే అవకాశం కూడా ఉండేది కాదన్నారు. ‘‘గత 30 ఏండ్లలో 3 వేల రోజులు జమ్మూకాశ్మీర్ లో బంద్ లు జరిగాయి. ఆ మూడు కుటుంబ పార్టీలు ప్రజలను దోచుకున్నాయి. యువత కలలను నాశనం చేశాయి” అని మండిపడ్డారు. గత ఐదేండ్లలో జమ్మూకాశ్మీర్ పరిస్థితులను మార్చేశామని, ప్రజాస్వామ్యంపై యువతకు నమ్మకం కలిగించామని తెలిపారు. 

రాష్ట్ర హోదాకు కట్టుబడి ఉన్నం.. 

కాశ్మీర్ కు రాష్ట్ర హోదా ఇస్తామని, దానికి కట్టుబడి ఉన్నామని మోదీ చెప్పారు. అధికారంలోకి వస్తే రైతులకు ఏటా రూ.10 వేలు, ప్రతి కుటుంబంలోని మహిళా పెద్దకు ఏటా రూ.18 వేలు ఆర్థిక సాయం అందజేస్తామని ప్రకటించారు. హెల్త్ ఇన్సూరెన్స్ ను రూ.5 లక్షల నుంచి రూ.7 లక్షలకు పెంచుతామని హామీ ఇచ్చారు.