- పుణె, ఢిల్లీ, కోల్ కతాలో ఏర్పాటు
- వర్చువల్ గా ప్రారంభించిన ప్రధాని
న్యూఢిల్లీ: సైంటిఫిక్ రీసెర్చ్ కోసం పుణె, ఢిల్లీ, కోల్ కతాలో ఏర్పాటు చేసిన మూడు ‘పరమ్ రుద్ర’ సూపర్ కంప్యూటర్లను ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించారు. గురువారం ఢిల్లీ నుంచి వర్చువల్ గా ఆయన వీటిని ఆవిష్కరించారు. ఈ మూడు సూపర్ కంప్యూటర్లను నేషనల్ సూపర్ కంప్యూటింగ్ మిషన్ (ఎన్ఎస్ఎం) కింద రూ.130 కోట్ల ఖర్చుతో దేశంలోనే తయారు చేశారు. వీటిలో ఒకదాన్ని పుణెలోని జెయింట్ మీటర్ రేడియో టెలిస్కోప్ (జీఎంఆర్టీ) వద్ద ఏర్పాటు చేశారు. దీన్ని ఫాస్ట్ రేడియో బరస్ట్స్, ఇతర ఖగోళ అంశాలను అధ్యయనం చేయడానికి వినియోగిస్తారు. మరో సూపర్ కంప్యూటర్ ను ఢిల్లీలోని ఇంటర్ యూనివర్సిటీ యాక్సిలరేటర్ సెంటర్ (ఐయూఏసీ)లో ఏర్పాటు చేశారు. దీన్ని మెటీరియల్ సైన్స్, అటామిక్ ఫిజిక్స్ లో అడ్వాన్స్డ్ రీసెర్చ్ కోసం వినియోగిస్తారు. ఇక మూడో సూపర్ కంప్యూటర్ ను కోల్ కతాలోని సత్యేంద్ర నాథ్ బోస్ సెంటర్ లో ఏర్పాటు చేశారు. దీన్ని ఫిజిక్స్, కాస్మాలజీ, ఎర్త్ సైన్సెస్ రంగాల్లో అధునాతన పరిశోధనల కోసం వినియోగిస్తారు. కాగా, వాతావరణ సమాచారాన్ని మరింత కచ్చితత్వంతో అందించేందుకు, క్లైమేట్ రీసెర్చ్ కోసం తయారు చేసిన హైపెర్ఫామెన్స్ కంప్యూటింగ్ (హెచ్ పీసీ) వ్యవస్థను కూడా ప్రధాని మోదీ ఆవిష్కరించారు. దీని ఏర్పాటు కోసం రూ.850 కోట్లు ఖర్చు చేశారు. ఈ హైపెర్ఫామెన్స్ కంప్యూటింగ్ సిస్టంను పుణెలోని ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ట్రోపికల్ మెటియోరాలజీ (ఐఐటీఎం), నోయిడాలోని నేషనల్ సెంటర్ ఫర్ మీడియం రేంజ్ వెదర్ ఫోర్ కాస్ట్ (ఎన్సీఎంఆర్ డబ్ల్యూఎఫ్)లో ఏర్పాటు చేశారు. ఈ రెండింటికి అర్కా, అరుణిక అని నామకరణం చేశారు.
సూపర్ కంప్యూటర్స్ తో ఇవీ లాభాలు..
- కాంప్లెక్స్ కాలిక్యులేషన్స్, సిమ్యులేషన్స్ ను చాలా వేగంగా కచ్చితత్వంతో చేస్తాయి.
- వాతావరణ అంచనాలు, క్లైమేట్ మోడలింగ్, డ్రగ్ డిస్కవరీ, మెటీరియల్ సైన్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగాల్లో రీసెర్చ్ కోసం వినియోగిస్తారు.
- సైంటిస్టులకు సవాలుగా మారిన సమస్యలను పరిష్కరించడానికి, ఆవిష్కరణలు చేయడానికి అవసరమైన టూల్స్ ను కూడా అందిస్తాయి.
ఇది ఇండియా సక్సెస్‌కు పునాది: మోదీ
ప్రపంచంలో టెక్నాలజీ, కంప్యూటింగ్ వ్యవస్థపై ఆధారపడని రంగం ఏదీ లేదని ప్రధాని మోదీ అన్నారు. ఇండస్ట్రీ 4.0లో ఇండియా సక్సెస్ కు ఈ సెక్టార్ పునాది లాంటిదన్నారు. ఇప్పుడు ప్రారంభించిన మూడు సూపర్ కంప్యూటర్లు సైన్స్ లో అధునాతన పరిశోధనలకు ఉపయోగపడతాయని చెప్పారు.