ప్రతిపక్షంగా కాంగ్రెస్ ఫెయిల్: ప్రధాని మోదీ

అంతర్గతపోరుతో ఆ పార్టీ ప్రజాసమస్యలకు దూరం: ప్రధాని మోదీ 
పవర్ కోసం అబద్ధాలు చెప్తుందని ఫైర్

చండీగఢ్: అధికారం కోసం కాంగ్రెస్ అబద్ధాలు చెప్తున్నదని..అంతర్గత పోరుతో సతమతమవుతున్న ఆ పార్టీ ప్రజా సమస్యలకు దూరమైందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. హర్యానా ప్రజలు బీజేపీకి మరోసారి సేవ చేసే అవకాశం కల్పించాలని కోరారు. గురువారం హర్యానాలోని సోనిపట్​లో నిర్వహించిన బీజేపీ ఎన్నికల ప్రచార సభలో మోదీ పాల్గొని మాట్లాడారు. అలాగే నమో యాప్ పార్టీ నిర్వహించిన ‘‘మేరా బూత్, సబ్సే మజ్బూత్’’ కార్యక్రమం ద్వారా పార్టీ కార్యకర్తలతో ఇంటరాక్ట్ అయ్యారు.

 ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 1990ల్లో హర్యానాలో ఆర్ఎస్ఎస్​ కోసం విస్తృతంగా తిరిగానని ఇక్కడి ప్రజలతో తనకు ప్రత్యేక అనుబంధం ఉందని చెప్పారు. దేశంలో, హర్యానాలో ప్రతిపక్షంగా కాంగ్రెస్ పూర్తిగా విఫలమైందని ఆయన విమర్శించారు. అంతర్గత కలహాలతో ఆ పార్టీ బలహీనంగా మారిందన్నారు. కొట్లాటలతో ప్రజా సమస్యలకు దూరంగా ఉన్న కాంగ్రెస్  పార్టీ రాష్ట్రంలో ఎన్నటికీ అధికారం పొందలేదన్నారు.

 ‘‘అయితే మనం వారి కలహాలను చూస్తూ కూర్చోవద్దు.. మనం మరింత కష్టపడి మన పార్టీ జెండాను రాష్ట్రంలో మరింత బలంగా పాతుదాం” అని పార్టీ క్యాడర్ కు మోదీ పిలుపునిచ్చారు.