- విగ్రహం కూలడం బాధ కలిగించిందన్న ప్రధాని
- ఛత్రపతి దైవం లాంటివాడు.. దేవుడి కన్నా గొప్ప ఏదీ లేదు
- ఫిన్‌టెక్ రంగం ప్రోత్సాహానికి పాలసీలు తెచ్చాం
- ఇందులో భాగంగానే ఏంజెల్ ట్యాక్స్ రద్దు
- మహారాష్ట్రలోని పాల్ఘర్‌లో ప్రధాని పర్యటన
- కంటైనర్ పోర్టు వధవాన్కు శంకుస్థాపన
ముంబై: మహారాష్ట్రలోని సింధుదుర్గ్‌లో ఛత్రపతి శివాజీ మహరాజ్ విగ్రహం కూలిన ఘటనపై ప్రతిపక్షాల నిరసనల నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ స్పందించారు. ఈ ఘటనపై క్షమాపణ చెప్పారు. మహారాష్ట్రలోని పాల్ఘర్‌లో శుక్రవారం ప్రధాని మోదీ పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘‘నేను ఇక్కడ దిగగానే.. విగ్రహం కూలినందుకు శివాజీకి క్షమాపణలు చెప్పాను. విగ్రహం కూలినందుకు బాధపడ్డవారందరికీ క్షమాపణలు చెప్తున్నా” అని వెల్లడించారు. ‘‘ఛత్రపతి దైవంలాంటివాడు.. దేవుడికన్నా గొప్ప ఏదీలేదు. ఆయనను దైవంగా భావించేవారు ఈ ఘటనతో తీవ్రంగా బాధపడ్డారు.
వారికి తలవంచి క్షమాపణలు చెబుతున్నా.. మన విలువలు వేరు. మనకు మన దైవం కంటే ఏదీ ఎక్కువ కాదు..” అని పేర్కొన్నారు. కాగా, 35 అడుగుల ఎత్తున్న శివాజీ విగ్రహాన్ని నిరుడు డిసెంబరు 4న నౌకాదళ దినోత్సవం సందర్భంగా ప్రధాని మోదీ ఆవిష్కరించారు. భారీ వర్షాలు కురవడంతో ఈ నెల 26న ఈ విగ్రహం కుప్పకూలింది. దీనిపై ప్రతిపక్షాలు నిరసనకు దిగగా, మహారాష్ట్ర పర్యటనలో ఉన్న మోదీ స్పందించారు. అలాగే, మన భూమిపుత్రుడు వీర్‌సావర్కర్‌ను అవమానించినవారు క్షమాపణలు చెప్పేందుకు సిద్ధగా లేరని, కోర్టులకు వెళ్లి పోరాడాలనుకుంటున్నారని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీని ఉద్దేశించి మోదీ విమర్శించారు.
ఫిన్‌టెక్ రంగం ప్రోత్సాహానికి..
గత పదేండ్లలో 31 బిలియన్ డాలర్ల పెట్టుబడులను ఆకర్షించిన ఫైనాన్షియల్ టెక్నాలజీ (ఫిన్‌టెక్) రంగాన్ని ప్రోత్సహించేందుకు కేంద్ర సర్కారు విధాన స్థాయిలో పలు చర్యలు తీసుకుంటున్నదని ప్రధాని మోదీ తెలిపారు. ఇందులో భాగంగానే ఏంజెల్ట్యాక్స్ను రద్దు చేసినట్టు చెప్పారు. దేశంలో పరిశోధన, ఆవిష్కరణలను ప్రోత్సహించడానికి రూ. లక్ష కోట్లు కేటాయించామని, డిజిటల్ పర్సనల్ డేటా ప్రొటెక్షన్ యాక్ట్‌ను అమలు చేస్తున్నామని వెల్లడించారు. ముంబైలో నిర్వహించిన గ్లోబల్ ఫిన్‌టెక్ ఫెస్ట్–2024 (జీఎఫ్ఎఫ్)లో మోదీ ప్రసంగించారు. సైబర్అక్రమాలకు అడ్డుకట్ట వేసేందుకు ప్రజల్లో డిజిటల్అక్షరాస్యతను పెంచేలా చర్యలు తీసుకోవాలని రెగ్యులేటర్స్‌కు సూచించారు. ఆర్థిక సేవలను ప్రజాస్వామీకరించడంలో ఫిన్‌టెక్ రంగం కీలకమైన పాత్ర పోషించిందని చెప్పారు. దేశం కూడా పండుగ వాతావరణంలో ఉన్న తరుణంలో దేశీయ ఆర్థిక వ్యవస్థ, క్యాపిటల్ మార్కెట్ సంబురాలు జరుపుకుంటున్నాయని అన్నారు. దేశంలో డిజిటల్ టెక్నాలజీ పారదర్శకతను తీసుకొచ్చిందని, ప్రభుత్వ పథకాల్లో డైరెక్ట్ బెనిఫిట్‌ట్రాన్స్‌ఫర్ ద్వారా వ్యవస్థలో అక్రమాలకు అడ్డుకట్ట వేయగలిగామని చెప్పారు. జన్‌ధన్, ఆధార్, మొబైల్.. ఈ మూడూ ‘క్యాష్ ఈజ్ కింగ్’ అనే భావనను తొలగించాయని, ప్రపంచంలోని డిజిటల్ లావాదేవీల్లో దాదాపు సగం మన దేశంలోనే జరుగుతున్నాయని మోదీ వివరించారు. సుస్థిర ఆర్థికాభివృద్ధే భారత్ లక్ష్యమని, అధునాతన సాంకేతికత, నియంత్రణ ఫ్రేమ్వర్క్స్తో ఫైనాన్షియల్ మార్కెట్‌ను బలోపేతం చేసేందుకు కేంద్రం బలమైన, పారదర్శక, సమర్థవంతమైన వ్యవస్థలను రూపొందిస్తుందని తెలిపారు.
నెల్లూరులో ఫిషింగ్ హార్బర్‌ను వర్చువల్‌గా ప్రారంభించిన మోదీ
ఏపీలోని నెల్లూరు జిల్లాలో ఏర్పాటు చేసిన జువ్వలదిన్నె ఫిషింగ్ హార్బర్‌ను ప్రధాని నరేంద్ర మోదీ శుక్రవారం వర్చువల్‌గా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో నెల్లూరు కలెక్టరేట్ నుంచి రాష్ట్ర మంత్రి నారాయణ, కావలి ఎమ్మెల్యే కృష్ణారెడ్డి, కలెక్టర్ ఆనంద్, మత్స్యకారులు పాల్గొన్నారు. జువ్వలదిన్నె ఫిషింగ్ హార్బర్ అందుబాటులోకి రావడంతో చేపల వేట మరింత సులభతరం కానుంది. రూ.288 కోట్లతో నిర్మించిన హార్బర్‌లో దాదాపు 1250 బోట్లు నిలిపి ఉంచేందుకు అవకాశం ఉంది. ఈ ఫిషింగ్ హార్బర్ ద్వారా 9 మండలాలలోని 98 గ్రామాల్లోని 12 వేల మంది మత్స్యకారులకు లబ్ధి చేకూరనుంది.
దేశంలోనే అతిపెద్ద కంటైనర్ పోర్టుగా వధవాన్
దేశంలోనే అతిపెద్ద కంటైనర్ పోర్టుగా వధవాన్ రూపుదిద్దుకుంటుందని ప్రధాని మోదీ తెలిపారు. మహారాష్ట్ర పూర్తిగా అభివృద్ధి చెందుతుందని, పూర్తి వనరులు ఉన్నాయని వివరించారు. పాల్ఘర్‌లో రూ. 76 వేల కోట్ల వ్యయంతో చేపట్టిన వధవాన్ పోర్ట్ శంకుస్థాపనతోపాటు రూ.1,560 కోట్లతో చేపట్టిన 218 చేపల పెంపకం ప్రాజెక్టులను ప్రారంభించారు. ఈ సందర్భంగా మోదీ మాట్లాడుతూ.. మహారాష్ట్రలోని సముద్ర తీరాల ద్వారా ప్రపంచ వాణిజ్యానికి శతాబ్దాల నాటి చరిత్ర ఉన్నదని, ఇక్కడ భవిష్యత్తు కోసం అపారమైన అవకాశాలు కూడా ఉన్నాయని చెప్పారు. రాయ్‌గఢ్ జిల్లాలో డిఘి పోర్ట్ ఇండస్ట్రియల్ ఏరియా అభివృద్ధికి కూడా కేంద్రం ఆమోదం తెలిపిందని మోదీ చెప్పారు.