ఇది భారత్​ కా సంవిధాన్​ సంఘ్​ రూల్​బుక్​ కాదు.. లోక్ సభలో కాంగ్రెస్ ఎంపీ ప్రియాంక గాంధీ ఫైర్

  • రాజ్యాంగంపై చర్చలో బీజేపీ,ఆర్ఎస్ఎస్​పై విరుచుకుపడ్డ కాంగ్రెస్​ ఎంపీ
  • గ్యాలరీ నుంచి చూసి మురిసిపోయిన సోనియాగాంధీ, మల్లికార్జున ఖర్గే
  • నా తొలి స్పీచ్ కంటే బెటర్: రాహుల్

న్యూఢిల్లీ: భారత రాజ్యాంగం బీజేపీ, ఆర్ఎస్ఎస్ రూల్ బుక్ కాదంటూ కాంగ్రెస్ ఎంపీ ప్రియాంక గాంధీ ఫైర్ అయ్యారు. కేంద్రంలోని అధికార బీజేపీ రాజ్యాంగాన్ని  నాశనం చేయాలని చూస్తోందని విమర్శించారు. భారత రాజ్యాంగం ఆమోదం పొంది 75 ఏండ్లు అయిన సందర్భంగా లోక్ సభలో శుక్రవారం ప్రారంభమైన రెండు రోజుల చర్చ సందర్భంగా కేంద్ర మంత్రి రాజ్ నాథ్ సింగ్, కాంగ్రెస్ ఎంపీ ప్రియాంక గాంధీ మధ్య మాటల యుద్ధం సాగింది.

తొలిరోజు చర్చను కేంద్ర ప్రభుత్వం తరఫున రక్షణ మంత్రి రాజ్​నాథ్​సింగ్​ ప్రారంభించారు.  రాజ్యాంగ నిర్మాణానికి కృషిచేసిన కొంతమంది మహనీయుల పేర్లను కావాలనే విస్మరించారంటూ కాంగ్రెస్​పై విమర్శలు చేశారు. వీర్​సావర్కర్​ కూడా కానిస్టిట్యూషన్​ నిర్మాణంలో కీలక పాత్ర పోషించారని తెలపగా.. ప్రతిపక్షాలు వ్యతిరేకంగా నినాదాలు చేశాయి. వారి కేకల మధ్యే రాజ్​నాథ్ ​ ప్రసంగాన్ని కొనసాగించారు. 

మేం రాజ్యాంగాన్ని బతికించుకున్నాం.. 

దశాబ్దాలపాటు అధికారంలో ఉన్న కాంగ్రెస్​.. దురుద్దేశపూరిత స్ఫూర్తితో చాలాసార్లు రాజ్యాంగానికి సవరణలు చేస్తే.. మోదీ నేతృత్వంలోని బీజేపీ ప్రాథమిక విలువలను బలోపేతం చేసేందుకు, ప్రజల సాధికారత కోసం సవరణలు చేసిందని రాజ్​నాథ్​  చెప్పారు. అవకాశం ఉన్నప్పుడల్లా కాంగ్రెస్​  రాజ్యాంగంపై అధికారం చలాయించిందన్నారు. ఎమర్జెన్సీ విధించడం, రాష్ట్ర ప్రభుత్వాలను రద్దు చేయడం, సుప్రీంకోర్టు జడ్జిల నియామకంలో అన్యాయం చేయడంలాంటి ఘటనలు కాంగ్రెస్​ హయాంలో జరిగాయని తెలిపారు.

రాజ్యాంగాన్ని తుంగలో తొక్కినవారు.. ఇప్పుడు దాని రక్షణ కోసం మాట్లాడడం ఆశ్చర్యంగా ఉన్నదన్నారు.  తాము  రాజ్యాంగానికి వ్యతిరేకంగా జరుగుతున్న కుట్రలను ఎదుర్కొన్నామని, రాజ్యాంగాన్ని బతికించుకున్నామని తెలిపారు.  రాజ్యాంగాన్ని బీజేపీ నేతలు గుండెల్లో పెట్టుకొంటే.. వారు(కాంగ్రెస్) జేబులో పెట్టుకొని తిరుగుతున్నారంటూ ఎంపీ రాహుల్ ​గాంధీపై సెటైర్లు వేశారు.   

కుల గణన జరగాలనేది ప్రజల కోరిక

కేరళలోని వయనాడ్ నుంచి ఎంపీగా గెలిచిన ప్రియాంక గాంధీ శుక్రవారం లోక్ సభలో తొలి ప్రసంగంలోనే కేంద్రంపై విరుచుకుపడ్డారు.దేశం  వాస్తవికతను అర్థం చేసుకోవడానికి ఈ రోజు ప్రజలు కుల గణన చేయాలని కోరుతున్నారని, కానీ..   కేంద్ర ప్రభుత్వం తన బాధ్యత నుంచి తప్పించుకుంటున్నదని విమర్శించారు. ‘‘ఆయన (ప్రధాని మోదీ) కాంగ్రెస్​ మీ బంగారం.. మంగళసూత్రాలు దోచుకుంటుందని అన్నారు.  కాంగ్రెస్​ ఈ దేశాన్ని 55 ఏండ్లు పాలించింది.

మీ మంగళసూత్రాలు.. బంగారాన్ని ఎవరైనా లాక్కున్నారా? దేశం కోసం ఇందిరాగాంధీ తన బంగారాన్ని ఇచ్చారు.. మా తల్లి మంగళసూత్రం త్యాగం చేశారు” అని ఎమోషనల్ గా ప్రసంగించారు. ఇటీవల యూపీలోని  సంభాల్ లో జరిగిన హింసాకాండనూ ప్రియాంక  ప్రస్తావించారు. అక్కడ కాల్పుల్లో ఓ టైలర్ చనిపోగా, అతడి ఇద్దరు కొడుకులను తాను కలిశానన్నారు. వారు తండ్రి కోరిక మేరకు విద్యావంతులం అవుతామని, రాజ్యాంగం ద్వారా తమ కలలను సాకారం చేసుకుంటామని చెప్పారన్నారు. 

 ప్రధాని లేకుండా చర్చనా?.. 

లోక్​సభలో ప్రధాని మోదీ లేకుండా రాజ్యాంగంపై చర్చ జరుపుతారా? అని సమాజ్​వాదీ పార్టీ అధినేత, ఎంపీ అఖిలేశ్​ యాదవ్​ ప్రశ్నించారు.  ఎన్డీయే సర్కారు దేశాన్ని నియంతలా పాలిస్తున్నదని  మండిపడ్డారు. ఎన్డీయే హయాంలో వేలాది మంది సామాన్యులు దేశం విడిచివెళ్లిపోయారని ఆరోపించారు. చాలా మంది తమ భారత పౌరసత్వాన్ని కూడా వదులుకున్నారని చెప్పారు. బోర్డర్​లోనూ పరిస్థితులు ఆందోళనకరంగా ఉన్నాయన్నారు.

మెజార్టీ వస్తే రాజ్యాంగాన్నే మార్చేవారు..

రాజ్యాంగం మన లైట్​హౌస్​ అని, మన రక్షణ కవచమని ప్రియాంకా గాంధీ  అన్నారు. అంబేద్కర్, మౌలానా ఆజాద్‌‌‌‌, రాజగోపాలాచారి, నెహ్రూ వంటి ఎంతోమంది మహనీయులు ఎన్నో ఏండ్ల పాటు తమ జీవితాలను అంకితం చేసి దీన్ని రూపొందించారని చెప్పారు. కేంద్రంలో  పదేండ్లు అధికారంలో ఉన్న బీజేపీ మాత్రం ఈ సురక్షా కవచాన్ని బద్ధలుకొట్టేందుకు ప్రయత్నించిందని ఆరోపించారు. లేటరల్​ ఎంట్రీ, ప్రైవేటైజేషన్​లాంటి చర్యలతో రిజర్వేషన్లను బలహీనపర్చేందుకు కేంద్రం యత్నిస్తున్నదని మండిపడ్డారు. గత లోక్​సభ ఎన్నికల్లో బీజేపీకి ఎక్కువ మెజార్టీ వచ్చి ఉంటే రాజ్యాంగాన్ని మార్చేయాలని భావించిందని చెప్పారు.