సర్కార్ భూముల్లో..ప్లాట్ల దందా!

  •      గద్వాల జిల్లా ఇటిక్యాలలో ప్రభుత్వ భూమి కబ్జా
  •     వెంచర్​ వేసి ప్లాట్లు రిజిస్ట్రేషన్  చేస్తామంటూ అక్రమ వసూళ్లు
  •     ఇంటి జాగ ఇప్పిస్తామంటూ దగా చేస్తున్న దళారులు

గద్వాల, వెలుగు : సర్కార్ భూములు, పీజేపీ కెనాల్  కోసం సేకరించిన భూముల్లో ప్లాట్లు ఇప్పిస్తామంటూ పైరవీ కారులు, చోటామోటా లీడర్లు అమాయక ప్రజలను మోసం చేస్తున్నారు. సర్కార్  భూముల్లో ప్లాట్లు చేశారని, వాటిని రిజిస్ట్రేషన్ కూడా చేయిస్తామంటూ ఒక్కొక్కరి నుంచి రూ.10 వేల నుంచి రూ. లక్ష వరకు వసూలు చేశారు. ఇలా జోగులాంబ గద్వాల జిల్లా  ఇటిక్యాల మండలంలో 100 మంది నుంచి వసూళ్లు చేయడం వెలుగులోకి వచ్చింది. ఇప్పటికే ఆ భూములపై కేసులు ఉన్నాయి. ఇద్దరు రెవెన్యూ ఆఫీసర్లు సస్పెండ్  అయినప్పటికీ ఆ భూముల్లోనే ప్లాట్లు రిజిస్ట్రేషన్  చేయిస్తామంటూ వసూళ్లకు పాల్పడుతున్నారు.

ఇది అసలు స్టోరీ..

ఇటిక్యాల తహసీల్దార్​ ఆఫీస్​ పక్కనే సర్వే నంబర్  208లో ప్రభుత్వ భూమి ఉంది. దానిపై రియల్టర్లు కన్నేశారు. రెవెన్యూ ఆఫీసర్లు, రియల్టర్లు కుమ్మక్కై ప్రభుత్వ భూమితో పాటు జూరాల ప్రాజెక్ట్​ కెనాల్  బండింగ్  కోసం సేకరించిన భూమిని కబ్జా చేసి వెంచర్  వేశారు. సర్వే నంబర్ 208లో 9 ఎకరాల 27 గుంటల భూమి ఉంది. ఇందులో ఆరెకరాలు ప్రభుత్వ భూమి కాగా, మిగతాది పట్టా భూమి. పట్టా భూమిని గతంలో పీజేపీ కెనాల్  బండింగ్  పనుల కోసం ప్రభుత్వం సేకరించింది.

పట్టాదారులకు పరిహారం డబ్బులు కూడా ఇచ్చారు. అయినప్పటికీ రెవెన్యూ ఆఫీసర్లు ప్రైవేట్​ పట్టా భూమి అంటూ రిపోర్ట్  ఇవ్వడంతో వెంచర్లు వేశారు. వీటిలో కొన్ని ప్లాట్లు అమ్మేశారు. ఈ వ్యవహారం బయటకు రావడంతో దీనిపై ఎంక్వైరీ జరిగింది. అప్పటి కలెక్టర్  తహసీల్దార్, ఆర్ఐను సస్పెండ్  చేశారు. ఆ కేసు ఇంకా పెండింగ్​లోనే ఉంది.

రిజిస్ట్రేషన్లు కాలే..

అక్రమ వెంచర్  వేసే ముందు రియల్టర్లు 50 మంది నుంచి అడ్వాన్స్  రూపంలో లక్షల రూపాయలు దండుకున్నారు. అటు ప్లాట్లు రిజిస్ట్రేషన్  కాక ఇటు డబ్బులు తిరిగి రాక వారు ఆఫీసులు, అధికారుల చుట్టూ తిరుగుతున్నారు. తమకు న్యాయం చేయాలని ఆఫీసర్లను వేడుకుంటున్నారు. వారి సమస్య అలాగే ఉండగానే మళ్లీ ప్లాట్లు రిజిస్ట్రేషన్  చేస్తామంటూ డబ్బులు వసూలు చేయడం ఆందోళనకు గురి చేస్తోంది. కబ్జాకు గురైన స్థలంలో సంబంధిత అధికారులు ప్రభుత్వ భూమి అని పేర్కొంటూ బోర్డులు పెట్టకపోవడంతో అది ప్రైవేట్  వెంచర్  అని భావిస్తున్నారు. ఇప్పటికైనా ఆ స్థలాన్ని స్వాధీనం చేసుకొని, బోర్డులు పెట్టాలని కోరుతున్నారు.

దళారుల వసూళ్లు..

అక్రమంగా వేసిన వెంచర్ లో ప్లాట్లు ఇప్పిస్తామని కొందరు దళారులు డబ్బులు వసూళ్లకు తెరలేపారు. 200 ప్లాట్లు ఉన్నాయని, డబ్బులు ఇస్తే రిజిస్ట్రేషన్  చేయిస్తామని ప్రచారం చేసుకుంటున్నారు. ఇలా దళారులు, చోటామోటా లీడర్లు, కుల సంఘాల నాయకులు 100 మంది నుంచి డబ్బులు వసూలు చేసినట్లు ఆరోపణలున్నాయి. తహసీల్దార్​ ఆఫీస్​ ఎదురుగానే ప్లాట్లు ఉండడంతో మంచి డిమాండ్  ఉంది.

చర్యలు తీసుకుంటాం..

ప్రభుత్వ భూమిలో ఎలాంటి ఇల్లీగల్  యాక్టివిటీస్  సహించేది లేదు. దళారుల మాటలు నమ్మి మోసపోవద్దు. ఆ స్థలంలో ప్లాట్ల రిజిస్ట్రేషన్లు జరగవు. ఈ వ్యవహారంపై దృష్టి పెడతాం. అక్కడ బోర్డు ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకుంటాం.

- రాంచందర్, ఆర్డీవో, గద్వాల