రంగురంగుల పక్షులు, వాటి రాగాలు ఎవరికైనా ఇష్టమే. అలాగే చెట్టూ చేమని పలకరిస్తూ, ప్రకృతి ఒడిలో సేదతీరాలని అనుకుంటారు చాలా మంది. అందుకే వీకెండ్ లేదా హాలిడే అయితే చాలు.. పచ్చని చెట్ల మధ్యలో నడిచేందుకు రెడీ అయిపోతారు. అలాంటివాళ్లు పెద్ద పార్క్ కి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తారు. ఎందుకంటే... ఇక్కడికి వెళ్తే చిన్నాపెద్దా తేడా లేకుండా అందరూ ఎంజాయ్ చేయొచ్చు. మన హైదరాబాద్ చుట్టుపక్కల కూడా అలాంటి పార్కులు ఉన్నాయి. ఈసారి వీకెండ్ టూర్ కోసం ఈ నేషనల్ పార్కులకి వెళ్లొచ్చు. వాటిలో రెండింటి గురించి..
మహావీర్ హరిణ వనస్థలి నేషనల్ పార్క్... హైదరాబాద్ లోని వనస్థలిపురంలో ఉంది. ఇక్కడ జింకలతో పాటు రకరకాల జంతువులు, పక్షులు ఉన్నాయి. పచ్చని చెట్ల మధ్య నడుస్తూ, పక్షుల పలకరింపులు వింటూ గడపాలనుకునేవాళ్లకు ఈ ప్లేస్ పర్ఫెక్ట్ ఛాయిస్.
ఈ పార్క్ ని 1975లో ఏర్పాటు చేశారు. జైన గురువు మహావీరుడి 2,500 జయంతి సందర్భంగా ఈ పార్క్ పేరుని ‘మహవీర్ హరిణ వనస్థలి నేషనల్ పార్క్'గా మార్చారు. 15 ఎకరాల్లో ఉంది ఈ పార్క్. అంతరించిపోయే దశలో ఉన్న కృష్ణ జింకల్ని ఇక్కడ చూడొచ్చు. ముళ్ల పందులు, అడవి పందులతో పాటు నెమళ్లు, కింగ్ ఫిషర్, కైట్ వంటి పక్షులు కనిపిస్తాయి. రకరకాల పక్షుల్ని చూస్తూ, వాటి సవ్వడులు వింటుంటే పొద్దే తెలియదు. అంతేకాదు ఈ పార్క్ 8 రకాల వలస పక్షులకి ఆవాసం కూడా. ఎత్తైన ప్రాంతం నుంచి జంతువుల్ని, పక్షుల్ని చూసేందుకు వీలుగా షెడ్స్, టవర్స్ వంటివి ఉంటాయి. ఈ పార్క్ లోని జంతువులు, పక్షుల ఫొటోల్ని ఎగ్జిబిషన్ హాల్లో చూడొచ్చు.
ఇలా వెళ్లాలి..
ఈ పార్క్ హైదరాబాద్ - విజయవాడ రోడ్డులో ఉంది. హైదరాబాద్ నుంచి 15 కి.మీటర్ల జర్నీ.
టైమింగ్స్:
ఉదయం 9 నుంచి సాయంత్రం 5:30 వరకు. ప్రతి సోమవారం సెలవు.
టికెట్: పిల్లలకు రూ.15, పెద్దలకు 20 రూపాయలు.
మచ్చల జింకలకి ఫేమస్..
మృగవని నేషనల్ పార్క్.. రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మండలంలోని చిల్కూర్ గ్రామంలో ఉంది. కొండలు, డ్రై ఫారెస్ట్ ఉండే ఈ ప్రాంతం దక్కన్ పీఠభూమి వాతావరణాన్ని తలపిస్తుంది. ఈ పార్క్ ని 1994లో వైల్డ్ లైఫ్ శాంక్చురీగా మార్చారు. 850 ఎకరాల్లో విస్తరించి ఉన్న ఈ పార్క్ 600లకు పైగా జంతువులు, రకరకాల చెట్లు ఉన్నాయి.
మచ్చల జింక, కృష్ణజింక, అడవిపంది, నల్ల రంగు మెడ ఉన్న చెవులపిల్లులు, పునుగు పిల్లి వంటివి. ఎక్కువగా కనిపిస్తాయి. రంగురంగుల పక్షుల్ని చూసేందుకు బర్డ్ లవర్స్ ఇక్కడికి ఎక్కువగా వెళ్తుంటారు. టూరిస్టులు పార్క్ కి దగ్గర్లోనే రెస్టారెంట్లలో నచ్చిన ఫుడ్ తినొచ్చు. అంతేకాదు ఇక్కడికి దగ్గర్లోనే 'వీసా బాలాజీ'గా పేరొందిన 'చిల్కూర్ బాలాజీ టెంపుల్ ఉంది.
ఇలా వెళ్లాలి..
హైదరాబాద్ నుంచి 25 కిలోమీటర్లు జర్నీ. బస్సులో లేదంటే బైక్ మీద, కారులో కూడా వెళ్లొచ్చు.
ఎంట్రీ ఫీజు:
- పిల్లలకు రూ. 5,
- పెద్దలకు 30 రూపాయలు.
- సఫారీ రైడ్ కి వెళ్లాలంటే 50 రూపాయలు.
- సఫారీ రైడ్ ఒకేసారి 50 మంది వెళ్లొచ్చు.
టైమింగ్స్:
ఉదయం 9 నుంచి సాయంత్రం 5 వరకు. వర్షాకాలంలో ఇక్కడికి వెళ్తే పచ్చదనంతో పార్క్ మొత్తం చూడముచ్చటగా కనిపిస్తుంది. అన్ని రోజులు తెరిచే ఉంటుంది.