కుక్కల్లో క్రూరత్వానికి ఇదే కారణం.. రాష్ట్రంలో లక్ష దాటిన కుక్క కాట్లు

కరీంనగర్, వెలుగు: మనుషులతో ఫ్రెండ్లీగా ఉండే స్వభావం కలిగిన కుక్కలు ఎందుకు ఈ మధ్య చాలా క్రూరంగా ప్రవర్తిస్తున్నాయి? చాలా చోట్ల చిన్నారుల మీద ఎందుకు దాడులు చేస్తున్నాయి? రోడ్డుపై టూ వీలర్స్ మీద వెళ్లే వాళ్లను ఎందుకు వెంటాడుతున్నాయి.? అసలు కుక్కల ప్రవర్తనలో ఈ మార్పులు రావడానికి కారణాలు ఏంటని పెటా ఇండియా, ఇతర ఎక్స్ పర్ట్స్ ఇటీవల పరిశోధిస్తే విస్తుపోయే విషయాలు వెల్లడయ్యాయి. మనుషుల ప్రవర్తనలో మార్పులతోనే కుక్కల్లో క్రూరత్వం పెరిగిపోతున్నదని తేలింది. 

గతంలో మాదిరిగా కుక్కలకు బయట ఎక్కడా తిండి దొరకకపోవడం, మనుషుల నుంచి కూడా కనీస ఆదరణ కరువవ్వడం, పైగా కుక్కలు కనిపిస్తే తరిమికొట్టడంలాంటి చర్యలతో అవి ఫ్రస్ట్రేషన్​కు గురవుతున్నట్టు గుర్తించారు. 

అందుకే ఇటీవల దేశవ్యాప్తంగా కుక్క కాట్ల సంఖ్య పెరిగిందని తేల్చారు. కరోనా సమయంలో స్టెరిలైజేషన్ ప్రక్రియను నిలిపివేయడంతో వాటి సంతానం కూడా వృద్ధి చెందిందని నిపుణులు గుర్తించారు. 

వీధి కుక్కలను ఎవరూ దగ్గరకు తీస్తలే

గతంలో ప్రజలు వీధి కుక్కలకు ఇంట్లో మిగిలిపోయిన అన్నం, ఇతర ఆహార పదార్థాలు వేసేవారు. అయితే, ఇప్పుడు వాటికి తిండి పెట్టేవారు కరువయ్యారు. కుక్కలను దగ్గరకు తీసేవారే కనిపించడంలేదు. కుక్కల సంఖ్య పెరగడం, వాటికి ఆహారం వేసేవారి సంఖ్య తగ్గడంతో అవి ఆకలి, దాహంతో అల్లాడుతున్నాయని జంతు ప్రేమికులు చెప్తున్నారు. 

గతంలో చెత్త కుండీ వద్ద పారేసిన ఆహారం కుక్కల ఆకలి తీర్చేది. అయితే, పట్టణాల్లో ఇప్పుడు గతంలోలాగా చెత్త కుండీలు వినియోగించడం లేదు. ఇంటింటి నుంచి చెత్త సేకరిస్తూ నేరుగా డంపింగ్ యార్డుల్లోకి తరలిస్తున్నారు. దీంతో కొన్నాళ్లుగా కుక్కలకు బయట ఎక్కడా ఆహారం దొరకని పరిస్థితి నెలకొన్నది.  అలాగే, ఆహారం కోసం కుక్కలు ఇంటి ముందుకొస్తే మనుషులు కర్రలు, రాళ్లతో తరిమికొట్టడంలాంటి ఘటనలు వాటిని క్రూరంగా మారుస్తున్నాయని జంతు ప్రేమికులు చెబుతున్నారు. సాధారణంగా కుక్కలు మనుషులపై దాడి చేయవని, కానీ ఇలా దాడికి దిగడానికి గల కారణాలను లోతుగా అధ్యయనం చేసి, నిర్ధారణకు రావాల్సి ఉందని వారు చెప్తున్నారు. 

పూర్తిస్థాయిలో ఆకలి తీర్చని ‘అడాప్ట్ ఏ దేశీ డాగ్’

స్ట్రీట్ డాగ్స్ ను ఎవరూ పట్టించుకోవడం లేదనే ఆవేదనతో పెటా ఇండియా ప్రతినిధులు కొన్నాళ్లుగా 'అడాప్ట్ ఏ దేశీ డాగ్' అనే క్యాంపెయిన్ ను నిర్వహిస్తున్నారు. హైదరాబాద్, ఢిల్లీ, ముంబైలాంటి మెట్రో సిటీస్ లో కొంత మంది వలంటీర్లు హోటళ్లు, రెస్టారెంట్లలో మిగిలిపోయిన ఆహారం తీసుకొచ్చి స్ట్రీట్ డాగ్స్ ఆకలి తీరుస్తున్నారు. అయితే, ఈ ఫుడ్ అందుతున్న కుక్కల సంఖ్య చాలా తక్కువే. వలంటీర్ల సంఖ్య తక్కువగా ఉండడం, కుక్కల సంఖ్య ఎక్కువగా ఉండడంతో పెటా సేవలు పూర్తి స్థాయిలో అందడం లేదు. 

కరోనా కారణమే.. 

కరోనా మహమ్మారి కూడా కుక్కల ప్రవర్తనలో మార్పు రావడానికి కారణమైంది. కరోనాకు ముందు స్ట్రీట్ డాగ్స్ కు రెస్టారెంట్లు, హోటళ్లలో మిగిలిపోయిన ఆహారం దొరికేది. కరోనా టైంలో ఇవన్నీ మూతపడడంతో చాలా రోజులు ఆహారం లేకుండా గడిపాయి. అదే సమయంలో కరోనా టైంలో కుక్కల్లో యానిమల్ బర్త్ కంట్రోల్ ప్రోగ్రామ్ ను పూర్తి స్థాయిలో అమలు చేయకపోవడంతో ఏడాది కాలంలో వాటి సంఖ్య విపరీతంగా పెరిగింది. 

యానిమల్ బర్త్ కంట్రోల్ (డాగ్స్) రూల్స్– - 2001 ప్రకారం మున్సిపాలిటీలు, గ్రామ పంచాయతీల్లో కుక్కల స్టెరిలైజేషన్ కార్యక్రమాన్ని పూర్తిస్థాయిలో అమలు చేయాలి. సంతానోత్పత్తి లేని కారణంగా కాలక్రమేణా కుక్కల సంఖ్య తగ్గడం లేదా స్థిరంగా ఉంటుంది. అయితే మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో వెటర్నరీ డాక్టర్లు, సిబ్బంది కొరత కారణంగా స్టెరిలైజేషన్ ప్రక్రియ విజయవంతం కావడం లేదు. కుక్కలకు ట్రీట్ మెంట్ చేసే సెంటర్లు కూడా చాలా పరిమితంగా ఉన్నాయి.  

ఏటేటా పెరుగుతున్న కుక్క కాట్లు

రాష్ట్రంలో కుక్క కాట్ల బాధితుల సంఖ్య ఏటేటా పెరుగుతున్నది. నిరుడు డిసెంబర్ లో రాజ్యసభలో హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ మినిస్టర్ సత్యపాల్ సింగ్ బాగేల్ వివరాల ప్రకారం తెలంగాణలో 2023 లో 1,08,910 మంది కుక్క కాట్లకు గురయ్యారు.2019లో 1,67,733 మంది, 2020లో 82,954, 2021లో 53,149, 2022లో 92,613 మందిపై కుక్కలు దాడి చేశాయి. 2020, 2021లో కుక్క కాట్ల సంఖ్య కాస్త తగ్గినా మూడేండ్లుగా మళ్లీ పెరుగుతుండడం ఆందోళనకు గురి చేస్తున్నది.

2022లో రేబిస్ కారణంగా 307 మంది మృతి 

 దేశంలో రేబిస్ మరణాలు సంభవిస్తున్నాయి. 2023 పార్లమెంట్ సెషన్ లో వెల్లడించిన వివరాల ప్రకారం.. 2022లో దేశంలో మొత్తం 307 మంది రేబిస్ ఇన్ఫెక్షన్ కారణంగా మరణించారు. ఢిల్లీలో 48 మంది, వెస్ట్ బెంగాల్ లో 38, మహారాష్ట్ర, కర్నాటక, ఏపీలో 29 మంది చొప్పున మృతిచెందగా, తెలంగాణ రాష్ట్రంలో 21 మంది చనిపోయారు.మరి కొన్ని కారణాలు ఇవే..ఒక ఆడ కుక్క ఏడాదిలో 20 పిల్లలకు జన్మనిస్తుంది. 

తల్లి కుక్క తన పిల్లలను చాలా జాగ్రత్తగా చూసుకుంటుంది. దరిదాపుల్లోకి మనుషులెవరినీ రానివ్వదు. కారు, బైక్ ప్రమాదానికి గురై తన కుక్క పిల్ల చనిపోతే, అలాంటి వాహనాన్ని తన శత్రువుగా భావించి వెహికల్స్ కనిపించినప్పుడల్లా వెంబడిస్తుంది. ఇది కుక్కల్లో ఫ్రస్ట్రేషన్​కు దారితీస్తుంది. అలాగే మనుషులపై దాడుల ప్రమాదాన్ని పెంచుతుంది. 
    గుంపులోని అన్ని వీధి కుక్కలు దూకుడుగా ఉండవు. అయితే, ఇందులో దూకుడు స్వభావం ఉన్న కుక్క మిగతావాటిని ఒక్కసారిగా రెచ్చగొడుతుంది. దీంతో అన్నీ ఒక్కటవుతాయి. ఇలాంటి కుక్కలను గుర్తించి డాగ్ షెల్టర్‌‌‌‌కు తరలించాలి.
    కుక్కలు తాము నివసించే ప్రాంతానికి ఇంకో గుంపును రానివ్వవు. ఇలా గుంపుల మధ్య జరిగే ఘర్షణలు కూడా వాటిని ప్రభావితం చేస్తాయి.