విద్యార్థులను చితకబాదిన పీఈటీ

  • ఉదయం వ్యాయామం చేసేందుకు నిద్ర లేవలేదని.. 
  • కోపంతో ఊగిపోతూ విద్యార్థులపై దాడి చేసిండు 
  • మెట్ పల్లి టౌన్ బీసీ బాలుర గురుకుల స్కూల్​ లో ఘటన

మెట్ పల్లి, వెలుగు : వ్యాయామం చేసేందుకు నిద్ర లేవలేదని విద్యార్థులను పీఈటీ చితకబాదిన ఘటన జగిత్యాల జిల్లాలో జరిగింది. వివరాల్లోకి వెళ్లే.. మెట్ పల్లి టౌన్ 12వ వార్డులో  బీసీ వెల్ఫేర్ రెసిడెన్షియల్ బాయ్స్ స్కూల్ లో ప్రశాంత్ పీఈటీగా చేస్తున్నాడు. ప్రతి రోజూ ఉదయం విద్యార్థులను నిద్ర లేపి వ్యాయామం చేయిస్తాడు. బుధవారం ఉదయం తొమ్మిదో తరగతి విద్యార్థులు వ్యాయామం చేసేందుకు నిద్ర లేవలేదు. దీంతో  కోపంతో ఊగిపోతూ బెత్తం తీసుకుని విద్యార్థులపై పీఈటీ విచక్షణ రహితంగా దాడి చేసి కొట్టాడు. దీంతో ఆరుగురు విద్యార్థుల వీపు, చేతులు, ముఖాలపై దద్దులు వచ్చాయి.

విద్యార్థులు ఏడ్చినా వినిపించుకోకుండా కొట్టాడు. సమాచారం తెలియడంతో కొందరు పేరెంట్స్ స్కూల్ కు వెళ్లి  విద్యార్థులను ఇంటికి తీసుకెళ్లినట్లు తెలిసింది. ఘటనపై స్కూల్ ప్రిన్సిపాల్ జుబేర్ ను వివరణ కోరగా ప్రతి రోజూ ఉదయం విద్యార్థులు వ్యాయామం చేసేందుకు లేవలేదనే కోపంతో  కొట్టినట్లు తన దృష్టికి వచ్చిందని తెలిపారు. గురువారం విద్యార్థులతో మాట్లాడి పీఈటీపై తగు చర్యలు తీసుకుంటామని చెప్పారు.