- మహిళలను వీడియోలు తీసి బ్లాక్ మెయిల్ చేసిన కేసులో ట్విస్ట్
- నిజామాబాద్‌లో సెంటర్ల ఆగడాలపై విచారణకు కలెక్టర్ ఆదేశాలు
- 120 కేంద్రాల పరిశీలనకు 50 టీంలు
నిజామాబాద్, వెలుగు : నిజామాబాద్‌లోని అయ్యప్ప స్కానింగ్ సెంటర్లో యువతులు, మహిళలను స్కానింగ్ చేసే టైంలో దొంగచాటుగా ఫొటోలు, వీడియోలు తీసి బ్లాక్మెయిల్చేయడం, లైంగికంగా వేధించిన ఘటన రాష్ట్రవ్యాప్తంగా కలకలం రేపింది. పరువు పోతుందని, భయంతో చాలా మంది ఈ విషయాన్ని బయటకు చెప్పకపోగా ఒక్క మహిళ ధైర్యం చేసి దారుణాన్ని బయటపెట్టడంతో నిందితుడు ఊచలు లెక్కపెడుతున్నాడు.
అయితే, అయ్యప్ప స్కానింగ్సెంటర్ ఆపరేటర్ ప్రశాంత్ విచారణలో మరో మూడు సెంటర్లలోనూ ఇలాగే జరిగిందని చెప్పడంతో అధికారులు షాక్ తిన్నారు. దీంతో కలెక్టర్ రాజీవ్‌గాంధీ హనుమంతు సమగ్ర విచారణకు ఆదేశించారు. జిల్లాలోని మొత్తం సెంటర్ల పరిశీలనకు 50 బృందాలను ఏర్పాటు చేశారు. ఇప్పటికే ప్రశాంత్ బాధితులు వంద మంది దాకా ఉన్నట్లు తెలుస్తుండగా, మిగతా సెంటర్లలో ఎంత మంది ఉన్నారనే విషయం దర్యాప్తులో తేలనుంది.
మొత్తం 50 టీంల అపాయింట్
అయ్యప్ప స్కానింగ్ సెంటర్ మేనేజ్మెంట్కు పది రోజుల గడువుతో నోటీస్ జారీ చేసిన డీఎంహెచ్‌వో డాక్టర్ తుకారాం రాథోడ్.. నలు గురు మహిళా డాక్టర్లతో కమిటీని విచారణకు నియమించారు. మరోవైపు కలెక్టర్ ఏర్పాటు చేసిన 50 టీంలు ఐదు గవర్నమెంట్సెంటర్లు మినహా మొత్తం 120 స్కానింగ్ కేంద్రాలను పరిశీలించి రిపోర్టు అందించనుంది.
పది రోజుల్లో రిపోర్టు ఇవ్వాలి
జిల్లాలోని అన్ని స్కానింగ్ సెంటర్లను జూన్1 నుంచి గ్రౌండ్ విజిట్ చేసి పది రోజుల్లో రిపోర్టు అందించాలని టీమ్స్‌కు ఆర్డర్స్ఇచ్చామని డీఎంహెచ్‌వో డాక్టర్ తుకారాం రాథోడ్ తెలిపారు. స్కానింగ్ కోసం వచ్చే మహిళలకు సహాయపడడానికి సెంటర్లలో మహిళా స్టాఫ్‌నే నియమించాలని మేనేజ్మెంట్లకు సూచించామన్నారు. ఎక్కడైనా లింగ నిర్ధారణ పరీక్షలు జరిగితే తమకు సమాచారం ఇవ్వాలన్నారు.
స్కానింగ్సెంటర్లలో మెడికల్, నాన్ మెడికల్ స్టాఫ్‌ను విభజించాలని, మెడికల్ స్టాఫ్‌ను మాత్రమే లోపలకు అనుమతించాలని సీపీ కల్మేశ్వర్ సెంటర్ల నిర్వాహకులకు ఆదేశించారు. స్కానింగ్ సేఫ్‌గా లేదని అనిపిస్తే మేనేజ్మెంట్కు చెప్పాలని, వారు స్పందించకపోతే తమకు సమాచారం ఇవ్వాలని సీపీ ఒక ప్రకటనలో కోరారు.