అప్పు చేయడం.. ఐపీ పెట్టడం .. నమ్మించి ముంచుతున్న కేటుగాళ్లు

  • మిత్తీల ఆశతో బలవుతున్న సామాన్యులు
  • ఆలేరులో రూ. కోటీ వసూలు చేసిన వ్యాపారి 

యాదాద్రి, వెలుగు : అమాయకులను నమ్మించి అప్పులు చేయడం.. దివాలా పిటీషన్లు వేసి ఎగ్గొట్టడం .. ఇలాంటి ఘటనలు జిల్లాలో తరచూ చోటు చేసుకుంటున్నాయి. అందిన కాడికి అప్పు తీసుకుని రాత్రికి రాత్రే పారిపోతున్నారు. అప్పు ఇచ్చినవాళ్లు ఒత్తిడి తేకుండా ముందే కోర్టులను ఆశ్రయించి ఐపీ పెడుతున్నారు. దీంతో అప్పులు ఇచ్చిన వాళ్లు ఆందోళన చెందుతున్నారు. తాజాగా జిల్లాలోని ఆలేరు మండలానికి చెందిన ఒకరు రూ. కోటికి పైగా అప్పులు చేసి ఐపీ పెట్టాడు. 

వడ్డీల ఆశతో .. 

 వడ్డీ వస్తుందన్న ఆశతో చాలామంది బోల్తా పడుతున్నారు. అప్పు అడిగేవారు అత్యవసరమని చెప్పి నూటికి రూ. 5 నుంచి రూ. 10 వరకూ వడ్డీ ఇస్తామని ఆశ పెడతారు. తీసుకున్న తర్వాత కొన్నాళ్లు వడ్డీ సక్రమంగా చెల్లించి.. చివరకు చేతులెత్తేస్తున్నారు. తెలిసిన వాళ్లందరి దగ్గర అప్పు చేసి పెద్ద ఎత్తున డబ్బులు వసూలు చేసుకొని పారిపోతున్నారు. మరికొందరు కోర్టులను ఆశ్రయించి ఐపీ పెడుతున్నారు. చిట్టీల పేర కూడా పలువురు అమాయకులనుంచి వసూలు చేసుకుని మోసాలకు పాల్పడుతున్నారు. జిల్లాలో అనధికారికంగా రూ. 50 వేల నుంచి రూ. 50 లక్షల వరకూ చీటీలు నడిపిస్తున్న వారు చాలా మందే ఉన్నారు. చీటీ పూర్తయినా డబ్బులు ఇవ్వకుండా బిచానా ఎత్తేస్తున్నారు. 

 అప్పు ఇచ్చినోళ్లకే నోటీసులు

ఆలేరు మండలానికి చెందిన ఒక వ్యక్తి.. పలువురి వద్ద రూ. కోటికి పైగా అప్పులు చేశాడు. ఒక్కొక్కరి వద్ద నూటికి రూ. 3 నుంచి రూ. 10 వరకూ మిత్తి చెల్లిస్తానని అప్పులు చేశాడు. రియల్​ ఎస్టేట్​ వ్యాపారంలో పెట్టుబడులు పెట్టినట్టుగా ప్రచారం జరిగింది. చివరకు అతడు నడిపిస్తున్న షాపు మూసివేయడంతో అందరూ ఆందోళన చెందారు. అయితే తాను ఎక్కడికి వెళ్లలేదని, తిరిగి చెల్లిస్తానని చెప్పి వాయిదాల మీద వాయిదాలు పెట్టాడు. చెప్పినట్టుగా ఏ వాయిదాలోనూ అప్పులు చెల్లించలేదు. చివరకు కోర్టును ఆశ్రయించి తాను దివాలా తీసినట్టుగా ఐపీ పెట్టాడు. అప్పు ఇచ్చిన వారందరికీ కోర్టు నుంచి నోటీసులు వచ్చాయి. 

మిత్తిల్లో రకాలు

అంగడి మిత్తి.. సీడీ మిత్తి, సీసీ (క్రెడిట్ కార్డు) మిత్తి. ఇవి ఒక్కో చోట ఒక్కో రకంగా వాడుకలో ఉన్నాయి. -అంగడి మిత్తి అంటే.. గ్రామాల్లో ఏ రోజు అంగడి జరిగితే ఆ రోజు అప్పు తీసుకుంటారు. తీసుకున్న అప్పు.. మరుసటి వారం అదే గ్రామంలో జరిగే అంగడి రోజున అసలు నెల మిత్తితో సహా చెల్లించాలి. -సీడీ మిత్తి ఇది ఎక్కువగా ఫైనాన్స్​ బిజినెస్​లో ఉన్న ఇస్తూ ఉంటారు. ఇది కూడా అంగడి మిత్తి తరహాలోనే అప్పు తీసుకున్న వారంలోనే మిత్తితో సహా చెల్లించాల్సి ఉంటుంది. వీటికి నెలకు చెల్లించే మిత్తి వారానికి అసలుతో చెల్లించాలి. -తాజాగా సీసీ (క్రెడిట్​ కార్డు)మిత్తి. ఇది క్రెడిట్​ కార్డు ద్వారా తీసుకున్న డబ్బును చెల్లించడానికి మరో వ్యక్తి వద్ద డబ్బు తీసుకొని పే చేస్తారు. ఆ తర్వాత మళ్లీ క్రెడిట్​ కార్డుపై లోన్​ తీసుకొని నెల మిత్తితో సహా చెల్లించాలి 

ఇవీ ఘటనలు

  • కేరళకు చెందిన ఓ వ్యక్తి.. జిల్లాలోని యాదగిరిగుట్టలో బట్టల దుకాణం తెరిచాడు. ఏండ్లతరబడి షాపు నడిపిస్తూ ఎక్కువ వడ్డీ ఇస్తానని నమ్మబలికాడు. రూ. 2 కోట్లకు పైగా అప్పులు చేసి చివరకు నాలుగేండ్ల కింద షాపు క్లోజ్​ చేసి పారిపోయాడు. 
  • భువనగిరికి చెందిన ఓ వ్యాపారి పరిచయమున్న వారితో పాటు కష్టమర్ల వద్ద అప్పులు చేశాడు. వడ్డీ ఎక్కువగా ఇస్తానని నమ్మించడంతో అనేక మంది అప్పు ఇచ్చారు. రూ. కోట్లు అప్పులు చేసి కుటుంబంతో సహా మాయమయ్యాడు. 
  • ఆలేరు మండలానికే చెందిన మరో వ్యక్తి గతేడాది రూ. 2 కోట్లకు పైగా అప్పులు చేసి మాయమయ్యాడు. 
  • చిట్​ఫండ్​ పెట్టి చిట్టీలు నడిపిన మరో వ్యాపారి.. చీటీలు ఎత్తుకున్న వారికి సరిగా డబ్బులు ఇవ్వకుండా నెలలు గడిపాడు. పలువురికి చీటీల డబ్బులు ఇవ్వకుండా ఒకరోజు బిచాణా ఎత్తేశాడు. సదరు వ్యాపారి కూడా రూ కోట్ల వరకూ ముంచేశాడు. 
  • రియల్​ ఎస్టేట్​ బిజినెస్ చేస్తున్న ఇంకో వ్యాపారి.. లాభాలు బాగా వస్తున్నాయని చెబుతూ పెట్టుబడి పేరుతో రూ. 10 వడ్డీకి కూడా అప్పులు చేశాడు. అత్యాశకు లోనైన పలువురు డబ్బులు ఇచ్చారు. చివరకు అతడూ మాయమయ్యాడు.