మరో 4 మెడికల్ కాలేజీలకు పర్మిషన్

  • ఒక్కో కాలేజీలో 50 ఎంబీబీఎస్‌‌‌‌ సీట్లు
  • మరో నాలుగు కాలేజీలకు ఆగిన పర్మిషన్లు
  • భవనాల లీజ్ సరిగా లేదన్న ఎన్‌‌‌‌ఎంసీ 
  • అప్పీల్‌‌‌‌కు మరో చాన్స్ 
  • హెల్త్‌‌‌‌ హెచ్‌‌‌‌వోడీ పోస్టులకు కేబినెట్ ఆమోదం

హైదరాబాద్, వెలుగు : రాష్ట్రంలో మరో 4 ప్రభుత్వ మెడికల్ కాలేజీలకు నేషనల్ మెడికల్ కమిషన్‌‌ (ఎన్‌‌ ఎంసీ) పర్మిషన్ ఇచ్చింది. ఈ లిస్టులో ములుగు, నర్సంపేట్(వరంగల్), గద్వాల్, నారాయణపేట్ కాలేజీలు ఉన్నాయి. ఒక్కో కాలేజీలో 50 ఎంబీబీఎస్ సీట్లకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఆగస్టులో జరగనున్న ఎంబీబీఎస్ కౌన్సిలింగ్‌‌లో ఈ సీట్లను భర్తీ చేయనున్నారు. అయితే, కుత్బుల్లాపూర్‌‌, మహేశ్వరం, మెదక్, యాదాద్రి కాలేజీల పర్మిషన్లను ఎన్‌‌ఎంసీ హోల్డ్‌‌లో పెట్టింది. ఈ కాలేజీల కోసం ప్రైవేటు బిల్డింగులను ప్రభుత్వం రెంటుకు తీసుకుంది. 

ఎన్‌‌ఎంసీ నిబంధనల ప్రకారం రెంటల్ అగ్రిమెంట్ 30 ఏండ్లకు ఉండాలి. కానీ, ఎన్ఎంసీకి సమర్పించిన రెంటల్ అగ్రిమెంట్‌‌లో ఈ అంశాన్ని పొందుపర్చలేదు. దీంతో పర్మిషన్లను ఎన్‌‌ఎంసీ హోల్డ్‌‌లో పెట్టింది. అప్పీల్‌‌ కోసం మరో అవకాశాన్ని ఇస్తున్నట్టు పేర్కొంది. రెంటల్ అగ్రిమెంట్లను సరిచేసి పంపిస్తామని, మిగిలిన 4 కాలేజీలకు కూడా తప్పకుండా పర్మిషన్ వస్తుందని డీఎంఈ వాణి ధీమా వ్యక్తం చేశారు. 

ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహా సూచనల మేరకు అన్ని కొత్త కాలేజీల్లో ఫ్యాకల్టీని నియమించామని ఆమె తెలిపారు. ప్రస్తుతం ఎన్‌‌ఎంసీ హోల్డ్‌‌లో పెట్టిన మహేశ్వరం, కుత్బుల్లాపూర్, మెదక్‌‌, యాదాద్రి కాలేజీల్లో ఫ్యాకల్టీ కొరత లేదన్నారు. ఎంబీబీఎస్‌‌ కౌన్సిలింగ్‌‌ మొదలయ్యేలోగా పర్మిషన్లు వచ్చేలా చర్యలు చేపడతామన్నారు. 

పెరిగిన ఏజ్

అదనపు మెడికల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ల పదవీ విరమణ వయసును 61 ఏండ్ల నుంచి 65 ఏండ్లకు పెంచుతూ ప్రభుత్వం గురువారం గెజిట్ విడుదల చేసింది. దీంతో అడిషనల్ డీఎంఈ పోస్టుల ప్రమోషన్లకు మార్గం సుగమం అయింది. 

ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో ప్రిన్సిపాల్స్‌‌గా, సూపరింటెండెంట్లుగా అడిషనల్ డీఎంఈలనే నియమిస్తారు. సీనియర్ ప్రొఫెసర్లను, అడిషనల్ డీఎంఈలుగా ప్రమోషన్ ఇచ్చి, వారినే ఈ పోస్టుల్లో నియమిస్తారు. ప్రస్తుతం ప్రొఫెసర్ల రిటైర్‌‌మెంట్ వయసు 65 ఉండగా, ఏడీఎంఈల వయసు 61 ఏండ్లు మాత్రమే ఉంది. దీంతో ఏడీఎంఈ ప్రమోషన్లు తీసుకోవడానికి ప్రొఫెసర్లు ముందుకు రాలేదు. సూపరింటెండెంట్‌‌, ప్రిన్సిపాల్ పోస్టులను ఇంచార్జులతోనే నెట్టుకొచ్చారు.

 ఇప్పుడు రిటైర్‌‌ మెంట్ ఏజ్‌‌ 65కు పెంచడంతో ఏడీఎంఈల కొరత తీరనుంది. త్వరలోనే సీనియర్ ప్రొఫెసర్లకు ఏడీఎంఈలుగా ప్రమోషన్ల ప్రక్రియ చేపడుతామని అధికారులు తెలిపారు.

హెచ్‌‌వోడీ పోస్టులకు కేబినెట్ ఓకే 

పబ్లిక్ హెల్త్ డైరెక్టర్, వైద్య విధాన పరిషత్ కమిషనర్, మెడికల్ కార్పొరేషన్‌‌ (టీజీఎంఎస్‌‌ఐడీసీ) మేనేజింగ్ డైరెక్టర్, డ్రగ్ కంట్రోల్ అథారిటీ డీజీ పోస్టులకు కేబినెట్ ఆమోదం తెలిపింది. రాష్ట్ర విభజన తర్వాత ఈ పోస్టులన్నీ ఏపీకి వెళ్లాయి. రెండు పర్యాయాలు అధికారంలో ఉన్న బీఆర్‌‌ ‌‌ఎస్, ఆయా పోస్టులను క్రియేట్ చేయకుండా ఇంచార్జీలతోనే నెట్టుకొచ్చింది.

 ఆయా పోస్టులను క్రియేట్ చేయాలని, సీనియర్లను వాటిలో నియమించాలని ఆఫీసర్లు కోర్టులకు వెళ్లినా బీఆర్‌‌ఎస్ సర్కార్ పట్టించుకోలేదు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ కూడా ఈ అంశంపై ప్రశ్నించింది. ఈ నేపథ్యంలోనే ఆయా పోస్టుల క్రియేషన్‌‌కు ఇప్పుడు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఉస్మానియా హాస్పిటల్ కోసం కొత్త బిల్డింగ్ నిర్మాణానికి కూడా కేబినెట్ ఆమోదం తెలిపినట్టు తెలిసింది.

8,715కు పెరిగిన సీట్ల సంఖ్య

రాష్ట్రంలో ప్రస్తుతం 28 ప్రభుత్వ, 28 ప్రైవేటు మెడికల్ కాలేజీలు ఉన్నాయి. మొత్తం 56 కాలేజీల్లో కలిపి 8,515 ఎంబీబీఎస్ సీట్లు ఉన్నాయి. తాజాగా మరో 4 కాలేజీల్లో 200 సీట్లు అందుబాటులోకి వచ్చాయి. దీంతో మొత్తం సీట్ల సంఖ్య 8,715కు పెరిగింది. కుత్బు ల్లాపూర్, మహేశ్వరం, మెదక్, యాదాద్రి కాలేజీలకు కూడా పర్మిషన్ వస్తే, మరో 200 సీట్లు పెరుగుతాయి. 

ఇవిగాక ఈసారి 3 ప్రైవేట్ మెడికల్ కాలేజీలు కూడా పర్మిషన్ల కోసం ఎన్‌‌ఎంసీకి దరఖాస్తు చేశాయి. నిజామాబాద్ నుంచి క్రిస్టియన్ మెడికల్ కాలేజ్‌‌, అబ్దుల్లాపూర్​మెట్​లోని నోవా ఇనిస్టిట్యూట్‌‌, పటాన్​చెరు నుంచి రాజరాజేశ్వరి ఇనిస్టిట్యూట్ ఈ లిస్టులో ఉన్నాయి. ఈ మూడు కాలేజీలకు పర్మిషన్లు వస్తే సీట్ల సంఖ్య 9 వేలు దాటనుంది.