ప్రేమ భయం పట్టుకుంటే..

బొద్దింకను చూస్తే అంత దూరం ఎగిరి గెంతుతారు కొందరు. ఇంకొందరు బల్లిని చూస్తే ఉలిక్కిపడతారు. ఇలా ఒక్కొక్కరికీ ఒక్కో రకమైన భయం ఉండటం సహజం. అలానే ప్రేమ అంటే భయపడేవాళ్లు కూడా ఉంటారు. ఈ భయాన్ని ఫిలోఫోబియా అంటారు. ఇది ఉన్న వాళ్లు ప్రేమను ఎక్స్​​పీరియెన్స్​ చేయాలనే ఆలోచన వచ్చినా వణికిపోతారు. 
ఇలా ఎందుకు జరుగుతుంది అంటే అంతకుముందు రిలేషన్​షిప్​లో ఎదురైన బ్యాడ్​ ఎక్స్​పీరియెన్స్, బ్రేకప్​, డైవోర్స్​, బాల్యంలో ఎదురైన చేదు అనుభవాలు... ఇలా ఎన్నో కారణాలు ఉంటాయి. వాటివల్లే ప్రేమించాల్సి వస్తుందేమో, ప్రేమను రిజెక్ట్​ చేస్తారేమో అనే భయాలు ఉంటాయి. ప్రేమలో పడతామేమో లేదా ప్రేమిస్తామేమో అనే భయం ఒక్కోసారి ఇలా వచ్చి అలా వెళ్లిపోతుంది.

అలాంటప్పుడు దాన్నో పెద్ద సమస్యగా చూడాల్సిన అవసరం లేదు. కానీ అది ఎక్కువయితే ఆలోచించాల్సిందే. అప్పుడు దాన్ని సాధారణమైన విషయంగా చూడకూడదు. దీన్ని  మానసికారోగ్య సమస్యగా వర్గీకరించకపోవచ్చు. కానీ భావోద్వేగాల మీద, రిలేషన్స్​ మీద దాని ప్రభావం కచ్చితంగా పడుతుంది అనేది మాత్రం వాస్తవం. లవ్​, రిలేషన్​షిప్​ విషయంలో ఒక్కొక్కరు ఒక్కోలా స్పందిస్తారు. అది వాళ్ల వ్యక్తిగత అనుభవాల నుంచి ఉంటుంది. ఏదేమైనప్పటికీ ‘ప్రేమలో పడతామేమో’ అనే భయం మాత్రం వ్యక్తుల జీవితాల మధ్య ప్రభావం చూపుతుందనేది వాస్తవం.

ఈ భయం నుంచి బయటపడేందుకు సైకలాజికల్ సపోర్ట్​ అవసరం.మనసుకు దగ్గరైన, నమ్మకమైన స్నేహితులు, కుటుంబ సభ్యులు లేదా థెరపిస్ట్​లు... ఎమోషనల్ సపోర్టు, గైడెన్స్​ ఇస్తారు ఈ విషయంలో. ఈ సపోర్టుతో పాటు ఎవరికి వాళ్లు జాగ్రత్తపడాల్సిన విషయాలు కూడా కొన్ని ఉన్నాయి. అవేంటంటే...

  • ఈ విషయంలో హడావిడి పనికిరాదు. టైం తీసుకోవాలి. ఏ విషయాలు భయపెడుతున్నాయనే దాన్ని అర్ధం చేసుకోవాలి. భయానికి కారణమైన పాత అనుభవాలను, నమ్మకాలను, నెగెటివ్​ ఆలోచనలు ఏవైనా ఉంటే వాటిని విశ్లేషించుకోవాలి. ఇలా చేయడాన్నే సెల్ఫ్​ రిఫ్లెక్షన్​ అంటారు. దీనివల్ల స్వీయ అవగాహన పెరుగుతుంది. దాంతో అసలు భయం అనేది ఎక్కడ మొదలైందనే విషయం తెలుసుకునేందుకు ఇది సాయం చేస్తుంది.
  • ప్రేమ, బంధాల​ గురించి ఒకవేళ నెగెటివ్​ నమ్మకాలు ఉంటే వాటిని తెలుసుకోవాలి. ఆ నమ్మకాల స్థానంలో సానుకూల​, వాస్తవ ఆలోచనల్ని నింపాలి. నెగెటివ్​ ఆలోచనల్ని రీషేప్​ చేయడంలో కాగ్నిటివ్​ బిహేవియరల్​ థెరపీ టెక్నిక్స్​ ప్రభావ వంతంగా పనిచేస్తాయి.
  • లవ్​, రిలేషన్​షిప్​కు సంబంధించిన పరిస్థితుల​కు నెమ్మదిగా ఎక్స్​పోజ్​ కావాలి. అలా నెమ్మదిగా బంధాన్ని బలపర్చుకోవాలి. అలా నెమ్మదిగా ప్రేమ దారి పట్టడం వల్ల నమ్మకం పెరుగుతుంది. భయాన్ని పోగొట్టుకోగలుగుతారు.
  •  మెడిటేషన్​ లేదా రిలాక్సేషన్​ ఎక్సర్​సైజ్​లు ప్రాక్టీస్​ చేయాలి. ఇవి యాంగ్జైటీని మేనేజ్​ చేసేందుకు పనికొస్తాయి. అలాగే వాస్తవ పరిస్థితులను అర్థంచేసుకునే స్థితి కలుగుతుంది.​ బుర్రలోకి వెల్లువలా వచ్చే ఆలోచనలకు ఈ టెక్నిక్స్ అడ్డుకట్ట వేస్తాయి. ప్రేమిస్తామేమో అనే భయానికి సంబంధించిన భావోద్వేగాలను అదుపులో ఉంచుతాయి. 
  •  ఒకవేళ గతం తాలూకు బాధాకరమైన జ్ఞాపకాలు లేదా పరిష్కారం కాని విషయాలు ఉంటే వాటినుంచి బయటపడేందుకు ప్రొఫెషనల్​ సాయం తీసుకోవాలి. థెరపీ వల్ల ఫలితం బెటర్​గా ఉంటుంది. గతంలోని బంధానికి సంబంధించిన ఎమోషనల్ పెయిన్​ నుంచి బయటపడి మనసు తేలికపడుతుంది. 
  • సెల్ఫ్​ కేర్​ యాక్టివిటీలు చేయాలి. ఆత్మస్థయిర్యాన్ని పెంచుకోవాలి. హాబీస్​ ఏవైనా ఉంటే వాటిని ప్రాక్టీస్​ చేయాలి. ఎవరిని వాళ్లు ప్రేమించుకోవడం​ అనేది చాలా ముఖ్యం. అలాగే ఎవరికి వాళ్లు తమతో తాము పాజిటివ్​ రిలేషన్​షిప్​లో ఉండాలి. సెల్ఫ్​ లవ్​కి స్ట్రాంగ్​ ఫౌండేషన్​ వేసుకుంటే ఇతరుల ప్రేమను ఆహ్వానించడం సులభం అవుతుంది.
  •  ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన విషయం మరోటి ఉంది. అదేంటంటే... ఏ రిలేషన్​షిప్​ కూడా పర్ఫెక్ట్​ కాదు. ప్రతీ ఒక్కరిలో మంచి చెడులు ఉంటాయి. అందుకని ప్రేమ, రిలేషన్​షిప్​ విషయంలో పెట్టుకునే ఎక్స్​పెక్టేషన్స్​ వాస్తవాలకు దగ్గరగా ఉండాలి. అందుకు భాగస్వాములు ఇద్దరూ ఎఫర్ట్​ పెట్టాలి. కొన్ని విషయాల్లో సర్దుకుపోవాలి. భాగస్వాముల మధ్య రిలేషన్​ గ్రోత్​ అనేది ఉండాలి.
  •  రొమాంటిక్​ రిలేషన్​షిప్​లో లోతుగా వెళ్లకుండా కనెక్షన్స్​ ఏర్పరచుకోవడంలో చిన్న చిన్న అడుగులు వేయాలి. కంఫర్ట్​ లెవల్​ను నెమ్మదిగా పెంచుకోవాలి. స్నేహం లేదా మామూలు మీటింగ్స్​తో ఇద్దరి మధ్యా కంఫర్ట్​ జోన్​ ఏర్పాటుచేసుకోవాలి. ఆ తరువాత నెమ్మదిగా ఎమోషనల్​గా లోతుగా వెళ్లాలి.

ఇలా వేసే ఒక్కో చిన్న అడుగు ప్రేమలో పడతామేమో అనే భయాన్ని నెమ్మదిగా వదిలేస్తూ ముందుకు వెళ్తున్నారు అనేదానికి గుర్తు. ఈ జర్నీలో ధైర్యం, ఎదుగుదల ఎలా ఉందనేది గమనించుకోవాలి. ఒకవేళ జర్నీ స్లోగా ఉందనిపించినా పర్వాలేదు. ఎందుకంటే అది పాజిటివ్​ మార్పులను తెచ్చేందుకు సాయపడుతుంది. అలాగే ముందుకు వెళ్లడానికి మోటివేట్​ చేస్తుంది. కానీ ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన విషయం ఒకటి ఉంది. అదేంటంటే... ఒక్కొక్కరి జర్నీ ఒక్కోలా ఉంటుంది. భయాన్ని వదిలి ముందుకు వెళ్లేందుకు కొంత టైం పట్టొచ్చు. అందుకని మార్పు రాలేదని కంగారు పడకుండా కాస్త ఓపిక పట్టాలి. అలాగే ఎవరి మీద వాళ్లకు ప్రేమ​ ఉండాలి.