సిమెంట్‌‌‌‌ ఫ్యాక్టరీ వద్దు : గో బ్యాక్‌‌‌‌ ఆదానీ.. గో బ్యాక్‌‌‌‌ అంబుజా అంటూ నినాదాలు

యాదాద్రి, వెలుగు : యాదాద్రి జిల్లా రామన్నపేటలో సిమెంట్‌‌‌‌ ఫ్యాక్టరీ ఏర్పాటు కోసం బుధవారం నిర్వహించిన ప్రజాభిప్రాయ సేకరణ ఉద్రిక్తతకు దారి తీసింది. ‘ఫ్యాక్టరీని ఏర్పాటు చేయొద్దు .. గో బ్యాక్‌‌‌‌ ఆదానీ, గో బ్యాక్‌‌‌‌ అంబుజా’ అంటూ ప్రజలు నినాదాలు చేస్తూ, ప్లకార్డులు ప్రదర్శిస్తూ ఆందోళనకు దిగారు. వివరాల్లోకి వెళ్తే... ఆదానీ గ్రూప్‌‌‌‌ ఆధ్వర్యంలో 2022లో రామన్నపేటలో భూములను కొనుగోలు చేశారు. డ్రైఫ్రూట్స్‌‌‌‌ ఫ్యాక్టరీ పేరుతో కొనుగోలు చేసిన భూముల్లో అంబుజా సిమెంట్‌‌‌‌ ఫ్యాక్టరీ ఏర్పాటు చేస్తున్నట్లు తెలియడంతో ప్రజలు మొదటి నుంచి వ్యతిరేకిస్తూ, ఆందోళనలు చేస్తున్నారు. 

ఫ్యాక్టరీ ఏర్పాటు కోసం పొల్యూషన్‌‌‌‌ కంట్రోల్‌‌‌‌ బోర్డు ఆఫీసర్లు బుధవారం రామన్నపేటలో ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టారు. కార్యక్రమానికి అడిషనల్‌‌‌‌ కలెక్టర్ పీ బెన్‌‌‌‌ శాలోమ్‌‌‌‌, కంట్రోల్‌‌‌‌ బోర్డు ఆఫీసర్ సంగీత హాజరయ్యారు. సమావేశం ప్రారంభం కాగానే.. ఫ్యాక్టరీని వ్యతిరేకిస్తూ ప్రజలు ప్లకార్డులు ప్రదర్శించారు. డ్రైఫ్రూట్స్‌‌‌‌ ఫ్యాక్టరీ పెడతామంటే ఉపాధి అవకాశాలు పెరుగుతాయని భూములు అమ్మామని, సిమెంట్‌‌‌‌ ఫ్యాక్టరీ కోసం అయితే భూములు ఇచ్చేవాళ్లమే కాదని స్పష్టం చేశారు. మూసీ కాలుష్యంతో ఇప్పటికే ఇబ్బందులు పడుతున్నామని, ఈ ఫ్యాక్టరీ వల్ల మరింత కాలుష్యం పెరుగుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఫ్యాక్టరీ ఓపెన్‌‌‌‌ అయితే పంటలపై, ప్రజల ఆరోగ్యంపై ప్రభావం చూపుతుందని ఆందోళన చెందారు. 

బార్‌‌‌‌ అసోసియేషన్‌‌‌‌ తరఫున వచ్చిన అడ్వకేట్లు కూడా ఫ్యాక్టరీ ఏర్పాటును వ్యతిరేకించారు. ఫ్యాక్టరీ ఏర్పాటుపై కోర్టును ఆశ్రయిస్తామని చెప్పారు. ఎమ్మెల్సీ కోటిరెడ్డి మాట్లాడుతూ ప్రజలకు ఉపయోగపడే కంపెనీలను స్వాగతిస్తామని, కానీ ప్రజల ఆరోగ్యాలను పాడుచేసే కంపెనీలను స్వాగతించబోమని స్పష్టం చేశారు. సమావేశంలో అంబుజా సిమెంట్‌‌‌‌ కంపెనీ ప్రతినిధులు మాట్లాడడానికి ప్రయత్నించారు. కానీ ప్రజలు ‘గో బ్యాక్‌‌‌‌ అంబుజా.. గో బ్యాక్ అదానీ’ అంటూ నినాదాలు చేస్తూనే ఉన్నారు. దీంతో కంపెనీ ప్రతినిధులు మౌనంగా ఉండిపోయారు. ప్రజాభిప్రాయ సేకరణ అనంతరం అడిషనల్ కలెక్టర్ బెన్‌‌‌‌ శాలోమ్‌‌‌‌ తిరిగి వెళ్లిపోతుండగా ప్రజలు కారును అడ్డుకున్నారు. వారిని పక్కకు తప్పించేందుకు పోలీసులు తీవ్రంగా ప్రయత్నించారు. ప్రజాభిప్రాయ సేకరణ సందర్భంగా 500 మంది పోలీసులతో బందోబస్తు నిర్వహించారు.

బీఆర్‌‌‌‌ఎస్‌‌‌‌ లీడర్ అరెస్ట్‌‌‌‌

రామన్నపేటలో నిర్వహించిన ప్రజాభిప్రాయ సేకరణ కోసం వస్తున్న నకిరేకల్, తుంగతుర్తి మాజీ ఎమ్మెల్యేలు చిరుమర్తి లింగయ్య, గాదరి కిశోర్‌‌‌‌, మాజీ ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్‌‌‌‌ను పోలీసులు అరెస్ట్‌‌‌‌ చేశారు. నల్గొండ మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్‌‌‌‌రెడ్డి, నల్గొండ బీఆర్‌‌‌‌ఎస్‌‌‌‌ అధ్యక్షుడు పల్లె రవీంద్రకుమార్‌‌‌‌ను హౌజ్‌‌‌‌ అరెస్ట్‌‌‌‌ చేశారు. బీఆర్‌‌‌‌ఎస్‌‌‌‌ లీడర్ల అరెస్ట్‌‌‌‌ను ఆ పార్టీ కార్య నిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్, మాజీమంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే గుండకండ్ల జగదీశ్‌‌‌‌రెడ్డి ఖండించారు.